సేవ – బాబా బోధలు – 4

దేవుని బ్యాంకు – మిస్టర్ , మిస్ టెన్ పర్సెంట్ లు

ఈ పదం వాడింది దీవెన వాళ్ళ నాన్న సుబ్బారావు గారు. దీవెన వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఓ సందర్భంలో ఆయన చెప్పారు. చిన్నప్పుడు మేము పోటిలు పడి మరీ తిరుమల కొండ మెట్లెక్కే వాళ్ళము. అబ్బో ఎన్ని సార్లు వెళ్ళామో అని. నేను పెద్దగా చర్చించలేదు.

ఆయన రోజూ తన కూలీలోంచి పది శాతం చర్చికి ఇచ్చేస్తారట. ఆయన కూలీ రోజుకి వంద రూపాయలు. ప్రతి రోజూ చర్చిలో పది రూపాయలు వేస్తారట. చర్చికొచ్చే మిగతావారు, ఈయనకన్నా ఎక్కువ సంపాదించేవారు ఈయనని ఎగతాళి చేస్తూ మాట్లాడేవారట… నీకు బ్యాంకులో ఎన్ని డబ్బులున్నాయేంటి రోజూ ఇన్ని రూపాయలు ఇస్తున్నావు అని. నాకు ఇక్కడి బ్యాంకులలో కాదు ఆ దేవుడి బ్యాంకులో డబ్బు ఉంది, అక్కడే జమ చేస్తున్నాను అని చెప్పేవారట. నేను ఇంటికి కూడా డబ్బు తీసుకెళ్ళను. ముందు చర్చికి వెళ్ళి అక్కడ పది రూపాయలు వేసాకే ఇంటికి వెళ్తాను అని. ఇప్పుడు నాకు ఆ భగవంతుని బ్యాంకు నించే కదమ్మా డబ్బు అందింది. మీరందరూ నాకు తెలీదు. ఇంత ప్రేమగా చూస్కున్నారు. ఇంత సాయం చేసారు. నేను అడిగితే మీరు చేసారా అని. నిజమే కదా. ఆయనెవరో, మేమందరం ఎవరమో. పవన్ పేపర్ లో చూసి ఫార్వార్డ్ చేయడమేమిటి, రవి వెళ్ళి కలవడమేమిటి, కశ్యప్, నేను నిమ్స్ కి వెళ్ళడమేమిటి, వాళ్ళు కన్సెషన్ ఇవ్వడానికి ఒప్పుకోవడమేమిటి…… ప్రతిదీ ఆశ్చర్యమే. డబ్బులు సాయం చేసింది చంద్ర, యశోదలు. కాకపోతే ప్రతి ఒక్కరమూ దీవెన కోసం శ్రమపడ్డాము. ఎందుకు!! ఎవరు చెప్పారు !! ఇంకొక విషయం ఏమిటంటే మాకు అప్పుడు నిమ్స్ లో ఎవరూ పెద్దగా తెలీదు. తర్వాత చాలా మందికి మా లాగే వెళ్ళి ప్రాథేయపడినా కన్సెషన్ దొరకలేదు. దీవెనకి దొరకడానికి కారణం ఏమిటి? ఏవరు !!

గౌతమీ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు రతన్ గారు వాళ్ళ దగ్గర కొత్తగా చేరిన ఒకమ్మాయి గురించి చెప్పారు. తను ఫ్రెషర్ గా జాయిన్ అయిందట. మొదటి నెల జీతం ఇచ్చినప్పుడు ఈ డబ్బులతో నువ్వు ఏమి చేస్తావు అని అడిగారట. ఓ పది శాతం మాత్రం చర్చిలో ఇస్తాను అన్నదట. తను హిందువే. కాకపోతే క్రిష్టియన్ స్కూల్లో చదువుకుందట. అప్పుడు అనుకుందిట. ఉద్యోగం వస్తే ప్రతి నెల పది శాతం చర్చికి ఇవ్వాలి అని. అందుకని ఇస్తుందట.

ఈ సందర్భంలో ప్రసాద్ చెరసాల గారి మాటలు కూడా గుర్తుకు వస్తున్నాయి. ఆయన మా గ్రూపులో చేరిన కొద్ది నెలలకే మాకు ప్రతి నెల వంద డాలర్లు ఇవ్వడం మొదలుబెట్టారు. అందరూ ఇరవై డాలర్లే ఇస్తున్నారు కదా మీరు అంతే ఇవ్వండి, వంద డాలర్లు చాలా పెద్ద మొత్తం కదా అంటే…… పర్లేదు ప్రశాంతి. నిజానికి మనం పది శాతం ఇవ్వాలి. కానీ ఇవ్వము. ఏవో కారణాలు చెప్పుకుంటాము. కాబట్టి ఈ వంద డాలర్లు ఇబ్బందేమీ కాదులే అన్నారు.

ప్రకటనలు

సేవ – బాబా బోధలు – 3

కర్మ క్షయం – కృతజ్ణత

ఇంచుమించు అదే సమయంలో నేను ఓ రెండు రోజులు ఉచిత హోమియో వైద్యం క్లాసుకి వెళ్ళాను, శ్రీ యు. వి. ఎన్ . కె. రాజు గారు చెప్పడం వలన. నాకు కుదరదులే అని మానేశాను. ఉచితం కదా. అందుకేనేమో!! నిజానికి నేను మనస్ఫూర్తిగా సమయం కేటాయించగలనని అనిపించలేదు. ఎందుకంటే అందుకు కావాల్సిన శ్రమ, శ్రధ్ధ నేను చూపలేననిపించింది. అంతకు మించి అప్పుడు అది తగిన సమయం కాదు అనిపించింది. ఆ క్లాసులో డాక్టరుగారు (ఆయన వృత్తి రీత్యా బ్యాంకు మేనేజరు. ప్రవృత్తి రీత్యా వైద్యులు. ఎన్నో ఏళ్ళ అనుభవం ) ఓ విషయం చెప్పారు. ఆయనకు జాతకాల గురించి కూడా బాగా అవగాహన ఉంది. మానవ ప్రయత్నంతో మన కర్మ నివారించబడుతుందా అనేదానికి ఉదాహరణ చెప్పారు.

ఈ జీవి ఆసుపత్రి పాలు కావాలి అని వ్రాసి ఉంటే, వేరే వారికి సేవ చేయడం కోసమో, బంధువులని, స్నేహితులని పరామర్శించడం కోసమో ఆసుపత్రికి వెళితే కొంత కర్మ ఖర్చైనట్టేనట. ఇదేదో బాగుంది అనిపించింది. హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే నాకు మొదటి నుంచి ఆసుపత్రి అన్నా, డాక్టర్లన్నా చాలా భయం. విభూతి, మా అమ్మ అప్పుడప్పుడు ఇచ్చే హోమియో మందులే తప్ప ఇంక ఏవీ అలవాటు ఉండేది కాదు.

ఇప్పుడేదో డాఖ్టర్లతో బాగా పరిచయం అయ్యింది, కేసుల పరంగా ఆసుపత్రికి వెళ్తున్నా కానీ నాకు భయమే. ఆసుపత్రికి వెళ్ళి వచ్చిన ప్రతి సారి బాబా మీద ఎనలేని గౌరవం పెరుగుతుంది. నిజమైన కృతజ్ణత కలుగుతుంది. ఆసుపత్రిలో చేరాల్సినటువంటి తీవ్రమైన రోగాలు ఇవ్వనందుకు, అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నందుకు.

ప్రతి రోజు వివిధ సందర్భాల్లో మనం దేవుడికి కృతజ్ఞత చెప్పాలని వచ్చే మెయిల్ ఫార్వార్డ్ గుర్తుకు వస్తుంది. మనస్ఫూర్తిగా థాంక్ యూ బాబా అని చెప్తాను అప్పుడు మాత్రం.

సేవ – బాబా బోధలు – 2

సహనం లేదా నమ్మకం – ఫెయిత్ అండ్ పేషన్స్

బాబా ఎప్పుడూ ఈ రెండింటి గురించే చెప్తూ ఉంటారు. కానీ ఆ నమ్మకం, ఓర్పు మనకున్నాయా !!

సాయం కోసం మన దృష్టికి వచ్చిన వాళ్ళకి మనం సాయం చేస్తాము అని చెప్పాము అనుకోండి వాళ్ళు మరలా మరలా మనల్ని ఆ విషయం గురించి అడుగుతుంటే ఎలా ఉంటుంది. అది కూడా మనం ఇచ్చిన మాట ప్రకారం ప్రయత్నిస్తూ ఉంటే !!  సమాధానం చివరలో చెప్తాను.

దీవెన కి గుండె ఆపరేషను కోసం నిమ్స్ లో చేర్చడం, అది కాస్తా పొడిగించబడుతూ, పొడిగించబడుతూ 45 రోజులు అవడంతో మాకు కనీసం ఓ 40 రోజుల పాటు నిమ్స్ కి వెళ్ళడం దినచర్యలో భాగమైపోయింది. అప్పుడే తోటి పేషంట్లు కూడా పరిచయం అయ్యేవారు. అలాగ పరిచయమైన వారే వృధ్ధ దంపతులైన పాపారావు, రాధ గార్లు. ఎన్ని వాదోపవాదాలున్నా, నచ్చినా, నచ్చకపోయినా వ్యక్తిగతంగా పాపారావు దంపతులకు చేయగలిగిన సాయాన్నే నేను గొప్పది అనుకుంటాను. మేము ఎన్ని పాఠాలైనా నేర్చుకుని ఉండచ్చు గాక, ఇది మాత్రం మా టిమాడ్ కి సంబంధించినంత వరకు విలువైన సాయం అని నేను అనుకుంటూ ఉంటాను. ప్రతి కేసు గురించి వివరంగా వ్రాస్తాను.

ఈ టపా సంగతిని బట్టీ, వీరిద్దరికీ మేము వారు ఊహించిన దాని కన్నా ఎక్కువ సాయం చేసాము. ఆసుపత్రి అవసరాలకే కాకుండా, ఆ తరువాత కూడా చేసాము. అయితే వాళ్ళు మధ్య, మధ్యలో ఫోన్ చేసి సాయానికి సంబంధించి అడుగుతూ ఉంటే అప్పుడప్పుడు కోపం వచ్చేది. మనం సాయం చేస్తాము అని తెలుసు. ఎలాగూ ఒకసారి చేసాము. మాట ఇస్తే చేస్తాము కదా. ఎందుకు అన్ని సార్లు అడుగుతారు అని.

బాబా పటం వైపు చూస్తే ఎందుకో నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. నేను అంతే కదా. బాబా నాకు ఎంతో చేసారు. అయినా సరే ప్రతి సారి నేను ఎంత విసిగిస్తూ ఉంటాను. ప్రతి దానికి ఋజువు చూపించమని అడుగుతూ ఉంటాను.  మరి నేను అడగడం ఎంత సహజమో, వాళ్ళు అడగడం కూడా అంతే సహజం కదా !!

సేవ – బాబా బోధలు

గమనిక/మనవి: భగవంతుడిని నమ్మని వారికి ఈ మాటలు కొంచెం విచిత్రంగా తోచవచ్చు. చదవాల్సిన అవసరం లేదు.

విషయానికి వస్తే నేను షిర్డీ బాబా భక్తురాలిని అని చెప్పే అర్హత లేకపోయినా ఆయనను నమ్మేదాన్ని అని చెప్పుకోగలను. నాకు ఆయనతో మంచి స్నేహం ఉండేది. నమ్మండి, నమ్మకపోండి. అలాగని ఆయన నాకు సశరీరంగా కనిపించలేదు.  వినిపించలేదు. కాకపోతే సమాధానాలు వస్తాయి అంతే. సినిమాకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆయన ఒప్పుకుంటేనే వెళ్ళేదాన్ని, లేదంటే ఉండిపోయేదాన్ని, ఇష్టమున్నా లేకపోయినా. కొన్ని సార్లు ఎలాగోలాగా ఒప్పించుకునేదాన్ని.

ఎలాగా అంటే… శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టరు గారు వ్రాసిన శ్రీ సాయి లీలామృతం పుస్తకం ద్వారా. మనసులో ఓ ప్రశ్న అనుకొని తెరిస్తే వచ్చే ఆ రెండు పేజీలలో మనకు తప్పక సమాధానం దొరుకుతుంది. బడికి వెళ్ళద్దా, వద్దా అని అడిగిన ప్రశ్నతో ఆయనకు, నాకు స్నేహం మొదలైంది. అంతకు ముందు వరకు తెలిసిన వ్యక్తి. మా ఇంట్లో అందరూ బాబా భక్తులు కావడంతో మిగతా దేవుళ్ళ పూజలు చేసినా నాకు బాబానే దైవం. అదృష్టవశాత్తు బాబా సెక్యులర్ దైవం 🙂

కాకపోతే సేవకు సంబంధించిన బ్లాగులో బాబా గురించి ఎందుకు వ్రాయాల్సి వచ్చిందంటే ఓ బలమైన కారణం ఉంది. నిజాంపేటలో గుడిసెలు తగలబడినప్పుడు (ఈ సంవత్సరం జూలై లో) ప్రసాద్ చెరసాల గారి స్నేహితులు సతీష్ గారు సహాయం చేద్దాం అన్నారు. సరే అని వారి కోసం మనీ కలెక్ట్ చేసాము. మా ఇన్నోమైండ్స్ ఆఫీసు వారు బాగా సాయం చేసారు, కొంతమంది కొలీగ్స్ వారి స్నేహితుల ద్వారా కూడా ఇచ్చారు. అలాగే ఇంకా కొన్ని కంపెనీల వారు వెళ్ళి సాయం చేసారు (వర్చూసా, డెలాఇట్ ).

మేము బియ్యము కొని ఇద్దామని వెళ్ళాము. అప్పుడు వాళ్ళు మా డబ్బులు పోయాయి, నగలు పోయాయి ఇలా చెప్తూ ఉన్నారు. బియ్యం పట్ల పెద్ద ఆసక్తి చూపలేదు. (అయితే మేము బియ్యము, దుస్తులు పంచినప్పుడు వాటి కోసం గుమికూడారు, అది వేరే విషయం). మేము నిజానికి వీలైనంత సాయం చేయాలని వెళ్ళాము. వాళ్ళ అవసరాలేమిటో కనుక్కుని వీలున్నప్పుడు చేద్దాము అనుకున్నాము కానీ మేము చేయగలిగిన సాయం పెద్దగా కనిపించలేదు. ఒక్క శివాని అనే పిల్ల ముందుకొచ్చి నాకు చదువుకోవాలని ఉంది. చదువుకుంటాను అని అడిగింది. కొంచెం ఆలస్యమైనా తనకి తను కోరుకున్నట్టుగా చేర్పించబోతున్నాము.

అప్పుడు అనుకున్నాను వీళ్ళు డబ్బుల మీద ఆశ చూపకుండా ఉంటే, కావాల్సిన సహాయం, జీవితంలో నిలదొక్కుకోవడానికి, ముందుకెళ్ళడానికి సాయం చేసి ఉండే వాళ్ళం కదా అని. మనం చేయగలిగింది, ఇవ్వగలిగింది వీళ్ళు అడగడం లేదు. అందుకే ఏమి ఇవ్వాలని వచ్చామో అది ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఇక ఇవ్వము కదా అని.

అప్పుడు తట్టింది నాకు. భగవంతునితో మన ప్రవర్తన కూడా ఇంతే ఉంటుంది కదా అని. ఆయన మనకు ఎంతో సాయం చేయాలని చూస్తారు. మనమేమో ఎప్పుడూ లౌకిక విషయాలే అడుగుతుంటాము. ముఖ్యంగా నేను. నాకు ముక్తీ, గిక్తీ పట్ల అస్సలు ఆసక్తి లేదు. మళ్ళీ మళ్ళీ పుట్టాలి అనుకుంటూ ఉంటాను. బాబా చరిత్రలో ఓ సందర్భంలో…. ‘ఏమి చేస్తాము. ఎవరు కోరింది వారు పొందుతారు ‘  అంటారు. లౌకికమైన కోరికలు తీర్చరు అని కాదు కానీ అంతకు మించి ఎదగాలి అని కోరుకుంటారు. విద్యార్ధులు ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలని, తమ స్థాయి కన్నా ఎదగాలని కోరుకునే ఉపాధ్యాయుల లాగా. కానీ మనం నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోతే ఎలా ఉంటుంది !!

నువ్వు – మీరు – గారు

సంబోధన గురించి ఓ టపా ఖచ్చితంగా వ్రాయాలి అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి పెద్దవారిని, కొత్తవారిని మీరు అని సంబోధించడం అలవాటు అయినది. అలా కాకపోతే ఏదో వింతగా ఉంటుంది. ఒకే ఒక మినహాయింపు. అదేమిటంటే… మా అమ్మమ్మకి మిసెస్ ఆండాళ్ళు అని ముద్దుపేరు పెట్టుకోవడం. అడ్వెంచర్స్ ఆఫ్ హక్ ఫిన్ నవల నాకెంతో ఇష్టం. అందులో అందరినీ మిస్ అని సంబోధించడం నాకు తమాషాగా ఉండేది.

నాకు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఫేకల్టీలుగా పరిచయమై ఆత్మీయులుగా మారిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు – కిరణ్, రవి. నేను వాళ్ళని కిరణ్ సార్, రవి సార్ అనే పిలుస్తాను. పేరు పెట్టి పిలవమని అడిగి, అడిగి విసిగిపోయి నా పధ్ధతికి వారు అలవాటు పడిపోయారు.

వయసులోను, జ్ణ్జానంలోను, అనుభవాల్లోను పెద్దవారిని పేరు పెట్టి పిలవడానికి నాకు అస్సలు మనస్కరించదు. కొత్తగా పరిచయమైన వారైతే కొంచెం చిన్నవారైనా సరే మీరు అనడమే నాకు అలవాటు. అంతర్జాలం లో అడుగుపెట్టిన మొదట్లో అందరినీ ఇలాగే గారు అని పిలుస్తుంటే తెగ విసుక్కునేవారు. యథాప్రకారం అలవాటు పడిపోయారు.

కంప్యూటర్ కాలం పుణ్యమా అని ఇప్పుడు మనం అందరినీ పేర్లు పెట్టే పిలవాలి. మేనేజర్లని పేరు పెట్టి పిలవాలంటే ఎంత ఇబ్బందో చెప్పలేను. ఇప్పటి కాలంలో గారు అని పిలవడం తప్పైపోతోంది.

ఇది ఒక ఎత్తైతే నన్ను నువ్వు అని సంబోధించడం కూడా చాలా చికాకుగా ఉంది. నువ్వు నుంచి మీరుకి మారిన వైనం నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఇంటర్మీడియట్ ఆదిత్య కాలేజీలో చేరాము. సీనియర్ ఇంటర్ చదివేటప్పుడు ఇంప్రూవ్ మెంట్ కోసం ఫిజిక్స్ ని రవికుమార్ గారు చెప్పేవారు. ఫిజిక్స్ ని కూడా కథలా చెప్పి సులువుగా నేర్పించే వ్యక్తి. ఈయన అందరినీ మీరు అని సంబోధించే వారు. మాకు చాలా కొత్తగా అనిపించేది ఆ పిలుపు. మెల్లగా అలవాటయ్యింది. ఇక అంతే. అప్పటి నుంచి నా కన్నా చిన్నవాళ్ళు నన్ను నువ్వు అని సంబోధిస్తే నాకు పిచ్చి కోపం వస్తుంది.

ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఇలాగే మొదలెట్టారు. కొంతమందికి చెప్పేస్తున్నాను. కొంతమందికి చెప్పలేకపొతున్నాను. నాకన్నా పెద్దవారు నన్ను గారు అని చేర్చి సంబోధిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, చిన్నవారు నువ్వు అంటే అంత చికాకుగా ఉంటుంది. గారు అనక్కరలేదు. మీరు అనచ్చు కదా.

మూగ మనసు

వ్రాయడం అనే అలవాటుకి నేను ఎంత దూరమైపోయానో ఇవాళ కొన్ని బ్లాగులు, పొద్దులోని కొన్ని అంశాలు చూస్తే తెలిసింది. మదిలో ఎన్నో భావాలు సుడులు తిరుగుతున్నా వ్రాయలేని వైనం. కొన్ని సార్లు కావాలనే చేస్తే, కొన్ని సార్లు అదో తెలియని నిర్వీర్యత. ఏ కొంచెం చదివినా నాలో భావాలు ఎగసి పడతాయి. కవిత కాదు కానీ ఆలోచనల సమాహారం. 

అంతర్జాలం ఎంత అద్భుతం
ఎన్నెన్నో ఊసులు, ఎందరివో భావాలు
మనసుని కదిపేస్తూ..
ప్రపంచమే మన చేతుల్లో
పొరుగింటి వాళ్ళు తెలీదేమో కానీ
దూరదేశాల్లోని వారితో నిత్య పలకరింపులే

ఏ మూలో దాగిన, నొక్కిపెట్టిన
అనుభూతులన్నీ
మమ్మల్ని బయటకి తియ్యమని
తెగ గోలపెట్టేస్తుంటాయి
ఇంకా సమయం రాలేదని
సముదాయించడం ఎలాగో తెలీక
తెగ తికమక పడుతున్నాను

నాలోను ఎన్నో పార్శ్వాలు
ఎందుకు అలా అణగదొక్కుతున్నాను!
దేని కోసం!
మనసులో సుళ్ళు తిరిగే భావాలు
మగతలోను మెరిసే పదాలు
మౌనం చాటున కొట్టుమిట్టాడుతున్నాయి!

నాతో తప్ప అవి ఎవరితోనూ
మాట్లాడకూడదనే
నిరంకుశ ధోరణి వెనుక
గల నిస్సహాయత!!
అవును నిజం!
మూగబోయాను నేను!
పలకరించకండి.

అవినీతి – 2

ఏ మాత్రం సమయం చిక్కినా వార్తాపత్రికలు తప్పకుండా చదివే నేను 5th Pillar గురించి చదివాను. లంచం కోరే వారికి వీరు ముద్రించిన ‘నేను లంచం తీసుకోను, ఇవ్వడానికి ఇష్టపడను ‘ అనే సున్నా నోటు గురించి, విద్యార్థుల తోడ్పాటు, ప్రజల్లో కలిగిన స్పందన, అన్నీ చదివాను. ఏ మాత్రం ఆశ కలగలేదు. చాలా నిర్లిప్తంగా, యథాలాపంగానే చదివాను. 

ఈ ప్రయత్నం విజయం సాధించిన ఉదాహరణలు చదివినా కూడా నమ్మకం లేదు. ఏదో భారత క్రికెట్ జట్టు ఫ్లూక్ గా గెలిచినట్టు.

వీరి గురించే చైతన్య గ్రూపులో ఓ మెయిల్ పోస్ట్ చేసాడు ఈ మధ్యనే. దానికి కూడా నేను ఓ నిరాశాజనకమైన అభిప్రాయం వ్రాసాను. 

అనుకోకుండా మొన్న సోమవారం, 17 వ తేదీన, విజయ్ గారు మెయిల్ పంపారు. AIMS India ఫౌండర్ ను, హైదరాబాదులో ఉన్నాను. నీతో మాట్లాడాలనుకుంటున్నాను ఫోన్ నంబరు మెయిల్ చెయ్యి, లేదా ఫలానా నంబరుకి మెయిల్ చెయ్యి అని.

చూసాను ఆ వెబ్ సైటుని. అవినీతి తో యుద్ధం అంటే నేనేమి చేయగలను అనుకున్నాను. ఇక మాట్లాడేందుకు ఏముంది అని కూడా అనుకున్నాను. కాకపోతే అందరూ కలిసి పని చేయాలి, అందరూ ఒకరికొకరు తోడ్పడాలి, ఇలాంటివి చూసి, విద్య, ఆరోగ్యం వీటిలో కూడా కృషి చేస్తున్నందున దానికి సంబంధించి మాట్లాడచ్చులే అనుకున్నా.

ఆయనేమో 5thpillar.org చూడమన్నారు. వార్తలు, విజయగాథలు చదవమన్నారు. చదివాను. నిజమేనా, నిజంగానేనా అనిపించింది.

తీరా విందును కదా, అవును నిజమే కదా అనిపించింది. అవినీతిని ఆవేశంతో కన్నా, ఆలోచనతో ఎదుర్కోవాలి, అసలు ముందు ఎదిరించాలి అనే దిశగా మన దృక్పథం మారాలి, సమాజపరంగా అలాంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అనిపించింది.

మొత్తానికి ఆ సమావేశం అవినీతి ఎప్పటికైనా సమసిపోతుందనే ఆశ నాలో కలిగించిందని మాత్రం చెప్పగలను.