రాకేష్ కుమార్ దుబ్బుడు

రాకేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఇంత వరకు కలిసిన వాళ్ళల్లో హీరో అనిపించిన మొదటి వ్యక్తి.

ఈ అబ్బాయిని నేను సెప్టెంబర్ 17, 2007 న కలిసాను, చాలా విచిత్రంగా. ఆ రోజు ఉదయం నాకు ఒక ఈ మెయిల్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి !! ఫిఫ్త్ పిల్లర్ అనే సంస్థ అధ్యక్షులైన విజయ్ ఆనంద్ గారి నుంచి. అంతకు కొద్ది రోజుల ముందే వారి గురించి చదివాను. లంచం ఇవ్వము, పుచ్చుకోము అని ముద్రించిన సున్నా నోటుతో వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించేందుకు ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో విజయాలు సాధించారు. అలాగే సమాచార హక్కు గురించి తమిళనాడులో బాగా ప్రచారం చేసి, ప్రజలు, చిన్నపిల్లలతో సహా, ఉపయోగించుకునేంత ప్రాచుర్యంలోకి తెచ్చారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ రోజు ఉదయం మెయిల్ చేస్తే , ఆ రోజు సాయంత్రమే కలిసాము ఎఫ్. అర్ . ఎఫ్ మరియు సహాయ గ్రూపు సభ్యులతో కలిసి. ఆ సమావేశానికి ఈ అబ్బాయి వచ్చాడు.

సమాచార హక్కు చట్టం గురించి విజయ్ ఆనంద్ గారు చెప్తూ ఉన్నప్పుడు మధ్యమధ్యలో ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితి గురించి ఇతన్ని ప్రశ్నలు అడిగారు. చాలా చక్కగా సమాచారం ఇచ్చాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మాతో పాటు వింటున్నాడు. కానీ అన్నీ తనే చెప్పేస్తున్నాడే అనుకున్నాను. విజయ్ ఆనంద్ గారు మాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళిపోయారు (మేము నిర్వర్తించలేదు 🙂 ).

అప్పుడు మేమందరం ప్రశ్నల వర్షం కురిపించాము. మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అంటూ. ఇతను సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోవడానికి రాలేదు 🙂 విజయ్ ఆనంద్ గారిని కలవడానికి వచ్చాడు 🙂 అప్పుడు తన గురించి వింటూ ఉంటే మొదట కలిగిన భావం ఏమిటంటే సినిమాల్లో చూపించే హీరో పాత్రని ఈ వేళ నిజంగా చూస్తున్నాను అని. నేనే కాదు తన గురించి తెలుసుకుంటే మీరు కూడా అలాగే అనుకుంటారు.

తనంతట తానుగా సమాచార హక్కు చట్టాన్ని గురించి తెలుసుకుని సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్లు ఫైల్ చేసేవాడు. పోనీ అవేమైనా చిన్న విషయాల మీదనా అంటే కాదు. కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ వ్రాయదలుచుకోలేదు, అవి ఏంటి అని. కావాలంటే తన బ్లాగ్ చూడండి. ఇదొక్కటే కాదు. అతను భూమి స్వచ్చంద సంస్థ సహ వ్యవస్థాపకుడు (నేను అప్పటికి కొన్ని రోజుల ముందే భూమి గురించి విన్నాను).  ఇంతా చేస్తే అతని వయసు ఎంత!! నాకన్నా నాలుగేళ్ళు చిన్న.

ఆ రోజు వరకు నాకు అవినీతికి వ్యతిరేకంగా ఓ ఆయుధం ఉంది, మనం కర్ర విరక్కుండా, పాము చావకుండా ప్రయత్నించవచ్చు అనే విషయం తెలీదు. దానికి తోడు రాకేష్ ని గురించి తెలిసాక మాత్రం అనుకున్నాను. నాకు ఎలాగూ ధైర్యం లేదు. ఆలోచనలు లేవు. కానీ ఈ అబ్బాయి ప్రయత్నాలకి ఉడత సాయం లాగానైనా ఉండాలి అనుకున్నాను. ఆ రోజు తను చెప్పింది ఏమిటంటే సమాచార హక్కు చట్టం గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. దీన్ని గురించి ప్రచారం చేయడం ఎంతో అవసరం అని. అప్పటికప్పుడే నిర్ణయించాము దీన్ని గురించి అవగాహనా సమావేశాలు ఏర్పాటు చేయాలని.

వ్యక్తిగా చెప్పాలంటే ఏ మాత్రం గర్వం లేని మనిషి. తన మీద తనకి విశ్వాసం ఎక్కువ. తనకంటూ నిర్దుష్టమైన లక్ష్యం, ఆ లక్ష్యం పట్ల నిబద్ధత, అనుకున్నది అనుకున్నట్టు చేసే క్రమశిక్షణ ఉంది. ఇలాంటి యువకులు ఉంటే మనం దేశం ఎటు పోతుందా అనుకోనక్కరలేదు. ఎందుకంటే అభివృద్ధి మార్గంలోనే నడిపించేందుకు కంకణం కట్టుకుని ఉంటారు కనుక. అతనే ఓ సైనికుడు అని ఈనాడు లో వచ్చిన వ్యాసం ఓ చక్కని నిర్వచనం.

ఈ లంకెలు చూడండి:

http://www.bhumi.in

 http://rakesh-will-do-it.blogspot.com/

ప్రకటనలు

ఫయాజ్

ఈ అబ్బాయి నాకు పవన్ ద్వారా పరిచయం. పవన్ డిసెంబరు 9 సమావేశం గురించి ఫయాజ్ కి చెప్పి నా నంబరు ఇచ్చి కలవమని చెప్పాడు. ఫయాజ్ నెల్లూరికి చెందిన వాడు కావడం వలన స్నేహితుల ద్వారా పవన్ గురించి తెలిసింది.

ఆ రోజు సమావేశంలో హడావిడి మూలాన నాకు మొదటి విభాగం అనగా ఉదయాన జరిగిన పరిచయాలు వినడం కుదరలేదు. ఆ తరువాత ఈ అబ్బాయి నుంచి ఎలాంటి వర్తమానం లేదు. ఏమిటోలే అనుకున్నాను. నా ప్రయత్నం నేను చేయడమే కానీ ఫలితం గురించి నిరాశపడడం లేనందున పెద్దగా పట్టించుకోలేదు.

ఆ తరువాత తను ఫోన్ చేసాడు. నేను రాజేంద్రనగర్ లో ఒక కళాశాలకు వెళ్ళాను. దాని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏదైనా ఒక పని చేసి మాత్రమే మీ దగ్గరకు రావాలనుకున్నాను అని చెప్పాడు.

ఆ సాయంత్రం తను వెళ్ళిన కళాశాల గురించి చెప్పాడు. ఇక మిగతా అందరూ రావడంతో ఆ చర్చ ముగిసింది. తరువాత మా ఇంటికి వచ్చి మాట్లాడుకున్నాము. ఎంతగా నచ్చాడో చెప్పలేను. నిజంగా చాలా ముచ్చటేసింది తను చెప్పినవన్నీ వింటుంటే. ఆ వయసులో నాకు అంత చొరవ, ధైర్యం, నిర్ణయాత్మకత లేకపోయిందే అనిపించింది. దానికి తోడు ఒకటే నవ్విస్తాడు. చాలా సంతోషం వేసింది తనతో పరిచయం కలగడం.

ఓ వ్యక్తిని తెలుసుకోవడానికి ఎన్నో యుగాలు పట్టచ్చేమో. కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ స్పష్టత, కళ్ళలో తీక్ష్ణత, వారి అనుభవాలు వింటే ఆ వ్యక్తేమిటో అర్థం కావడం అంత కష్టం కాదేమో. ఆ ఒక్క సమావేశమే ఈ అబ్బాయి పట్ల నాకు గౌరవాన్ని కలిగించింది.

కొన్ని ఉదాహరణలు:

తను, తన స్నేహితులు ఓ సంస్థను పెట్టి సేవ చేయాలి అనుకున్నప్పుడు వారికి ఏమీ తెలీదు. అంటే ఎలా నమోదు చేయించుకోవాలి, విధి విధానాలేమిటి అని.  నెల్లూరులో అడిగితే రకరకాల చోట్లకి తిప్పారు. అయినా పట్టు వదలకుండా పని పూర్తిచేసుకున్నారు.

బ్యాంకు అకౌంట్ తెరవడానికి వెళితే ఓ మేనేజరు… ‘మీ ఉద్యోగాలు మీరు చేసుకోక ఇవన్నీ మీకెందుకయ్యా  అని అన్నారట. ‘మీ లాంటి వారుండబట్టే దేశం ఇంకా ఇలాగే ఉంది ‘ అని ఠక్కున జవాబిచ్చాడట.

తను ముస్లిం కదా. మాంసాహారం మానేయాలని నిర్ణయించుకుని చాలా నెలలు తిననేలేదట. అప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ బ్రాహ్మల అమ్మాయిని ప్రేమించావేమిట్రా అని ప్రశ్నించారట 🙂

తనకి వేశ్యవృత్తిలో ఉండే వారిని, HIV రోగుల పట్ల ప్రత్యేకమైన అభిప్రాయం. HIV పిల్లల వసతి గృహానికి వెళ్ళినప్పుడు తన హృదయం ఎలా చలించింది చెప్పాడు. అలాగే ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారో అని కలిగిన భయం గురించి కూడా.

ఓ సమావేశానికి హాజరు కావడానికి అక్కడివరకు వచ్చి కూడా ఎందుకు వెళ్ళిపోవాల్సొచ్చింది తను చెప్పినప్పుడు ఆ నిజాయితీ నచ్చింది.

అలా ఫయాజ్ ఓ మంచి స్నేహితుడయ్యాడు. నేను నమ్మదగిన వ్యక్తుల్లో ఒకరిగా మారాడు. సొంత ఊరైన నెల్లూరులో పనులు చేయడానికి ఓ మంచి గ్రూపు పరిచయం అయింది.

ఫయాజ్ వాళ్ళ గ్రూపు పేరు మాతృ అనురాగ.