హుండీ

హైదరాబాదు శ్రీనగర్ కాలనీ దగ్గరలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి గుడి భక్తులతో కిటకిటలాడుతోంది, కార్తీకమాసం కావడం మూలాన. సాయంసంధ్యలో దీపాలు పెట్టడానికి పోటెత్తిన భక్తులతో తేజోమయమైన వాతావరణం. పసుపు, బియ్యప్పిండి, అగరువత్తి, కర్పూరం, పూలు ఇత్యాదివన్నీ మిళితమైన, మనసుని నిరామయం చేసే, సుగంధపరిమళాలు పరిసరాలనంతా రంజింపచేస్తున్నాయి. నిర్దేశించిన ప్రదేశాల్లో నింపి ఉంచిన వివిధ దీపాలు – నిమ్మ, ఉసిరి, మట్టి ప్రమిదల్లో, తిమిరాన్ని తరుముతున్నాయి.

ప్రజ్ఞ కూడా అమ్మతో, చుట్టుపక్కల వారితో కలిసివెళ్ళింది దర్శనానికి. కార్తీకమాసమన్నా, సత్యనారాయణ స్వామి వ్రతమన్నా ప్రజ్ఞకి ఎంతో ఇష్టం, తన అమ్మమ్మ వలన. అమ్మమ్మలా తెల్లవారుజామునేలేచి మడిగా పుజాపునస్కారాలు చేయడం అలవాటు లేకపోయినా, ఆమె వలన ఇష్టమైతే ఏర్పడింది. దీపం వెలిగించి, దర్శనం చేసుకుని, దక్షిణ వేసి, భక్తిభావాన్ని మనసులో నిలుపుకుని ఇంటిముఖం పట్టారు ఆ బృందము.

మా మనవరాలు దేవుడి హుండీలో డబ్బులు వేస్తే ఏమి ఉపయోగం నాన్నమ్మ, ఆయనకేమీ లేదా, పోదా. ఆయనే మనందరికీ ఇస్తాడు కదా, మరలాంటప్పుడు ఆయనకెందుకు డబ్బులు ఇవ్వడం? ఆకలిగొన్నవానికి అన్నం పెడితే వాడి ఆకలితీరుతుంది, దుస్తులు లేని వారికి వస్త్రాలు ఇస్తే ఉపయుక్తంగా ఉంటుంది అని అంటుంది. మానవసేవే మాధవసేవ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా అని కూడా అంటుంది – నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నారు పక్కింటి రుక్మిణీదేవి గారు.

పోనీలెండి. ఈ కాలం పిల్లలతో వాదులాట దేనికి. సరేలే అంటే సరిపోతుంది, అన్నారు ఎదురింటి జానకమ్మ గారు.

అయితే మానవసేవ చేస్తుందా ఆంటీ అడిగింది ప్రజ్ఞ.

ఇంకా కాలేజీ చదువే కదా. సేవాతత్పరత, జాలిగుణం పుష్కలంగా ఉన్నాయి. వారి కాలేజీలో రక్తదానశిబిరాల్లో పాల్గొంటుంది. స్నేహితులతో కలిసి అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి వెళ్తుంటుంది. దానికి ఇచ్చిన డబ్బులో కొంతదాచి వాళ్ళ పనిమనిషి పిల్లలకి, వాచ్ మాన్ పిల్లలకి ఏమైనా కొనిపెడ్తుంటుంది, సరదాగా.

మరింకేమి ఆంటీ. మంచిపనులే చేస్తోంది కదా. తన పాకెట్ మనీలోంచి కూడా ధనాన్ని వెచ్చిస్తోంది, మెచ్చుకోలుగా అంది ప్రజ్ఞ.

మంచిదేనమ్మా. అది చేసే పనులను నేను కూడా మెచ్చుకుంటాను. కానీ దేవుడి హుండీలో వేయడం తప్పు, దేవుడికి డబ్బులెందుకు అనే ఆలోచన దాని మనసు నుంచి చెరిపేయడం ఎలా అన్నదే నాకు తెలియడం లేదు. ఈ కాలం పిల్లల్లో అలాంటి ఆలోచనలు ఉండకూడదు అని నా అభిప్రాయం. నేను చేసేదే మంచి, మిగతావి వృథా అనే భావం రాకూడదు. ఎవరి పద్ధతి వారిది అనుకోవాలి, తన మనసులో బాధ బయటపెట్టారు రుక్మిణమ్మగారు.

అంత ఆలోచించడం ఎందుకండి. దేవాలయాలు అన్నింటిలోను తీర్థ ప్రసాదాలు పంచుతారు, అన్నదానాలు చేస్తారు, అది కూడా సేవే కదా. ఎంతో మంది అన్నార్తులు కడుపునింపుకుంటారు కదా అని చెప్పండి అన్నారు జానకమ్మ గారు.

అయ్యో రామా! ఇలా చెప్పానండి. ఏమందో తెలుసునా. సగం మంది భిక్షగాళ్ళు బద్ధకిష్టులు, ఊరిమీదపడి తినేవారు, అలాంటివారికి పెట్టి మేపుతున్నట్టే అన్నదండి, నొచ్చుకున్నారు రుక్మిణమ్మగారు.

ఇంతలో వారి వీధికి వచ్చేసారు బృందమంతా. పక్కరోజు ఎన్నింటికి ఎవరింట్లో కలిసి భజన చేసుకోవాలో, గుడికి ఎన్నింటికి వెళ్ళాలో మాట్లాడుకుని ఎవరింటికి వాళ్ళు మళ్ళారు.

ప్రజ్ఞ ఆలోచనలో పడింది. ఇలా ఎప్పుడూ తను అనుకోలేదు కాబట్టి ఏమి చెప్తే ఆ అమ్మాయి అర్థం చేసుకోగలదు అన్నది ఊహకి అందలేదు. చూద్దాంలే అనుకుంది.

ప్రజ్ఞ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. తను, తనలాంటి భావజాలం కల మిత్రులు, సహోద్యోగులతో కలిసి సమయాన్ని సద్వినియోగం చేస్తుంది, అవకాశం దొరికినప్పుడల్లా. విద్యార్థులకి కళాశాల ఫీజులు కట్టడం, పేదవారి ఆసుపత్రికయ్యే ఖర్చులు భరించడం, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్ళడం లాంటివి చేస్తుంటారు అందరిలాగే.

పక్కరోజు తన స్నేహ బృందంతో ఈ విషయం చెప్పింది. అందరికీ వారు చర్చించుకున్న విషయాలే తట్టాయి కానీ, కొత్తగా ఏమీ తోచలేదు. సరే ఆలోచిద్దాము. ఎవరికైనా ఏమైనా తడితే పంచుకుందాము అనుకున్నారు.

వారు అలా మాట్లాడుకుంటుండగా, బెంగుళూరి నుంచి వారి స్నేహితుడు పవన్ ఈనాడు పత్రికలో వార్తని పంపాడు. గుంటూరులో 17 సంవత్సరాల భావన అనే అమ్మాయికి గుండెలో రంధ్రముందని అందుకు ఆపరేషన్ అవసరమవుతుందని, కానీ ఆమె కుటుంబానికి ఆ ఖర్చు భరించే స్థోమత లేదని. అయ్యో పాపం అనుకున్నారు. వారి స్నేహితుడు రవి గుంటూరుకి చెందినవాడే కావడంతో వారాంతంలో ఊరు వెళ్ళి ఆ కుటుంబాన్ని కలిసి వివరాలు సేకరించమన్నారు. ఈ సందట్లో గుడిలో హుండీ విషయం మరుగునపడిపోయింది.

మిగతా స్నేహబృందానికి మెయిల్ ద్వారా విషయం తెలియపరిచారు. ఇలా ఒక వార్త తెలిసిందని, రవి వెళ్ళి విషయాలు, వారి ఆర్థిక పరిస్థితి నిజమే అని నిర్థారిస్తే సహాయం చేయదలుచుకున్నామని, తోచిన ధనం విరాళంగా ఇవ్వమని. వెంటనే అమెరికాలో ఉండే చంద్ర, యశోద దంపతులు తాము 20 వేలు ఇస్తామని చెప్పడంతో వీరందరికీ ధైర్యం వచ్చింది.

ఈనాడు పత్రిక హెల్ప్ లైన్ రామకృష్ణ గారికి ఈ బృందం బాగా పరిచయమే వీరి కార్యకలాపాల ద్వారా. చాలా వరకు ఈనాడులో పడే వార్తలకి వీరు స్పందిస్తుంటారు కాబట్టి అడగగానే ఆయన గుంటూరు విలేఖరి నంబరు ఇవ్వడం, గుంటూరు విలేఖరితో మాట్లాడి భావన వాళ్ళింటి చిరునామా కనుక్కోవడం జరిగింది. విలేఖరి కూడా ఆ కుటుంబానికి నిజంగానే స్థోమత లేదని అందుకే హెల్ప్ లైన్ దృష్టికి తెచ్చామని చెప్పారు.

అనుకున్నట్టుగానే రవి ఆ వారాంతంలో గుంటూరు వెళ్ళి భావన వాళ్ళని కలిసాడు. వారి నాన్నగారు రామారావు గారు చిన్నచితకా పనులు చేస్తుంటారు. భావన అక్కకి పెళ్ళి చేసారు. భావన రెండో కూతురు. వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని నడుపుతారు. ఆమెకి, భావనకి ఇద్దరికి బొట్టు లేకపోవడం మూలాన, ఇంట్లో ఏసుక్రీస్తు బొమ్మ ఉన్న కారణాన వారు క్రైస్తవులు అని రవికి అర్థమైంది.

భావనకి చిన్నప్పుడే గుండెలో రంధ్రం బయటపడినా ఆ వయసులో చేయకూడదని ఆపేసారు. బహుశా అప్పటికి అందుబాటులో ఉన్న వైద్యం ప్రకారం అయి ఉండచ్చు. పెద్దయ్యాక వైద్యం చేయించమన్నారు. అప్పటికీ వారు ఒక సంవత్సరం క్రితం హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో చూపించుకుంటే సంవత్సరం ఆగి రమ్మని చెప్పారుట. ఎందుకో వారికి కూడా సరిగా గుర్తులేదు.

ఇంట్లో చిన్నపిల్ల కావడం, ఈ ఆరోగ్య పరిస్థితి ఉండడంతో ఉన్నదాంట్లోనే ముద్దుగా పెంచుకున్నారు. అందుకే ఆ అమ్మాయికి అల్లరి, మొండితనం ఎక్కువే. కాకపోతే శ్రమ తీసుకోలేదని బడి మానిపించారు, ఆటలు ఆడనివ్వలేదు, ఇంట్లో కూడా బరువైన పనులేవీ చెప్పరు. కానీ తనకి చదువంటే చాలా ఇష్టం. డాక్టరు అవ్వాలి లేదా కనీసం నర్సునైనా అవుతాను అంటూ ఉంటుందట. ఏ మాత్రం కొత్త, బెరుకు లేకుండా ఎంతో ఉత్సాహంగా మాట్లాడిందిట. అన్నా, నాకు సర్జరీ చేయిస్తే నేను చదువుకుంటాను అని చెప్పిందట.

రవి భావన వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే హైదరాబాదులో ఉండే స్నేహబృందంతో మాట్లాడించాడు. అక్కయ్య, అన్నయ్య అని అందరితోను సరదాగా మాట్లాడింది. తన ఆరోగ్యపరిస్థితి గురించి అవగాహన ఉన్నా, భయం లేదు, పెద్దవారిలాగా నాకే ఎందుకు ఇలా అని తన మీద తనకి జాలి లేదు. నీకు డాక్టర్లు, ఆసుపత్రి, ఇంజెక్షన్లు అంటే భయంలేదా అని అడిగింది ప్రజ్ఞ. లేదక్కా. నేను చదువుకోవాలి, నర్సుని అవ్వాలి అన్నది. ఆ అమ్మాయి అందరికీ నచ్చేసింది. నిమ్స్ ఆసుపత్రిలో మాట్లాడి వాళ్ళకి కబురు పంపుతామని రవి వీడ్కోలు తీసుకున్నాడు వారి దగ్గర.

హైదరాబాదులో ప్రజ్ఞ, కశ్యప్ నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి డా!! కృష్ణ గారిని కలిసారు. ఒక పాపని సంవత్సరం తరువాత కలవమన్నారుట, గుండెలో రంధ్రానికి ఆపరేషను చేయాలి అంటే, సంవత్సరం క్రితం అంటున్నారు ఎలా గుర్తుంటుందమ్మా, రమ్మనండి చూస్తాము అని అన్నారు. ఖర్చు గురించి అడిగితే ముందు వచ్చి చూపించుకొనమనండి అన్నారు. ఆయన ఓపి ఎప్పుడెప్పుడు ఉంటుందో కనుక్కుని భావన వాళ్ళకి విషయం చేరవేసారు.

ఒక వారం తరువాత వాళ్ళు వస్తున్నామని చెప్పారు. చూపించుకున్నారు. ఇప్పుడు చేరితే అన్ని పరీక్షలు చేసి ఆపరేషను చేయగలమని చెప్పడంతో వారు అడ్మిట్ అయ్యారు.

ప్రజ్ఞ మిత్రబృందమందరూ ఇంచుమించు నిమ్స్ కు దగ్గరలో ఉండే ఆఫీసుల్లో పనిచేస్తున్నవారే, బేగంపేట, బంజారా హిల్స్, అమీర్ పేట ఇలాగ. కాబట్టి అందరూ లంచ్ టైములో కానీ, సాయంత్రం ఆఫీసు అయిపోయిన తర్వాత కానీ వచ్చి కలిసేవారు. అందరితోను భావన ఇంట్లో పిల్లలా కలిసిపోయింది.

ఈలోపు కశ్యప్ నిమ్స్ లోనే పనిచేసే తన పిన్నిగారి ద్వారా డైరెక్టరు గారి సెక్రటరీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒకరోజు మధ్యాహ్నం ఆవిడని కలవడానికి నిమ్స్ లో కలిసారు.

కశ్యప్! ఏదో భావన కోసమని వచ్చానే కానీ, ఆసుపత్రన్నా, ఆసుపత్రి వాతావరణమన్నా, డాక్టర్లన్నా, ఇంజెక్షన్లన్నా నాకు చాలా భయమండి అని ప్రజ్ఞ అన్నది.

అవునండి ప్రజ్ఞ గారు, మాకు మాత్రమే భయం లేదు. రోజూ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లందరితో డ్యుయెట్ పాడుకుని వెళ్తుంటాము అని వ్యంగ్యంగా అన్నాడు. కొంచెం అర్థమవ్వడానికి ఆలస్యమై, అర్థమవగానే తెగ నవ్వొచ్చి అప్పటికి భయమనే మాట మర్చిపోయింది ప్రజ్ఞ.

సెక్రెటరీ గారిని కలిసారు. భావన కుటుంబం వివరాలు, వారు వీరికెలా తెలుసు అని అడిగారు. విషయమంతా వివరంగా చెప్పారు కశ్యప్, ప్రజ్ఞలు . ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారని కనుక్కున్నారు. మీరు ఎంత కట్టగలరు అని అడిగారు, ఒక ఇరవై వేలు కట్టగలరని చెప్పడంతో, సరే అయితే. డైరెక్టరు గారికి చెప్తానన్నారు.

భావన కన్నా క్రిటికల్ కేసులు రావడం వల్ల అయితేనేమి, మరే ఇతర కారణాల వల్ల అయితేనేమి భావనకి సర్జరీ చేయడానికి వారు ఆసుపత్రిలో చేరిన ఇరవై రోజుల తరువాత తేదీ కుదిరింది. అన్ని రోజులు సత్య, రవి, వాణి, చైతన్య, సత్య సహోద్యోగులు రోజూ భావనని కలుస్తూ ఉన్నారు. భావన క్రిష్టియన్ కావడంతో క్రిష్టియన్ నర్సులు రోజూ మధ్యాహ్నం ఆ అమ్మాయి చేత ప్రార్థన చేయించేవారు. (ఎవరి పనులకి ఆటంకం లేకుండానే).

రోజూ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఆ అమ్మాయికి విజిటర్స్ అంటే మిత్రబృందంలో ఎవరో ఒకరు ఉండేవారు. ఆ అమ్మాయి స్వభావానికి ఆమె చుట్టూ ఉండే పేషంట్లతో కూడా స్నేహం చేసింది. వారు కూడా బృందమందరికీ పరిచయమైపోయారు. సర్జరీ అవలేదు వార్డులోనే ఉంది కాబట్టి, అందరూ ఒకసారిగా వెళ్ళరు కాబట్టి, వెళ్ళినప్పుడు కూడా ఎవరికీ ఏ రకమైన ఇబ్బంది కలుగచేయరు కాబట్టి వీరిని ఎవరూ, ఎప్పుడూ అడ్డగించలేదు.

ప్రజ్ఞ సహజంగా ఆఫీసు అయిపోయాక సాయంత్రం వెళ్తుండేది. శ్రీనగర్ కాలనీలో ఉండేవారు కాబట్టి, పంజగుట్టలోని నిమ్స్ నడిచే దూరంలోనే ఉండేది. కొంచెంసేపు భావనతోను, మరికొంతసేపు వాళ్ళ నాన్నగారు రామారావుగారితోను మాట్లాడేది. అలా ఒకసారి మాటల సందర్భంలో తాను ఒక మూడురోజులు రాలేనని, తిరుమల వెళ్తున్నామని చెప్పింది. అప్పుడు ఆయన నడిచి ఎక్కుతారా అని అడిగారు, లేదు బస్సులోనే అని చెప్పింది. చిన్నప్పుడు నేను, నా స్నేహితులు పోటీపడి కొండెక్కే వాళ్ళం అని చెప్పాడు. ఓహో అయితే ఈయన కన్వర్టెడ్ ఏమో అనుకుంది. కానీ ఏమీ మాట్లాడలేదు ఆ విషయం గురించి అతనితో.

భావన ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో ఒకసారి ప్రజ్ఞకి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి భావనకి గొంతు కొట్టుకుంటోందని, తననే కలవరిస్తుందని రమ్మని చెప్పారు. ఉన్నపళంగా ఆఫీసులో పర్మిషన్ తీసుకుని బయలుదేరింది. భావనని ఆ స్థితిలో చూసి భయం వేసింది. తను వెళ్ళేలోపు నర్సులు వచ్చి చూస్తూ ఏవో చేస్తున్నారు, డాక్టరు చెప్పిన ప్రకారం. ప్రజ్ఞ వెళ్ళి తన చేతిని పట్టుకుని కొంచెంసేపు అవగానే గొంతు దగ్గర కొట్టుకోవడం ఆగింది. ఆశ్చర్యపోయింది. ఈ అమ్మాయి మా మీద ఇంత ప్రేమని పెంచుకుందా అని. ఆ క్షణాన ఉన్నది తానైనా, భావనతో మిత్రబృందమందరూ సమయం గడిపారు కదా. చిన్నపిల్ల, చలాకీ పిల్ల, తనని సంతోషంగా ఉంచితే మానసికంగా మరింత ధృఢంగా ఆపరేషనుకు సిద్ధమవుతుందని వారందరి ఆశ. అందుకే ఎన్ని పనులున్నా ఏదో ఒక సమయంలో ప్రతిరోజూ వచ్చి పలకరించేవారు.

విషయం ఏమిటంటే వారి మిత్రులు డాక్టర్ సుందర్ గారి వివాహం తనకి సర్జరీ జరిగే వారంలోనే ఉంది. ప్రజ్ఞ మరియు మిత్రబృందం విశాఖపట్నం వెళ్తారు, ఇక్కడ ఉండరు అని తనకి తెలిసింది. అక్కా, సర్జరీ అప్పుడు నాతో ఉండవా అని అడిగింది. ప్రజ్ఞకి ఏమి చెప్పాలో తోచలేదు. వారి నాన్నగారు కూడా మీరు ఉంటే మాకు ధైర్యంగా ఉంటుందమ్మా అన్నారు. ప్రజ్ఞ మనసులో అయ్యో, నాకే భయమని వీళ్ళకెలా చెప్పను అనుకుంది. వారి మాటను కాదనలేక తన టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంది.

సర్జరీ రోజు మిత్రబృందమందరూ, హైదరాబాదు, బెంగుళూరు, విశాఖపట్నం, చెన్నై, అమెరికా ఇలా ఎక్కడ ఉన్నా ఈ అమ్మాయి కోసం దేవుడ్ని ప్రార్థించారు. అలాగే ఆసుపత్రిలోని తన తోటి పేషంట్లు కూడా. సర్జరీకి భావన చాలా ధైర్యంగా వెళ్ళింది. ప్రజ్ఞకి మాత్రం భయంగా ఉంది. పైకి మాత్రం నేను మాట ఇచ్చినట్లుగా నీతో ఉన్నాను, ఇక్కడే ఉంటాను ధైర్యంగా వెళ్ళు అని చెప్పింది.

సర్జరీ జరిగినంతసేపు క్షణమొక యుగంలా గడిచింది. డాక్టరు బయటకి వచ్చి రామారావు గారితో ఏదో చెప్పారు సర్జరీ తర్వాత. భయంతో ఉందేమో ఒక్క క్షణం గుండె ఆగి కొట్టుకున్నట్టయింది, ప్రజ్ఞకి. ఆయన ఏమి చెప్పారో అర్థం కాలేదు. ఆపరేషన్ విజయవంతమయింది, దూరం నుంచి చూడచ్చు అని చెప్పారట. ప్రజ్ఞ కళ్ళలోంచి నీళ్ళు జలజలా రాలాయి. అంత వరకు ఘనీభవించిన భయమేఘాలు, విజయపు గాలి వీచగానే కన్నీళ్ళై కురిసాయి.

మరొక వారం రోజులు వారు ఆసుపత్రిలోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయే ముందురోజు సాయంత్రం కలిసింది ప్రజ్ఞ. పక్కరోజు ఆఫీసు ఉంటుంది కాబట్టి, ఆఫీసు సమయంలో కలవలేదు కాబట్టి. రామారావు గారితో మాట్లాడుతూ ఉంది. ఆయన చాలా కృతజ్ఞత వ్యక్తం చేసారు.

అమ్మా, మీరందరూ ఎక్కడివాళ్ళు, మీరెవరు, మేమెవరం, ఎవరూ ఎవరికీ తెలియదు కదా, అలాంటిది ఇన్ని రోజులు మీరు మా మీద, మా అమ్మాయి మీద ఇంత ప్రేమని కురిపించారే మేము ఎప్పటికీ మర్చిపోలేము అని అన్నారు. ఆసుపత్రిలో అందరూ కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారమ్మా అన్నారు.

మేము నిమిత్తమాత్రులమండి, మీకు, మీ కుటుంబానికి మీరు నమ్ముకున్న భగవంతుని అనుగ్రహముంది, అందుకే మా రూపేణా మీకు సాయం చేసారు, అన్నది.

అప్పుడు ఆయన, అమ్మా ఈ మాట వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను రోజుకి ఒక వంద సంపాదిస్తాను అటుఇటుగా. ఇంటికి వెళ్ళేకంటే ముందే నేను మా వీధిలోనే ఉండే ఒక చిన్న చర్చికి వెళ్తాను. జీసస్ కి నమస్కరించి హుండీలో ఒక పది రూపాయలు వేసి అప్పుడు ఇంటికి వెళ్తాను, ఒకవేళ ముందు ఇంటికి వెళ్తే నా మనసెక్కడ మారిపోతుందేమో అని.

మా చర్చిలో నాతోటి వాళ్ళందరూ నన్ను వెక్కిరించేవారు, రోజూ పదిరూపాయలు వేస్తున్నావే ఏ బ్యాంకులో నీకు డబ్బులున్నాయని. ఆ దేవుడి బ్యాంకులో ఉందిలే అనేవాడిని. ఇప్పుడు అదే కదమ్మా జరిగింది. నేనేమి ఖర్చుపెట్టాను. నాకు స్థోమత లేదు కదా. ఆ బ్యాంకు నుంచే కదమ్మా ఇప్పుడు నాకు ధనమే కాదు, ఆదరాభిమానాలు కూడా దొరికాయి అని.

ఈ మాటలు వినగానే స్నిగ్ధకేదో స్ఫురించింది. రామారావుగారి దగ్గర శెలవు తీసుకుని గబగబా ఇంటికి వెళ్ళింది. తన ఇంటికి కాదు, పక్కింటికి, రుక్మిణీ ఆంటీ వారింటికి. తనకు తెలుసు భక్తబృందమందరూ అంతకు కొద్దిసేపు ముందే ఇంటికి చేరి ఉంటారని.

ఆంటీ! ఆంటీ! అనుకుంటూ హడావుడిగా వెళ్ళింది. ఏంటి ప్రజ్ఞా, ఏమిటి అంత ఆతృతగా ఉన్నావు అని అడిగారావిడ.

ఆంటీ, ఇప్పుడు మీరు మీ మనవరాలికి దేవుని హుండీ గురించి వివరంగా చెప్పగలరు అంది.

ఏమని చెప్పను, అడిగారావిడ కుతూహలంగా.

ఎవరి మనసుకి నచ్చినట్టుగా వారు మంచిపనులు చేయచ్చు. ఇలాగే చేయాలి అని ఎవరూ చెప్పరు. అయితే దేవుడి హుండీలో నిస్వార్థంగా వేసిన ధనమేదైతే ఉందో, అది ధన రూపేణానే కాకుండా మరెన్నో విధాలుగా మనకే అందుతుంది. హుండీ అంటే భగవంతుడికి ధనమిచ్చే పేటీ కాదు, ఎప్పటికీ ఐపి పెట్టని బ్యాంకు. ఆయనకేదో మనం ఇవ్వడం లేదు, ఆయన దగ్గర దాస్తున్నాము, మరెన్నో రెట్లు తిరిగిపొందుతాము. ఉదాహరణగా రామారావుగారి ఉదంతం చెప్పింది.

రుక్మిణమ్మగారు కూడా సంతోషించారు. తన మనవరాలు ఈ వివరణతో సంతృప్తిచెందుతుందని ఆవిడకి నమ్మకం కలిగింది.

ఆ మాట విన్నాక ఎంత హడావుడిగా వచ్చిందో అంతే హడావుడిగా తనింటికి వెళ్ళింది ప్రజ్ఞ. ఇంకేముంది. మిత్రులందరికీ ఈ విషయం చెప్పడానికి మెయిల్ చేసేందుకు ఉపయుక్తమైంది.

Your Comments and Suggestions Enhance Our Work. Do Share Your Opinion.