ఆ కొంచెం సేపు —

earthhourcandles.jpg

చీకటిలో, చీకటితో నేను – భూమి ఘడియలో నా ప్రహసనం  

రోజీ వాళ్ళకి రాధిక గారు పంపిన బియ్యపు బస్తాలు, నా పాత దుస్తులు కొన్ని, బ్రైనోవిటా ఆట ఇచ్చేసి మా మామ వాళ్ళింటికి వెళ్ళి పాత బట్టలు తీసుకుని వచ్చేసరికి 6:45 అయింది. మళ్ళీ మెయిల్స్ ఒకసారి చూసుకుని, కొవ్వొత్తులు కొనడానికి వెళ్ళాను.

మేము వాళ్ళకి బాగా పరిచయం. కొవ్వొత్తులు ఎందుకు కొంటున్నానో చెప్పాను. వాళ్ళు ఆసక్తి చూపించరేమో అనుకున్నాను కానీ చాలా కుతూహలంతో విన్నారు. మనమే ఆపేయాలా, ప్రభుత్వం తీసెయ్యదా అని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత మంచి మనస్తత్వమా అని.

గబగబా ఇంటికి వచ్చేసి కొవ్వొత్తులు వెలిగించి, విద్యుత్తు పరికరాలన్నీ ఆపేసాను. ఈ కొవ్వొత్తుల స్టాండులను (తెలుగులో ఏమనవలెను)  కొని చాలా రోజులైనా వాడడం ఆ రోజే. వీటికి ఓ చిన్న కథ ఉంది. వీటిని కార్గిల్ యుధ్ధంలో చిత్రహింసల పాలు బడి వీరమరణం పొందిన కెప్టెన్ సౌరభ్ కాలియా కోసం కొన్నాను. కానీ విమానంలో సామాను బరువుకి కొలబద్దలున్నందున పంపడం వీలు కాలేదు.

తర్వాత ఆకలి వేయడంతో బొప్పాయి పండు కోసాను. అందరూ కొవ్వొత్తుల భోజనం చేస్తే నేను కొవ్వొత్తుల వంట చేసాను. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి, టమాటా కూరకి సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఫోన్ల మీద ఫోన్లు. మా కక్క (బాబాయి) తర్వాత రవి, తర్వాత ఫయాజ్, తర్వాత సురేష్ గారు ఫోన్లు చేసారు.

ఇంతలో మా తమ్ముడు వచ్చాడు. ఇక హింస వాడికి 🙂 ఫోటో తియ్యమని ఒకటే గొడవ.

 eh_prasu2.jpgeh_prasu5.jpgearth-hour_prasu.jpg

అసలు కెమెరా చార్జర్ పోగొట్టుకున్నాను. లేకపోతే కత్తిలాగా వచ్చేవి ఫోటోలు 🙂 జూన్ 15 నాడు చేసే బత్తీ బంద్ లో పథకం ప్రకారం అన్నీ చేస్తాను 🙂

మా కక్క ఫోన్ చేసినప్పుడు విద్యుత్ ఆపేయండి కక్కా అని చెప్తే నేను బస్సులో ఉన్నానమ్మా అన్నారు. తర్వాత విషయం విని, పర్లేదులే మాకు 6 నుంచి 8 వరకు విద్యుత్ కోత ఉండింది. మేము చేసినట్టే లెక్క అన్నారు 🙂

ఫయాజ్ ఏమో వల కార్యాలయంలో ఉన్నాడట మెయిల్స్ చూసుకోవడానికి. నేను చెప్పగానే వాళ్ళ కాలేజీలోని అమ్మాయిలకి, అబ్బాయిలకి ఫోన్ చేసి చెప్పాడట. వాళ్ళు ఆపేసారటా. ఒకమ్మాయి ప్రశ్నలు అడిగిందట. ఎందుకు ఆపేయాలి? ఆపేయడం వలన భూమి వేడెక్కకుండా ఎలా అడ్డుకున్నట్టు అని. తర్వాత చెప్తాను. ముందు ఆపేయండి అన్నాడట. వాళ్ళలో చాలా మంది ఎర్త్ అవర్, భూమి ఘడియని పాటించారట.

మా టిమేడ్ సభ్యులలో రవి, నేను, వాణి భూమి ఘడియని పాటించాము.

నేను బొప్పాయ కాయ (అవును అది పండు కాదు. కాయే 😦 ) కోసినప్పుడు మిగిలిన గింజలు, అలాగే టమాట కూర చేయడానికి అన్నిటినీ తరిగినప్పుడు మిగిలే చెత్త చూసి చెత్తని నిర్వహించే పధ్ధతి బాగుగా చేస్తే ఎలా ఉంటుందా అనిపించింది. మారాలి అని నిశ్చయించుకుంటే మార్చుకోవలసినవి ఎన్నో కదా !!

జూన్ 15 వ తారీఖున మేము బత్తీ బంద్ నిర్వహిస్తున్నాము. బత్తీ బంద్ అన్నది పరిష్కారం కాదు. కాకపోతే ప్రకృతిని మనం ఎన్ని విధానాలుగా నాశనం చేస్తున్నామో తెలుసుకునేందుకు ఒక మొదటి అడుగు. బత్తీ బంద్ కోసమే ఓ కొత్త బ్లాగు మొదలెడ్తాను. మీరందరూ కూడా అందులో పాల్గొనాలని మనవి. మంచి మంచి విభాగాలు పెట్టుకుని రోజూ చర్చించుకుందాము. మార్పు దిశగా ఓ అడుగు ……. కలిసి వేద్దాం, సదాశయ సాధనకై అందరం చేయి కలుపుదాము.

మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ…మీ అందరి బ్లాగుల నుంచి బత్తీ బంద్ బ్లాగుకి లంకె ఇవ్వండి. బత్తీ బంద్ చేసి మీ అనుభవాలు, ఆలోచనలు పంచుకోండి.

ప్రకటనలు

ఎర్త్ అవర్: భూ గ్రహం కోసం ఓ గంట

ప్రపంచ వ్యాప్తంగా 24 నగరాలు ఈ భూమి కోసం ఓ గంట కేటాయించడానికి సంసిద్ధమవుతున్నాయి. మరి ఈ గంట లో వాళ్ళు ఏమి చేస్తారు? విద్యుత్తుని ఆపేస్తారు. రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు వారి వారి ఇండ్లలో విద్యుత్తుతో నడిచే పరికరాలన్నిటినీ ఆపేస్తారు.

దీని వల్ల ఏమవుతోంది. విద్యుత్తు వాడకం వల్ల కొన్ని పరికరాలు వదిలే గ్రీన్ హౌస్ గేసెస్ (ఆకుపచ్చ ఇంటి గాలులు…. :)) ఆ గంట పాటు వెలువడవు. అలాగే మనం ఎన్ని రకాలుగా ప్రకృతిని నాశనం చేస్తున్నాము అన్నది ఆలోచించవచ్చు. అదే విధంగా ఇప్పటికైనా మేలుకుని ఎన్ని రకాలుగా మనం ప్రకృతికి హాని కలగించకుండా జీవించచ్చు అన్నది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.

స్థూలంగా ఆలోచిస్తే మనకు కరెంటు ఆదా అవుతుంది. టి వి రొద ఉండదు కనుక, ఫాను, ఏ సి వగైరాలు ఉండవు కనుక మనం మన కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడుపుతాము. ఆరు బయటకు వచ్చి ఆకాశాన్ని, చందమామని, నక్షత్రాలని చూస్తాము. కలుషితమైన గాలి ఉంటుంది. చెట్లు పెద్దగా కనపడకపోవచ్చు. అప్పుడు మెల్లిగా మన ఆలోచనలు మన బాల్యం వైపు మళ్ళుతాయి. చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తుకొస్తాయి. వర్షాలు కురవాలంటే చెట్లు ఎంత అవసరం. చెట్లు మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. మనకు హానికరమైన కార్బన్ డై ఆక్సైడ్ ని అవి తీసుకుంటాయి.

చెట్లెక్కి ఆడుకోవడం, చెట్ల నీడన సేద తీరడం ఇవన్నీ మన పిల్లలకి మనం అందిస్తున్నామా!! ఈ కాంక్రీట్ జనారణ్యాలలో వృక్షాలకు చోటు లేకుండా చేస్తున్నామా? మన బాధ్యత ఎంత?  ఇలా ఆలోచించవచ్చు.

లేదా కొవ్వొత్తుల వెలుగులో అందరూ కలిసి భోజనం చేయచ్చు. సరదాగా పాటలు పాడుకోవచ్చు. అపార్ట్మెంటులోని సభ్యులందరినీ కూడగట్టి అందరూ పాల్గొనెలా ఏవైనా మంచి కార్యక్రమాలు చేపట్టచ్చు. చీకటి ద్వారా ప్రకృతి కోసం చిరు దీపాలు ఎలా వెలిగించవచ్చు అన్నది ఆలోచించి అమలు జరపచ్చు.

ఏమైనా చేయచ్చు. ఏమి చేసారో మాతో పంచుకోండి. ఓ ఆహ్లాదకరమైన మార్పు దిశగా మొదటి అడుగు వేయండి. ఇవేళ్టి రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు విద్యుత్తు ఆపేయండి.

లోక్ సత్తా – పార్టీ

జయప్రకాష్ నారాయణ్ గారి గురించి స్కూల్లో ఉన్నప్పుడే పత్రికల్లో చదివాము. ఎంతో గౌరవం కలిగింది. లోక్ సత్తా సంస్థకి నెల్లూరులో కూడా శాఖ ఉన్నా నేనెప్పుడూ వెళ్ళలేదు. మన సంకోచాలు మామూలే కదా. ఏదో ఫలాన గొప్ప సంస్థలో సభ్యురాలిని అని చెప్పుకుంటే ఏముంది. మనలో చేవ ఉండద్దు? అనేది నా అభిప్రాయం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం ఇలాంటివి మన వల్ల ఏమవుతుంది, తగ్గమ్మా, తగ్గు అనుకునేదాన్ని.

తర్వాత లోక్ సత్తా అని ఏమి వ్రాసినా కుతూహలంగా చదివేదాన్ని. లోక్ సత్తా రాజకీయ పార్టీగా అవతరించింది అని విన్నాక నాకేమీ వ్యతిరేకత కలగలేదు. మంచిదే కదా అనే అనిపించింది.

మనం విద్య, వైద్యం ఇలా ఏవో సాయం చేస్తున్నాము. ఇలా ఎందుకు చేస్తున్నాము. ఒక వేళ ప్రభుత్వాలు సక్రమంగా పని చేస్తే ఆ అవసరం ఉండేదా! నాయకులు, మంత్రులు నిజాయితీపరులైతే, దార్శనికులు అయితే దేశం ఇలానే ఉండేదా!!

ఒక వైపు రాజకీయాలు బురద అంటున్నాము. బురద, బురద అంటే ప్రయోజనం ఏమైనా ఉందా? పోనీ ఎవరినీ ఎన్నుకోము అంటాము. పాలన ఎలా జరగాలి? వోటు వేయము అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే కొనసాగుతుంది. పోనీ ఎన్నికలే జరపకుండా ప్రస్తుతం ఉన్న పార్టీల సమూహాన్ని ఏలమంటే.. చక్కగా స్వాహా చేస్తారు. కలగూర గంప అవుతుంది. ఈ పధ్ధతులు వేటిలోనూ ప్రజల ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు.

అలాంటి పరిస్థితుల్లో జయప్రకాష్ నారాయణ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం స్వాగతించాల్సిన పరిణామమే కదా. ఆయన ఎంత ఆలోచించకపోతే, ఎంతగా అంతర్మథనం చేయకపోతే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఎంతో గౌరవప్రదంగా ఉండాల్సిన రాజకీయాలను ప్రస్తుత పార్టీలు భ్రష్టు పట్టించాయి. అంత మాత్రం చేత రాజకీయం రొచ్చు అయిపోదు కదా.

ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు అన్నది ఒక వాదన. మరి అలా అనుకుంటే ఆయనకే మెజారిటీ దక్కేటట్టు ఆయన నిలబెట్టిన అభ్యర్థులని గెలిపించవచ్చు కదా. మంచి వారికి ఓటు ఎందుకు వేయకూడదు?

ఇప్పటి వరకు మూడు సభలకు నేను హాజరయ్యాను. ఆరిగా సమావేశ మందిరంలో జరిగినప్పుడు నేను చాలా ఆలస్యంగా వెళ్ళాను. పెద్దగా అర్థం అయినది ఏమీ లేదు అప్పటికే ప్రశ్నొత్తరాలు మొదలైనాయి. తర్వాత ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో జరిగిన సభ కి వెళ్ళాను. ఇక్కడ మాత్రం మొదటి నుంచి వినడం వల్ల చాలా నచ్చింది.

ముఖ్యంగా కొన్ని ప్రశ్నలకి ఆయన జవాబులు చాలా బాగా నచ్చాయి.

తెలంగాణా అంశము:

ప్రపంచంలో మన రాష్ట్రాల కన్నా చాలా చిన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ప్రజల కోరిక అయిన పక్షంలో దానికంటూ కొన్ని విధి విధానాలు ఉంటాయి. వాటి ప్రకారం ముందుకు సాగి, ప్రజాభిప్రాయం అదే అయితే రాజ్యాంగ నిబంధనలకు లోబడి అమలు జరపవచ్చు. కానీ దాన్ని ఓ రాజకీయ అస్త్రంగా చేసుకుని అవసరానికన్నా ప్రాధాన్యం ఇవ్వడం అనవసరం. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నవే అన్ని పార్టీలూను.

ఈ సమాధానం బట్టి నాకేమి అనిపించిందంటే… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా నష్టం లేదు. కాకపోతే ఎన్నికల అంశం చేయాల్సిన అవసరం లేదు. ఒక వేళ లోక్ సత్తా కూడా మాట్లాడవలసి వస్తే దానికి ఎన్నికల అంశం స్థాయి కల్పించినట్టే అవుతుంది కదా. కానీ ఈ పత్రికల వాళ్ళు పని గట్టుకుని మరీ పదే, పదే ఈ ప్రశ్న అడగడం చేస్తుంటాయి. ఏదో ఒక సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి. ఇస్తే దాన్ని కూడా రాజకీయ అస్త్రం గా మలుచుకుంటారు. ఇవ్వకపోతే నాంచుతున్నారు అంటారు. వీళ్ళకి పని లేదు. మరొకరిని పని చేసుకోనివ్వరు.

రిజర్వేషన్లు:

రిజర్వేషన్లు ప్రస్తుత పధ్ధతిలో దొరికేది ఎవరికి? కలెక్టర్ల కూతుర్లకి, మినిష్టర్ల కొడుకులకి. అంతే కానీ నిజమైన పేద వారికి ఎంత మందికి దక్కుతున్నాయి? అందరిలాగా అవకాశాలు లేని వారికి తప్పకుండా రిజర్వేషన్లు ఉండాలి కానీ వాటికీ కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. పై చదువులు చదివే అవకాశం కల్పించాలి. మన దేశంలో కుల వ్యవస్థ కాదనలేని సత్యం. అలాంటప్పుడు పుట్టుక భవిష్యత్తుని, జీవన విధానాన్ని గిరిగీసి నిర్దేశిస్తుంటే తప్పక అలాంటి వారికి సహాయం అందాలి. ఆర్థికంగా స్థోమత లేకపోవడం అన్నది ముఖ్య ప్రాతిపదిక కావాలి.

చిరంజీవి:

కాంగ్రెస్ , తెలుగుదేశం , టి ఆర్ ఎశ్ లను ఎలాగ ఎదుర్కొంటారో అలాగే ఈ పార్టీ కూడా. ఎవరితో పొత్తు అయినా సైద్ధాంతికంగా జరగాలి. లోక్ సత్తా పార్టీ విధి విధానాలు, విలువలు ఏమిటన్నది అందరికీ విశదమే. అలాంటప్పుడు అవి నచ్చి చిరంజీవి చేతులు కలపడానికి ముందుకు వస్తే వద్దనేది లేదు. అలా కాక అధికారమే ప్రాతిపదిక ఐతే చేయగలిగింది లేదు.  లోక్ సత్తా పార్టీకి విలువలతో మాత్రమే సంబంధం, అధికారం కేవలం ఆ విలువలని రాజకీయాల్లో చొప్పించేందుకు, ప్రజల్లో రగిలించేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. చేతులు కలపడమా లేదా అన్నది చిరంజీవి చేతుల్లోనే ఉంటుంది.

ఓటరు మనోగతం:

ఒకానొక సందర్భంలో మా మేనేజరు ఒకాయనతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నికల అంశం ప్రస్తావనకి వచ్చింది. మీరు ఎవరికి ఓటు వేస్తారు అని అడిగితే ఒక పార్టీ పేరు చెప్పారు. లోక్ సత్తా పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుంది కదా. మరి దానికెందుకు వేయరు అని అడిగాను. నాకు ఆయనంటే చాలా గౌరవం, నమ్మకం కూడాను. వెళ్ళి కలవాలని కూడా అనుకున్నాను. కుదరలేదు. కానీ ఆయన గెలవడం చాలా కష్టం. ఫలానా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోను ఈ సారి గెలవకూడదు కాబట్టి దానికి బలమైన ప్రత్యర్థికి నేను ఓటు వేస్తాను అన్నారు.

మరి అందరూ మీ లాగే అనుకుని లోక్ సత్తా కి ఓటు వేయాలి అని కూడా వేయకపోతే ఏమవుతుంది? ఓ మంచి వ్యక్తి, రాజకీయాలను ప్రక్షాళన చేయాలని ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఓడిపోతే ఎలా అని అడిగాను. నిజమే కావచ్చు అన్నారాయన. ఈ అంశం నేను లోక్ సత్తా పార్టీ దృష్టికి తీస్కువెళ్ళాలి అనుకున్నాను. ఈ మెజారిటీ ఆలోచనా ధోరణి, మూస ఓటింగ్ సరళిని అడ్రస్ చేయంది అని చెప్దాము అనిపించింది. నా వరకైతే నేను నాకు నచ్చిన వారికి ఓటు వేస్తాను. గెలుస్తారా, లేదా అన్నది తర్వాత విషయం. నా నమ్మకం ప్రకారం నేను ఓటు వేసానా లేదా అన్నదే నాకు ముఖ్యం.

జయప్రకాష్ నారాయణ్ గారు సరిగా ఈ అంశాన్నే ప్రస్తావించారు. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము అని ఒక వ్యక్తి అడిగితే….. ముందు ఓటు వేయండి అది చాలు అన్నారు.

దోచుకుతినే పార్టిలకి ఇచ్చే అవకాశం, దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడ్డ వ్యక్తికి ఇస్తే ఏమైంది? ఆయన అనుకున్నది చేస్తారా లేదా అన్నది తర్వాతి ప్రశ్న. అసలంటూ అవకాశం ఇస్తున్నామా, లేదా? ఇవ్వాలా, వద్దా?

ఆయనే అన్నారు….. మీరు అందరిలానే మారతారు అన్నవారిని ఒప్పించడానికి కొంత సమయం పడుతుంది అని నాకు తెలుసు. ఇప్పుడు మేము నిరూపించుకున్నాము. అంబుడ్స్మన్ చేత ఆడిట్ చేయిస్తున్నాము. ప్రతి విరాళానికి నూరు శాతం పన్ను రాయితీ ఇస్తున్నాము. వెబ్ సైటులో కూడా వచ్చిన విరాళాలు, వాటిని ఎలా వినియోగిస్తున్నామన్న వివరాలు పొందుపరిచాము. రహస్య బ్యాలెట్ ద్వారా అభ్యర్థులను నిర్ణయిస్తున్నాము. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నాము అని.

మనం ఏమి చేయగలము?

సెజ్ లని వ్యతిరేకించే వాళ్ళందరము కలిసికట్టుగా ఏమి చేయచ్చు?

కొన్ని ఆలోచనలు:

1. ముందుగా ఒక ఆన్ లైన్ పిటిషను ఒకటి పెట్టి సంతకాల ఉద్యమం చేపట్టచ్చు.

2. అందరం పోస్టు కార్డుల్లో ‘ సెజ్ చట్టాన్ని వెన్నకి తీసుకోవాలి ‘ అని రాష్ట్రపతికి, పార్లమెంటుకి లేఖాస్త్రాలా సంధించాలి.

3. కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయచ్చు.

4. సెజ్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రజలందరికీ తెలియపరచచ్చు.

5. ఈ అంశాలకి సంబంధించి ఆర్. టి. ఐ. లు వేయడం. ప్రవీణ్ గారన్నట్లు ఫైళ్ళని చూడాలని అడగటం.

సెజ్ లు – ఐ టి ఉద్యోగులు

సెజ్ లన్నీ చాలా వరకు ఐ టి కి సంబంధించినవే కాబట్టి ఐ టి సంస్థల్లో పని చేసే మన లాంటి వారికి సైద్ధాంతిక నిబద్ధత కానీ, లేదా నిజాయితీతో కూడిన నిబ్బరం కానీ ఉండదు అని ఒక వాదన. ఐ టి సంస్థల్లో పని చేస్తున్నంత మాత్రాన వత్తాసు పలకాలనో లేదా నిమ్మకుండిపోవాలనో లేదు కదా.
ఈ వారంలోనే ఆంధ్రజ్యోతిలోనో, ఈనాడులోనో ఓ వ్యాసం వచ్చింది. ఈ సెజ్ ల వల్ల చిన్న చిన్న ఐటి సంస్థలకి ఎంత నష్టం వాటిల్లుతుంది అని. ఎస్. టి. పి. ఐ. చట్టం వచ్చే సంవత్సరం తో చెల్లిపోతున్నందున, ఇక ఐ టి సంస్థల వాళ్ళందరూ పన్నులు భారీగా కట్టాల్సి వస్తుందని, ఇప్పటి దాకా ఉన్న రాయితీలు ఇక ముందు ఉండవని సారాంశం. వీళ్ళు ఏమి చేయాలి అంటే సెజ్ ల లోకి మారిపోవాలి. సెజ్ లలో సంస్థని ఏర్పాటు చేసుకోవాలంటే రమారమి కొన్ని వేల చదరపు అడుగులు దాటితే తప్ప అంతకు తగ్గించి ఇవ్వరు. సెజ్ లు సాధారణంగా సివార్లలో ఉంటాయి కాబట్టి ఉద్యోగులకి ఇబ్బంది. ఒక వేళ కేబ్ లు ఏర్పాటు చేయాల్సి వస్తే సంస్థకి తలకు మించిన భారం.

అప్పుడేమి అవుతుంది. ఒక మోస్తరు మధ్య తరగతి సంస్థలు బిచాణా ఎత్తేయాలి. ఆ మేరకు ఉద్యోగులు రోడ్డున పడతారు. కొండాపూర్ , మాదాపూర్ , గచ్చిబౌలీలలో రియల్ ఎస్టేటు దెబ్బకి గాలి తీసిన బుడగలా పడిపోతుంది.

ఇలా ఆలోచించినా చిన్న చిన్న సాఫ్ట్ వేర్ సంస్థల వారికి ఇబ్బందే కదా. దేశం కోసం ఆలోచించలేకపోవచ్చు. కానీ మన జీవనోపాధికన్నా ఆలోచించాలి కదా.

సుడులు తిరిగే ప్రశ్న – ఏమి చేయగలను??

2006 ఆగష్టు 15 వ తారీఖున ఒక దళారి పశ్చాత్తాపం పుస్తకం చదివినప్పుడు మొదటి సారిగా సెజ్ ల గురించి తెలుసుకున్నానేమో అనిపిస్తుంది నాకు గుర్తున్నంత వరకు. అది చదివాక నా స్పందన మరో టపా వ్రాస్తాను. సెజ్ ల లోకి వస్తే వీక్షణం కూడా ఓ పెద్ద వ్యాసాన్ని (ఆ సంచిక మొత్తం వాటి గురించేనేమో కూడా — సరిగా గుర్తులేదు) ప్రచురించింది. నేను దాన్ని పై పైనే చదివా.

కొన్ని కొన్ని చదవాలంటే నాకు విపరీతమైన భయం. అంతర్మథనం మొదలవుతుంది. కడుపుకి తిండి ఎలా ఎక్కుతుంది, కంటికి నిద్ర ఎలా పడుతుంది అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. పోనీ ఏమైనా చేద్దామా, అంటే ఏమి చేయగలం అనే ప్రశ్న… ఏమీ చేయలేము నిస్సందేహంగా అనే జవాబు. ఎందుకింత బాధ అని గాంధీ గారి మర్కటాన్నైపోతా. చేడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు….. చెడు చదవద్దు కూడా.

కాకపోతే ఈ సెజ్ అన్నది అత్యంత ప్రమాదకరమైనది అన్ని సమస్యలకన్నా అని తెలుస్తూనే ఉంది ఏదో రకంగా. దీని గురించి వివరంగా ఎవరైనా చెప్తే బాగుండు అనుకునేదాన్ని. ఓ రోజు రాకేష్ తో చాట్ (ఈ పదానికి మన బ్లాగుడు కాయలు తెలుగు సాదృశం చెప్తే అదే వాడతాను ముందు ముందు) చేస్తున్నప్పుడు యథాలాపంగా అడిగాను, సెజ్ గురించి ఏమైనా ఆర్ టి ఐలు వేసారా, అలాగే దానికి సంబంధించి ఎవరైనా తెలుసా అని. అప్పుడు చెప్పాడు తదుపరి ఆదివారం నాడు ఓ సభ జరగనుందని. వెతకపోయిన తీగ కాలికి దొరికినట్లైంది. ఎలాగైనా సరే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అదృష్టవశాత్తు కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేకపోవడంతో వెళ్ళాను.

నాకు మాత్రం చాలా బాధ వేసింది. స్వాతంత్ర్యాన్ని ఇలా కోల్పోతున్నామేమిటా అని. నాకు జెండా అంటే ఎంత గౌరవమో, సైనికులన్నా అంతే గౌరవం. మరి వాళ్ళ త్యాగాలకి అర్థం ఏముంది. స్థూలంగా చూస్తే సైనికుల ముఖ్య విధి సరిహద్దులని కాపాడాలి. అంటే మన భూభాగంలోని శత్రువులను చొరబడనీయకూడదు. శత్రువులంటే ఎవరు? పరాయి దేశస్థులు. మరి ఈ సెజ్ ల ద్వారా జరిగేది ఏమిటి. మన భూభాగాన్ని మనమే అందిస్తున్నాము తీసుకోండి అంటూ. మీరు యుద్ధం చేయక్కరలేదు. రాజమార్గంలో సలక్షణంగా తీసుకోండి అంటూ. సెజ్ ఈజ్ ఏ ఫారిన్ టెరిటరీ — ఇది నిర్వచనం.

సంఘ సేవ అని నేను అనుకున్న ఒకానొక పని సేవ అవుతుందా, నిజంగా ఉపయోగపడేదేనా అని గొప్ప సందేహం కలిగింది నాకు. నీలోఫర్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు రివర్స్ ఓస్మోసిస్ గురించి తెలిసింది. బైర్రాజు ఫౌండేషన్ వాళ్ళు నీటిని అందిస్తారని తెలుసు కానీ ప్రక్రియ పేరు ఇది అని తెలీదు. కానీ సురక్షిత మంచి నీరు ‘తక్కువ వెల ‘ కు అందిస్తున్నారని విని సంతోషించాను. (అవును కదా. ఊరికే వస్తే విలువ తెలీదు. నరనరానా జీర్ణించుకుపోయిన నయా వాదం ) కాకపోతే జడ్చర్ల నుంచి వచ్చిన మధు అనే కార్యకర్త నీటిని కూడా అమ్ముతున్నారు అని ఆవేదన చెందడం నన్ను అనిశ్చితిలోకి నెట్టింది. కాచి చల్లార్చుకొని తాగే వాళ్ళకి, నీటిని కొని తాగమనడం ఏమి సబబు అన్న ప్రశ్న అవును కదా అనిపించేస్తోంది. ఈ ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు.

నెల్లూరు నుంచి వచ్చిన దేవదానం గారు చెప్పినవి విని మాత్రం రక్తం మరిగిపోయింది. నేను నెల్లూరికి చెందిన దాన్ని అవడం వల్ల కావచ్చు. ఆ బాధ, కోపం ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కానీ చెప్పలేని నిస్సహాయత. ఏమి చేయగలను? ఇదే ప్రశ్న.

ఎప్పుడైనా ఏదైనా ఓ ఆలోచన (ఐడియా) తట్టినప్పుడు ఎవరికైనా చెప్తే, ముఖ్యంగా మా నాన్న – కలెక్టర్లకి తెలీదా. వాళ్ళ కన్నా నీకు ఎక్కువ తెలుసా, వళ్ళ కన్నా నువ్వు తెలివైన దానివా అనేవారు. ఎంత మేథావులైన నాయకులు ఉన్నారు మనకు. వాళ్ళకి లేదా దేశభక్తి నీకేనా అనేవారు. నాకు ఎంత కోపం వచ్చేదంటే కలెక్టర్లు ఒక్కరే మనుషులా. మిగతా వాళ్ళు కారా. సామాన్యులకి ఐడియాలు తట్టకూడదా. నాకు ఈ ఆలోచన వచ్చింది అంటే కలెక్టర్లకి రాలేదనే అర్థమా!! నేను ఎంతో గౌరవించే సాయి గొల్లపూడి గారు కూడా ఇలాగే అన్నారు. (ఒక వైపు కోపం. ఒక వైపు గౌరవం. నోరు మూసుకున్నాను. ఏమీ అనలేదు. ఈయన కూడా ఇలాగే అంటున్నారే అని నిట్టూర్చడం మినహా).

కానీ ఇప్పుడు అనిపిస్తోంది సాక్షాత్తు కలెక్టర్లే రైతులకి నచ్చచెప్పడానికి పూనుకున్నారని వినగానే. పోలీసుల మీదకి ప్రజలకి నమ్మకం ఎప్పుడో పోయింది. కొద్దో, గొప్పో కలెక్టర్లంటే గౌరవం మిగిలే ఉంది. కానీ వీళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారంటే…

మొన్నటి వరకు నెల్లూరికి కలెక్టరుగా ఉన్న రవిచంద్ర గారంటే నాకు ఎంతో గౌరవం ఉండింది. (జమీన్ రైతు పత్రిక నా భావాలకు హేతువు. ఆ పత్రిక అభిప్రాయాలను నేను నమ్ముతాను చాలావరకు). పేద విద్యార్థులకి ఆయన సొంత డబ్బులతో ఉపకార వేతనాలు ఇస్తూ ఉంటారని, ఇతరత్రా కూడా నిజాయితీ కలిగిన వ్యక్తని చదివాను. కానీ ఈ సెజ్ కి సంబంధించిన సమావేశానికి హాజరయ్యాక ఈయన కూడా ఎందుకు ఇలా చేసారు అని బాధ కలిగింది. లేకపోతే ఆయన కూడా నిస్సహాయుడేనా! ఏమో !!

నేను డిగ్రీ చదివేటప్పుడు స్టాటిస్టిక్స్ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. ముఖ్యంగా డెమోగ్రఫీ మరియు సర్వేకి సంబంధించిన విధి విధానాలు, ఫలితం తెలుసుకునే వైనము. అప్పుడు నేను పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉండే నమ్మకం ఎంత అన్న అంశం మీద సర్వే చేయాలనుకుని మా స్టాటిస్టిక్స్  సార్ ని అడిగాను. (చెప్పాను కదా, పోలీసులు, నక్సలైట్లు ఇవే వార్తలు నేను ఇంటర్, డిగ్రీ చదివే రోజుల్లో. అందుకే ఆ అంశాన్ని ఎన్నుకున్నాను.)

ఆయన తెగ ఆనందపడిపోయారు. ఇంత శ్రధ్ధగా అడిగానని. ప్రశ్నలు కూడా చూపెట్టాను కదా. శాంపిల్స్ ఎలా విభజించాలన్నది ఆయన చెప్పారు. అన్ని ప్రింటవుట్స్ కూడా తీసుకున్నాను. కానీ పరీక్షలు దగ్గర పడడంతో ఎవరూ సరిగా కాలేజీకి వచ్చేవారు కాదు. పైగా నా స్నేహితులు ఎవ్వరూ నన్ను ప్రోత్సహించలేదు. నేను కూడా ఎందుకో ఆపేసాను. (చాలా కాలం ఆ ప్రింట్ ఔట్లు నా దగ్గరే ఉన్నాయి. తర్వాత ఎవరో అడిగితే ఇచ్చాను.)

అప్పటి నా ఊహ ఏమిటంటే ఆ సర్వేని విశ్లేషించి ఆ ఫలితాన్ని అప్పటి నెల్లూరు ఎస్. పి. శ్రీ సి. వి. నరసయ్య గారికి చూపించాలని. ‘సార్ ! డిగ్రీ కాలేజీ అదీ ప్రొఫెషనల్ కోర్సు వారికి మీ పోలీసు వ్యవస్థ పట్ల ఈ రకమైన అభిప్రాయం ఉందీ అని చెప్దాము అనుకున్నాను. అలాగే ఇప్పటి విద్యార్ధులకి సమాజం పట్ల ఆసక్తి లేదు. ప్రపంచంలో ఏమి జరుగుతుంది తెలుసుకోవాలన్న కుతూహలం లేదు అని కూడా చూపించాలని.

ఆయనకి ఎందుకు ఇద్దాము అనుకున్నానంటే పేపర్లలో ఆయన గురించి కొంచెం బాగా వ్రాసేవారు. పైగా ఆయన స్కుళ్ళ వార్షికోత్స్వాలకి వెళ్ళినప్పుడు ఇచ్చే ఉపన్యాసాలు నాకు నచ్చాయి. తీరా చూద్దును కదా. నెల్లూరులో ఆయన పదవీ కాలం ముగిసి బయటకు వెళ్ళే నాటికి ఎం. ఎల్. ఎం. (మల్టీ లెవెల్ మార్కెటింగ్) మరియు చిట్ల రాకెట్ లో ఆయన కూడా ఒక సూత్రధారనో, పాత్రధారనో పత్రికలు గగ్గోలు పెట్టాయి. అమ్మో అనుకున్నాను. నేను ఒక వేళ ఆ సర్వే చేసి ఉంటే తప్పకుండా పోయి ఆయనకి ఇచ్చి ఉండేదాన్ని. ఏమి జరిగి ఉండేది!!

ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నే……. నేను ఏమి చేయగలను !! గుండెను బ్లాగుకోవడం తప్ప.

ఏ సెజ్ పొట్ట విప్పినా బయట పడే పురుగులు

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం

ఈ రెండు వాక్యాలు చాలు శ్రీశ్రీ గారు మహాకవి అని తెలియచెప్పడానికి. ప్రపంచ చరిత్రని మొత్తం రెండే వాక్యాలలో అదీను అలతి అలతి పదాలు, ప్రాసతో కూడి చెప్పడం ఆయనకే చెల్లిందేమో.

ఈ సెజ్ ల గురించి కూడా అలాగే చెప్పచ్చు. మనీ సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పే పెళ్ళిళ్ళ భాగోతంలా. సేం కార్డ్, సేం డిజైన్ , నేమ్స్ చేంజ్ అనుకుంటూ…సెజ్ లు అంతే. ఏ రాష్ట్రంలో అయినా అంతే కన్ను, మిన్ను కానని, జాలి, దయ లేని, అన్నిటికీ మించి ప్రకృతి పట్ల కూడా భయం లేని ధన దాహం.

చచ్చిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేరు ఎవ్వరూ అని తెలియాలని అలెగ్జాండరు చక్రవర్తి చేతులు పైకెత్తి మరీ పూడిపించుకుంటే మనోళ్ళందరికీ ఇంత ధనదాహమేమిటో అర్థం కాదు. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడు పడాలని గురజాడ వారన్నారు. నాకైతే అనాలనిపిస్తుంది. సొంత లాభం కొంత చూసుకుని పొరుగువాడికి తోడుపడవోయి అని. నీ లాభం నువ్వు చూసుకున్నాక అయినా పొరుగువాడికి తోడ్పడేటట్టు ఉండచ్చు కదా. పొరుగువాడే కాదు, ప్రకృతి నాశనమైపోయినా పట్టదు. ఇలాంటి వారందరూ ఏ తుఫానులోనో, ఏ భూకంపంలోనో చిక్కుకుని పోతే బాగుండు.

స్థూలంగా సెజ్ ల పొట్ట విప్పి చూస్తే బయటపడే పురుగులివి:

పేరులో ఏముంది!

ఏమీ లేదు.

పేరులో ఏముంది. ఈ సెజ్ లో ఏముంది. ఎవరికీ తెలీదు. అయినా ప్రభుత్వాలు అనుమతినిస్తాయి. ఏ సంస్థ ఈ సెజ్ కోసం అనుమతి కోరుతుంది, ఏ పరిశ్రమ స్థాపిస్తారు ఇలాంటి వివరాలు ఏ కొద్ది మంది మాత్రమో చెప్తారు. చాలా వాటికి ఇవి కూడా తెలియవు.

స్థల సేకరణ

బాగా విలువైన భూమి, వ్యవసాయ యోగ్యమైన భూమి, కోట్లు పలికే భూమి కారు చౌకగా ఈ సంస్థలకు ధారాదత్తం చేయబడుతుంది. వీరు సేకరించిన స్థలం లో కూడా మొత్తం పరిశ్రమకి కేటాయించరు. చాలా భాగం ఖాళీ పెట్టి అమ్ముకుంటారు. షాపింగ్ మాల్స్, గోల్ఫ్ కోర్సులు, టెన్నిస్ కోర్టులు, ఐదు నక్షత్రాల హోటళ్ళు ఒకటేమిటి దేనికైనా ఇచ్చుకుంటారు.

ఇక్కడ సెజ్ లలో ఎకరాలకెకరాల స్థలం ఖాళీగా ఉన్నా అధికారులు భవిష్యత్తులో సెజ్ ల కొరకు విజ్ణ్జప్తులు పెట్టుకునే వారి కోసం ఇప్పటి నుంచే స్థలాలు పెరుక్కుంటున్నారు. ఏమని అడిగితే అప్పుడు కొనాలంటే భూమి విలువ పెరుగుతుంది. నష్ట పరిహారం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచే సేకరిస్తున్నామని సమాధానం. విని హతాశులైతే వారిది తప్పు కాదు. ఇంత గొప్ప సమాధానం రాగలదని ఊహించని మనది.

కలెక్టర్ల స్థాయి అధికారులే ప్రలోభ పెట్టి మరీ రైతుల దగ్గర నుంచి భూములు రాయించుకుంటున్నారు. నువ్వు సంతకం పెట్టకపోతే ఇప్పుడు వచ్చే డబ్బులు కూడా దక్కవు. ఇది బెదిరింపు.

నిబంధనల ప్రకారం వ్యవసాయ యోగ్యమైన భూమిని తీసుకోకూడదు కదా అని వెర్రి సందేహం వస్తుందేమో. అధికారులేమైనా పిచ్చి వాళ్ళా. మా భూమి బంజరు భూమి. పంటలు పండటం లేదు అని వ్రాసి ఉన్న కాగితాలపై సంతకాలు చేయించుకుంటారు.

మౌలిక వసతుల కల్పన

ఇదో అభూత కల్పన. మౌలిక వసతులు కల్పించాలని చెప్తోంది చట్టం. కానీ ఉచితం అనలేదు. అశ్వథ్థామ హతహ…… ఉంజరహ. ప్రాపర్టీ టక్సులు, యూజర్ చార్జీలు సంస్థ వసూలు చేయవచ్చు.

పని కల్పించడం

ఇక్కడ పని దొరికిందా. ఇంతే సంగతులు. నీ పని అంతే. అని అనుకోవాల్సిన దుస్థితి. పదే పదే చెప్పాలనిపిస్తోంది నాకు అనిపించింది. బ్రిటీషు కాలం నాటి పరిస్థితులా ఇవి, 2008 నాటి దుస్థితా అని.

అసీం చెప్తారు. సెజ్ లన్నీ సింహ భాగం ఐటి సంస్థలవైతే గ్రామస్థులకి ఏమి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇంజనీరింగు, పీజిలు చేసిన వారి పిచ్చి గొర్రెల్లా తిరగాల్సిన పరిస్థితుల్లో వీళ్ళకి కల్పించే పని ఏమిటి?

ముసలి వారికి పని దొరకదు. స్త్రీలకు పెద్దగా దొరకదు. యువతీ యువకులకే దొరుకుతుంది.

ఉద్యోగుల హక్కులు

మానవ హక్కుల పోరాటాలు చేయాల్సిన స్థాయిలో ఈ ఉద్యోగుల స్థితి ఉంది. ఇన్ని పనిగంటలు అన్న నిబంధన లేదు. అవసరమైతే ఎన్ని గంటలైనా పని చేయించుకోవచ్చు. అదనపు భత్యం ఇస్తే సరిపోతుంది.

విదేశస్థులకి ఒకలాంటి నిబంధనలు, మన దేశం వారికి ఒకలాంటి నిబంధనలు. కనీసం ప్రకృతి పిలిస్తే పలకరించడానికి లేదు. గర్భం వచ్చినా, నెలసరి దినాల్లోనూ శెలవు పెట్టుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ప్రసూతికి శెలవు పొందితే అది శెలవు కాదు. ఉద్యోగానికి రాజీనామా చేసినట్టే. ఒక వేళ మళ్ళీ చేర్చుకుంటే అది కొత్త నియామకం కిందికే వస్తుంది.

పరాయి పాలన

ఈ సెజ్ కి కేటాయించిన భూమికి సంబంధించి ఏ విషయానికైనా ఆ సెజ్ ల అధికారులు అనుమతి ఇవ్వవలిసి ఉంటుంది.

నెల్లూరికి చెందిన దేవదానం గారు అపాచీ సంస్థ గురించి చెప్పిన వివరాలు. (కొన్ని మాత్రమే. అన్నీ వ్రాయాలంటే గుండె మండిపోతుంది. ప్రస్తుతం అంత శక్తి నాకు లేదు).

ఓ రాజకీయ నాయకుడు తను చెప్పిన వారికి ఉద్యోగం ఇవ్వలేదని అపాచీ సంస్థ వ్యక్తులని నిలదీయడానికి వెళ్ళాడట. వారి పేర్లు టొనీ, స్టీవ్.

స్టీవ్ : వై హావ్ యు కం హియర్ – నువ్వు ఇక్కడికెందుకొచ్చావు

ఎం ఎల్ ఏ: ఐ యాం ది ఎం ఎల్ ఏ – నేను ఎం ఎల్ ఏ ను

స్టీవ్ : సో వాట్ – అయితే ఏమిటి?

ఇదీ సంభాషణ. ఏమీ చేయలేక వెనక్కి వచ్చాడట సదరు ఎం. ఎల్. ఏ.

తెలుగు గంగ కాలువకి సంబంధించి ఓ పిల్ల కాలువని ఇటు వైపు మళ్ళించాలంటే (ఖచ్చితంగా ఏమిటి అన్నది తెలీదు) ఈ సెజ్ గుండా తవ్వుకుంటూ వెళ్ళాలట. ఈ సెజ్ కి సంబంధించిన వాళ్ళు ఒప్పుకోలేదు. కలెక్టరుకి వారిచ్చిన సమాధానం ఏమిటంటే… చైనాలోని సంస్థకు చెందిన ఉన్నతాధికారులు అనుమతి ఇస్తే తప్ప వీరు అంగీకరించరు. కాబట్టి చైనాకి విజ్ణ్జప్తిని పంపాలి.

ఇదీ పరిస్థితి. ఇది చాలనుకుంటా ఈ సెజ్ ల అసలు స్వరూపం తెలియడానికి. ఇది కూడా టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్ మాత్రమే.

మనకు మనమే మన దేశంలోని మన భూభాగాన్ని ఇతరులకి అప్పనంగా కట్టపెట్టి, మన రైతులని, కూలీలుగా మార్చి, ఇక్కడ మనమే పనులు చేసుకోవాలన్నా వారి అనుమతి తీసుకునే దౌర్భాగ్యం. చీ. అసలు ఏమనాలో అర్థం కాదు.

ఎదిరించిన వారి సంగతి !!

శ్రీకృష్ణ జన్మ స్థానం, మరీ బెట్టు చేస్తే వైకుంఠ ప్రాప్తి. కాకినాడలో సెజ్ కి భూములు ఇవ్వబోమని ధర్నా చేసిన కార్యకర్తలని జైళ్ళలో పెట్టారు. చింతా సూర్యనారాయణ మూర్తి గారు ఈ సెజ్ కి సంబంధించిన సమావేశంలో పాల్గొనుటకు పోలీసులని తప్పించుకుని వచ్చారు. ఈయన వయసు 58 కి పైనే ఉంటుంది. రేపు వెళ్ళితే నేను అరెస్టు అవుతాను. ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సొస్తుందో తెలీదు అని చెప్పారాయన. అంతకు ముందు ఇలానే జైల్లో పెట్టి ఓ పదిరోజుల తర్వాత వదిలారట. ఇలాంటివి ఎప్పుడైనా పత్రికల్లో చదవడమే కానీ దగ్గరగా అలాంటి వ్యక్తులని చూసి ఆ విషయాలు ప్రత్యక్షంగా వినడం అదే మొదటి సారి నాకు.