మనం ఏమి చేయగలము?

సెజ్ లని వ్యతిరేకించే వాళ్ళందరము కలిసికట్టుగా ఏమి చేయచ్చు?

కొన్ని ఆలోచనలు:

1. ముందుగా ఒక ఆన్ లైన్ పిటిషను ఒకటి పెట్టి సంతకాల ఉద్యమం చేపట్టచ్చు.

2. అందరం పోస్టు కార్డుల్లో ‘ సెజ్ చట్టాన్ని వెన్నకి తీసుకోవాలి ‘ అని రాష్ట్రపతికి, పార్లమెంటుకి లేఖాస్త్రాలా సంధించాలి.

3. కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయచ్చు.

4. సెజ్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రజలందరికీ తెలియపరచచ్చు.

5. ఈ అంశాలకి సంబంధించి ఆర్. టి. ఐ. లు వేయడం. ప్రవీణ్ గారన్నట్లు ఫైళ్ళని చూడాలని అడగటం.

ప్రకటనలు

సెజ్ లు – ఐ టి ఉద్యోగులు

సెజ్ లన్నీ చాలా వరకు ఐ టి కి సంబంధించినవే కాబట్టి ఐ టి సంస్థల్లో పని చేసే మన లాంటి వారికి సైద్ధాంతిక నిబద్ధత కానీ, లేదా నిజాయితీతో కూడిన నిబ్బరం కానీ ఉండదు అని ఒక వాదన. ఐ టి సంస్థల్లో పని చేస్తున్నంత మాత్రాన వత్తాసు పలకాలనో లేదా నిమ్మకుండిపోవాలనో లేదు కదా.
ఈ వారంలోనే ఆంధ్రజ్యోతిలోనో, ఈనాడులోనో ఓ వ్యాసం వచ్చింది. ఈ సెజ్ ల వల్ల చిన్న చిన్న ఐటి సంస్థలకి ఎంత నష్టం వాటిల్లుతుంది అని. ఎస్. టి. పి. ఐ. చట్టం వచ్చే సంవత్సరం తో చెల్లిపోతున్నందున, ఇక ఐ టి సంస్థల వాళ్ళందరూ పన్నులు భారీగా కట్టాల్సి వస్తుందని, ఇప్పటి దాకా ఉన్న రాయితీలు ఇక ముందు ఉండవని సారాంశం. వీళ్ళు ఏమి చేయాలి అంటే సెజ్ ల లోకి మారిపోవాలి. సెజ్ లలో సంస్థని ఏర్పాటు చేసుకోవాలంటే రమారమి కొన్ని వేల చదరపు అడుగులు దాటితే తప్ప అంతకు తగ్గించి ఇవ్వరు. సెజ్ లు సాధారణంగా సివార్లలో ఉంటాయి కాబట్టి ఉద్యోగులకి ఇబ్బంది. ఒక వేళ కేబ్ లు ఏర్పాటు చేయాల్సి వస్తే సంస్థకి తలకు మించిన భారం.

అప్పుడేమి అవుతుంది. ఒక మోస్తరు మధ్య తరగతి సంస్థలు బిచాణా ఎత్తేయాలి. ఆ మేరకు ఉద్యోగులు రోడ్డున పడతారు. కొండాపూర్ , మాదాపూర్ , గచ్చిబౌలీలలో రియల్ ఎస్టేటు దెబ్బకి గాలి తీసిన బుడగలా పడిపోతుంది.

ఇలా ఆలోచించినా చిన్న చిన్న సాఫ్ట్ వేర్ సంస్థల వారికి ఇబ్బందే కదా. దేశం కోసం ఆలోచించలేకపోవచ్చు. కానీ మన జీవనోపాధికన్నా ఆలోచించాలి కదా.

సుడులు తిరిగే ప్రశ్న – ఏమి చేయగలను??

2006 ఆగష్టు 15 వ తారీఖున ఒక దళారి పశ్చాత్తాపం పుస్తకం చదివినప్పుడు మొదటి సారిగా సెజ్ ల గురించి తెలుసుకున్నానేమో అనిపిస్తుంది నాకు గుర్తున్నంత వరకు. అది చదివాక నా స్పందన మరో టపా వ్రాస్తాను. సెజ్ ల లోకి వస్తే వీక్షణం కూడా ఓ పెద్ద వ్యాసాన్ని (ఆ సంచిక మొత్తం వాటి గురించేనేమో కూడా — సరిగా గుర్తులేదు) ప్రచురించింది. నేను దాన్ని పై పైనే చదివా.

కొన్ని కొన్ని చదవాలంటే నాకు విపరీతమైన భయం. అంతర్మథనం మొదలవుతుంది. కడుపుకి తిండి ఎలా ఎక్కుతుంది, కంటికి నిద్ర ఎలా పడుతుంది అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. పోనీ ఏమైనా చేద్దామా, అంటే ఏమి చేయగలం అనే ప్రశ్న… ఏమీ చేయలేము నిస్సందేహంగా అనే జవాబు. ఎందుకింత బాధ అని గాంధీ గారి మర్కటాన్నైపోతా. చేడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు….. చెడు చదవద్దు కూడా.

కాకపోతే ఈ సెజ్ అన్నది అత్యంత ప్రమాదకరమైనది అన్ని సమస్యలకన్నా అని తెలుస్తూనే ఉంది ఏదో రకంగా. దీని గురించి వివరంగా ఎవరైనా చెప్తే బాగుండు అనుకునేదాన్ని. ఓ రోజు రాకేష్ తో చాట్ (ఈ పదానికి మన బ్లాగుడు కాయలు తెలుగు సాదృశం చెప్తే అదే వాడతాను ముందు ముందు) చేస్తున్నప్పుడు యథాలాపంగా అడిగాను, సెజ్ గురించి ఏమైనా ఆర్ టి ఐలు వేసారా, అలాగే దానికి సంబంధించి ఎవరైనా తెలుసా అని. అప్పుడు చెప్పాడు తదుపరి ఆదివారం నాడు ఓ సభ జరగనుందని. వెతకపోయిన తీగ కాలికి దొరికినట్లైంది. ఎలాగైనా సరే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అదృష్టవశాత్తు కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేకపోవడంతో వెళ్ళాను.

నాకు మాత్రం చాలా బాధ వేసింది. స్వాతంత్ర్యాన్ని ఇలా కోల్పోతున్నామేమిటా అని. నాకు జెండా అంటే ఎంత గౌరవమో, సైనికులన్నా అంతే గౌరవం. మరి వాళ్ళ త్యాగాలకి అర్థం ఏముంది. స్థూలంగా చూస్తే సైనికుల ముఖ్య విధి సరిహద్దులని కాపాడాలి. అంటే మన భూభాగంలోని శత్రువులను చొరబడనీయకూడదు. శత్రువులంటే ఎవరు? పరాయి దేశస్థులు. మరి ఈ సెజ్ ల ద్వారా జరిగేది ఏమిటి. మన భూభాగాన్ని మనమే అందిస్తున్నాము తీసుకోండి అంటూ. మీరు యుద్ధం చేయక్కరలేదు. రాజమార్గంలో సలక్షణంగా తీసుకోండి అంటూ. సెజ్ ఈజ్ ఏ ఫారిన్ టెరిటరీ — ఇది నిర్వచనం.

సంఘ సేవ అని నేను అనుకున్న ఒకానొక పని సేవ అవుతుందా, నిజంగా ఉపయోగపడేదేనా అని గొప్ప సందేహం కలిగింది నాకు. నీలోఫర్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు రివర్స్ ఓస్మోసిస్ గురించి తెలిసింది. బైర్రాజు ఫౌండేషన్ వాళ్ళు నీటిని అందిస్తారని తెలుసు కానీ ప్రక్రియ పేరు ఇది అని తెలీదు. కానీ సురక్షిత మంచి నీరు ‘తక్కువ వెల ‘ కు అందిస్తున్నారని విని సంతోషించాను. (అవును కదా. ఊరికే వస్తే విలువ తెలీదు. నరనరానా జీర్ణించుకుపోయిన నయా వాదం ) కాకపోతే జడ్చర్ల నుంచి వచ్చిన మధు అనే కార్యకర్త నీటిని కూడా అమ్ముతున్నారు అని ఆవేదన చెందడం నన్ను అనిశ్చితిలోకి నెట్టింది. కాచి చల్లార్చుకొని తాగే వాళ్ళకి, నీటిని కొని తాగమనడం ఏమి సబబు అన్న ప్రశ్న అవును కదా అనిపించేస్తోంది. ఈ ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు.

నెల్లూరు నుంచి వచ్చిన దేవదానం గారు చెప్పినవి విని మాత్రం రక్తం మరిగిపోయింది. నేను నెల్లూరికి చెందిన దాన్ని అవడం వల్ల కావచ్చు. ఆ బాధ, కోపం ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కానీ చెప్పలేని నిస్సహాయత. ఏమి చేయగలను? ఇదే ప్రశ్న.

ఎప్పుడైనా ఏదైనా ఓ ఆలోచన (ఐడియా) తట్టినప్పుడు ఎవరికైనా చెప్తే, ముఖ్యంగా మా నాన్న – కలెక్టర్లకి తెలీదా. వాళ్ళ కన్నా నీకు ఎక్కువ తెలుసా, వళ్ళ కన్నా నువ్వు తెలివైన దానివా అనేవారు. ఎంత మేథావులైన నాయకులు ఉన్నారు మనకు. వాళ్ళకి లేదా దేశభక్తి నీకేనా అనేవారు. నాకు ఎంత కోపం వచ్చేదంటే కలెక్టర్లు ఒక్కరే మనుషులా. మిగతా వాళ్ళు కారా. సామాన్యులకి ఐడియాలు తట్టకూడదా. నాకు ఈ ఆలోచన వచ్చింది అంటే కలెక్టర్లకి రాలేదనే అర్థమా!! నేను ఎంతో గౌరవించే సాయి గొల్లపూడి గారు కూడా ఇలాగే అన్నారు. (ఒక వైపు కోపం. ఒక వైపు గౌరవం. నోరు మూసుకున్నాను. ఏమీ అనలేదు. ఈయన కూడా ఇలాగే అంటున్నారే అని నిట్టూర్చడం మినహా).

కానీ ఇప్పుడు అనిపిస్తోంది సాక్షాత్తు కలెక్టర్లే రైతులకి నచ్చచెప్పడానికి పూనుకున్నారని వినగానే. పోలీసుల మీదకి ప్రజలకి నమ్మకం ఎప్పుడో పోయింది. కొద్దో, గొప్పో కలెక్టర్లంటే గౌరవం మిగిలే ఉంది. కానీ వీళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారంటే…

మొన్నటి వరకు నెల్లూరికి కలెక్టరుగా ఉన్న రవిచంద్ర గారంటే నాకు ఎంతో గౌరవం ఉండింది. (జమీన్ రైతు పత్రిక నా భావాలకు హేతువు. ఆ పత్రిక అభిప్రాయాలను నేను నమ్ముతాను చాలావరకు). పేద విద్యార్థులకి ఆయన సొంత డబ్బులతో ఉపకార వేతనాలు ఇస్తూ ఉంటారని, ఇతరత్రా కూడా నిజాయితీ కలిగిన వ్యక్తని చదివాను. కానీ ఈ సెజ్ కి సంబంధించిన సమావేశానికి హాజరయ్యాక ఈయన కూడా ఎందుకు ఇలా చేసారు అని బాధ కలిగింది. లేకపోతే ఆయన కూడా నిస్సహాయుడేనా! ఏమో !!

నేను డిగ్రీ చదివేటప్పుడు స్టాటిస్టిక్స్ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. ముఖ్యంగా డెమోగ్రఫీ మరియు సర్వేకి సంబంధించిన విధి విధానాలు, ఫలితం తెలుసుకునే వైనము. అప్పుడు నేను పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉండే నమ్మకం ఎంత అన్న అంశం మీద సర్వే చేయాలనుకుని మా స్టాటిస్టిక్స్  సార్ ని అడిగాను. (చెప్పాను కదా, పోలీసులు, నక్సలైట్లు ఇవే వార్తలు నేను ఇంటర్, డిగ్రీ చదివే రోజుల్లో. అందుకే ఆ అంశాన్ని ఎన్నుకున్నాను.)

ఆయన తెగ ఆనందపడిపోయారు. ఇంత శ్రధ్ధగా అడిగానని. ప్రశ్నలు కూడా చూపెట్టాను కదా. శాంపిల్స్ ఎలా విభజించాలన్నది ఆయన చెప్పారు. అన్ని ప్రింటవుట్స్ కూడా తీసుకున్నాను. కానీ పరీక్షలు దగ్గర పడడంతో ఎవరూ సరిగా కాలేజీకి వచ్చేవారు కాదు. పైగా నా స్నేహితులు ఎవ్వరూ నన్ను ప్రోత్సహించలేదు. నేను కూడా ఎందుకో ఆపేసాను. (చాలా కాలం ఆ ప్రింట్ ఔట్లు నా దగ్గరే ఉన్నాయి. తర్వాత ఎవరో అడిగితే ఇచ్చాను.)

అప్పటి నా ఊహ ఏమిటంటే ఆ సర్వేని విశ్లేషించి ఆ ఫలితాన్ని అప్పటి నెల్లూరు ఎస్. పి. శ్రీ సి. వి. నరసయ్య గారికి చూపించాలని. ‘సార్ ! డిగ్రీ కాలేజీ అదీ ప్రొఫెషనల్ కోర్సు వారికి మీ పోలీసు వ్యవస్థ పట్ల ఈ రకమైన అభిప్రాయం ఉందీ అని చెప్దాము అనుకున్నాను. అలాగే ఇప్పటి విద్యార్ధులకి సమాజం పట్ల ఆసక్తి లేదు. ప్రపంచంలో ఏమి జరుగుతుంది తెలుసుకోవాలన్న కుతూహలం లేదు అని కూడా చూపించాలని.

ఆయనకి ఎందుకు ఇద్దాము అనుకున్నానంటే పేపర్లలో ఆయన గురించి కొంచెం బాగా వ్రాసేవారు. పైగా ఆయన స్కుళ్ళ వార్షికోత్స్వాలకి వెళ్ళినప్పుడు ఇచ్చే ఉపన్యాసాలు నాకు నచ్చాయి. తీరా చూద్దును కదా. నెల్లూరులో ఆయన పదవీ కాలం ముగిసి బయటకు వెళ్ళే నాటికి ఎం. ఎల్. ఎం. (మల్టీ లెవెల్ మార్కెటింగ్) మరియు చిట్ల రాకెట్ లో ఆయన కూడా ఒక సూత్రధారనో, పాత్రధారనో పత్రికలు గగ్గోలు పెట్టాయి. అమ్మో అనుకున్నాను. నేను ఒక వేళ ఆ సర్వే చేసి ఉంటే తప్పకుండా పోయి ఆయనకి ఇచ్చి ఉండేదాన్ని. ఏమి జరిగి ఉండేది!!

ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నే……. నేను ఏమి చేయగలను !! గుండెను బ్లాగుకోవడం తప్ప.

ఏ సెజ్ పొట్ట విప్పినా బయట పడే పురుగులు

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం

ఈ రెండు వాక్యాలు చాలు శ్రీశ్రీ గారు మహాకవి అని తెలియచెప్పడానికి. ప్రపంచ చరిత్రని మొత్తం రెండే వాక్యాలలో అదీను అలతి అలతి పదాలు, ప్రాసతో కూడి చెప్పడం ఆయనకే చెల్లిందేమో.

ఈ సెజ్ ల గురించి కూడా అలాగే చెప్పచ్చు. మనీ సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పే పెళ్ళిళ్ళ భాగోతంలా. సేం కార్డ్, సేం డిజైన్ , నేమ్స్ చేంజ్ అనుకుంటూ…సెజ్ లు అంతే. ఏ రాష్ట్రంలో అయినా అంతే కన్ను, మిన్ను కానని, జాలి, దయ లేని, అన్నిటికీ మించి ప్రకృతి పట్ల కూడా భయం లేని ధన దాహం.

చచ్చిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేరు ఎవ్వరూ అని తెలియాలని అలెగ్జాండరు చక్రవర్తి చేతులు పైకెత్తి మరీ పూడిపించుకుంటే మనోళ్ళందరికీ ఇంత ధనదాహమేమిటో అర్థం కాదు. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడు పడాలని గురజాడ వారన్నారు. నాకైతే అనాలనిపిస్తుంది. సొంత లాభం కొంత చూసుకుని పొరుగువాడికి తోడుపడవోయి అని. నీ లాభం నువ్వు చూసుకున్నాక అయినా పొరుగువాడికి తోడ్పడేటట్టు ఉండచ్చు కదా. పొరుగువాడే కాదు, ప్రకృతి నాశనమైపోయినా పట్టదు. ఇలాంటి వారందరూ ఏ తుఫానులోనో, ఏ భూకంపంలోనో చిక్కుకుని పోతే బాగుండు.

స్థూలంగా సెజ్ ల పొట్ట విప్పి చూస్తే బయటపడే పురుగులివి:

పేరులో ఏముంది!

ఏమీ లేదు.

పేరులో ఏముంది. ఈ సెజ్ లో ఏముంది. ఎవరికీ తెలీదు. అయినా ప్రభుత్వాలు అనుమతినిస్తాయి. ఏ సంస్థ ఈ సెజ్ కోసం అనుమతి కోరుతుంది, ఏ పరిశ్రమ స్థాపిస్తారు ఇలాంటి వివరాలు ఏ కొద్ది మంది మాత్రమో చెప్తారు. చాలా వాటికి ఇవి కూడా తెలియవు.

స్థల సేకరణ

బాగా విలువైన భూమి, వ్యవసాయ యోగ్యమైన భూమి, కోట్లు పలికే భూమి కారు చౌకగా ఈ సంస్థలకు ధారాదత్తం చేయబడుతుంది. వీరు సేకరించిన స్థలం లో కూడా మొత్తం పరిశ్రమకి కేటాయించరు. చాలా భాగం ఖాళీ పెట్టి అమ్ముకుంటారు. షాపింగ్ మాల్స్, గోల్ఫ్ కోర్సులు, టెన్నిస్ కోర్టులు, ఐదు నక్షత్రాల హోటళ్ళు ఒకటేమిటి దేనికైనా ఇచ్చుకుంటారు.

ఇక్కడ సెజ్ లలో ఎకరాలకెకరాల స్థలం ఖాళీగా ఉన్నా అధికారులు భవిష్యత్తులో సెజ్ ల కొరకు విజ్ణ్జప్తులు పెట్టుకునే వారి కోసం ఇప్పటి నుంచే స్థలాలు పెరుక్కుంటున్నారు. ఏమని అడిగితే అప్పుడు కొనాలంటే భూమి విలువ పెరుగుతుంది. నష్ట పరిహారం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచే సేకరిస్తున్నామని సమాధానం. విని హతాశులైతే వారిది తప్పు కాదు. ఇంత గొప్ప సమాధానం రాగలదని ఊహించని మనది.

కలెక్టర్ల స్థాయి అధికారులే ప్రలోభ పెట్టి మరీ రైతుల దగ్గర నుంచి భూములు రాయించుకుంటున్నారు. నువ్వు సంతకం పెట్టకపోతే ఇప్పుడు వచ్చే డబ్బులు కూడా దక్కవు. ఇది బెదిరింపు.

నిబంధనల ప్రకారం వ్యవసాయ యోగ్యమైన భూమిని తీసుకోకూడదు కదా అని వెర్రి సందేహం వస్తుందేమో. అధికారులేమైనా పిచ్చి వాళ్ళా. మా భూమి బంజరు భూమి. పంటలు పండటం లేదు అని వ్రాసి ఉన్న కాగితాలపై సంతకాలు చేయించుకుంటారు.

మౌలిక వసతుల కల్పన

ఇదో అభూత కల్పన. మౌలిక వసతులు కల్పించాలని చెప్తోంది చట్టం. కానీ ఉచితం అనలేదు. అశ్వథ్థామ హతహ…… ఉంజరహ. ప్రాపర్టీ టక్సులు, యూజర్ చార్జీలు సంస్థ వసూలు చేయవచ్చు.

పని కల్పించడం

ఇక్కడ పని దొరికిందా. ఇంతే సంగతులు. నీ పని అంతే. అని అనుకోవాల్సిన దుస్థితి. పదే పదే చెప్పాలనిపిస్తోంది నాకు అనిపించింది. బ్రిటీషు కాలం నాటి పరిస్థితులా ఇవి, 2008 నాటి దుస్థితా అని.

అసీం చెప్తారు. సెజ్ లన్నీ సింహ భాగం ఐటి సంస్థలవైతే గ్రామస్థులకి ఏమి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇంజనీరింగు, పీజిలు చేసిన వారి పిచ్చి గొర్రెల్లా తిరగాల్సిన పరిస్థితుల్లో వీళ్ళకి కల్పించే పని ఏమిటి?

ముసలి వారికి పని దొరకదు. స్త్రీలకు పెద్దగా దొరకదు. యువతీ యువకులకే దొరుకుతుంది.

ఉద్యోగుల హక్కులు

మానవ హక్కుల పోరాటాలు చేయాల్సిన స్థాయిలో ఈ ఉద్యోగుల స్థితి ఉంది. ఇన్ని పనిగంటలు అన్న నిబంధన లేదు. అవసరమైతే ఎన్ని గంటలైనా పని చేయించుకోవచ్చు. అదనపు భత్యం ఇస్తే సరిపోతుంది.

విదేశస్థులకి ఒకలాంటి నిబంధనలు, మన దేశం వారికి ఒకలాంటి నిబంధనలు. కనీసం ప్రకృతి పిలిస్తే పలకరించడానికి లేదు. గర్భం వచ్చినా, నెలసరి దినాల్లోనూ శెలవు పెట్టుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ప్రసూతికి శెలవు పొందితే అది శెలవు కాదు. ఉద్యోగానికి రాజీనామా చేసినట్టే. ఒక వేళ మళ్ళీ చేర్చుకుంటే అది కొత్త నియామకం కిందికే వస్తుంది.

పరాయి పాలన

ఈ సెజ్ కి కేటాయించిన భూమికి సంబంధించి ఏ విషయానికైనా ఆ సెజ్ ల అధికారులు అనుమతి ఇవ్వవలిసి ఉంటుంది.

నెల్లూరికి చెందిన దేవదానం గారు అపాచీ సంస్థ గురించి చెప్పిన వివరాలు. (కొన్ని మాత్రమే. అన్నీ వ్రాయాలంటే గుండె మండిపోతుంది. ప్రస్తుతం అంత శక్తి నాకు లేదు).

ఓ రాజకీయ నాయకుడు తను చెప్పిన వారికి ఉద్యోగం ఇవ్వలేదని అపాచీ సంస్థ వ్యక్తులని నిలదీయడానికి వెళ్ళాడట. వారి పేర్లు టొనీ, స్టీవ్.

స్టీవ్ : వై హావ్ యు కం హియర్ – నువ్వు ఇక్కడికెందుకొచ్చావు

ఎం ఎల్ ఏ: ఐ యాం ది ఎం ఎల్ ఏ – నేను ఎం ఎల్ ఏ ను

స్టీవ్ : సో వాట్ – అయితే ఏమిటి?

ఇదీ సంభాషణ. ఏమీ చేయలేక వెనక్కి వచ్చాడట సదరు ఎం. ఎల్. ఏ.

తెలుగు గంగ కాలువకి సంబంధించి ఓ పిల్ల కాలువని ఇటు వైపు మళ్ళించాలంటే (ఖచ్చితంగా ఏమిటి అన్నది తెలీదు) ఈ సెజ్ గుండా తవ్వుకుంటూ వెళ్ళాలట. ఈ సెజ్ కి సంబంధించిన వాళ్ళు ఒప్పుకోలేదు. కలెక్టరుకి వారిచ్చిన సమాధానం ఏమిటంటే… చైనాలోని సంస్థకు చెందిన ఉన్నతాధికారులు అనుమతి ఇస్తే తప్ప వీరు అంగీకరించరు. కాబట్టి చైనాకి విజ్ణ్జప్తిని పంపాలి.

ఇదీ పరిస్థితి. ఇది చాలనుకుంటా ఈ సెజ్ ల అసలు స్వరూపం తెలియడానికి. ఇది కూడా టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్ మాత్రమే.

మనకు మనమే మన దేశంలోని మన భూభాగాన్ని ఇతరులకి అప్పనంగా కట్టపెట్టి, మన రైతులని, కూలీలుగా మార్చి, ఇక్కడ మనమే పనులు చేసుకోవాలన్నా వారి అనుమతి తీసుకునే దౌర్భాగ్యం. చీ. అసలు ఏమనాలో అర్థం కాదు.

ఎదిరించిన వారి సంగతి !!

శ్రీకృష్ణ జన్మ స్థానం, మరీ బెట్టు చేస్తే వైకుంఠ ప్రాప్తి. కాకినాడలో సెజ్ కి భూములు ఇవ్వబోమని ధర్నా చేసిన కార్యకర్తలని జైళ్ళలో పెట్టారు. చింతా సూర్యనారాయణ మూర్తి గారు ఈ సెజ్ కి సంబంధించిన సమావేశంలో పాల్గొనుటకు పోలీసులని తప్పించుకుని వచ్చారు. ఈయన వయసు 58 కి పైనే ఉంటుంది. రేపు వెళ్ళితే నేను అరెస్టు అవుతాను. ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సొస్తుందో తెలీదు అని చెప్పారాయన. అంతకు ముందు ఇలానే జైల్లో పెట్టి ఓ పదిరోజుల తర్వాత వదిలారట. ఇలాంటివి ఎప్పుడైనా పత్రికల్లో చదవడమే కానీ దగ్గరగా అలాంటి వ్యక్తులని చూసి ఆ విషయాలు ప్రత్యక్షంగా వినడం అదే మొదటి సారి నాకు.

సెజ్ లు – చైనా ఉదాహరణ — వూ పింగ్ విజయం

మన నాయకమ్మన్యులందరూ చైనాని ఉదాహరణ గా చూపెడుతుంటారు. సెజ్ ల విషయంలో చైనా అనుభవాలేమిటో అసీం, ప్రవీణ్ ఇద్దరూ ఇలా వివరించారు:

చైనాలో షెంగ్ జిన్ బాగా పేరుపొందిన సెజ్. దాదాపు ఓ నగరమంత వైశాల్యంతో ఉంటుంది. ఇది జాలరులకి సంబంధించినది. ఇక్కడి కార్మికలు వెతలు కూడా తక్కువేమీ కాదు. ఐతే వ్యవసాయ భూములని సెజ్ లకు కేటాయించకూడదనే నిబంధనను చైనా ఖచ్చితంగా అమలు జరుపుతోంది. సాక్షాత్తు చైనా మంత్రి ఒకరు సెజ్ అనే ప్రయోగం కొన్ని ప్రమాణాల బట్టీ చూస్తే విఫలమైందని పేర్కొన్నారు.

వూ పింగ్ అనే మహిళ తెగువ ఆదర్శప్రాయం కావాలి. కేవలం ఓ ముగ్గురి సత్సంకల్పం ముందు చైనా ప్రభుత్వం ఎలా తలొగ్గాల్సి వచ్చింది చదివితే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తెగువ, పట్టుదల ఎంతటి విజయాన్నివగలవో కదా అనిపిస్తుంది. సెజ్ కోసం తన భూమిని ఇవ్వనని ఈ మహిళ పట్టుపట్టింది. ఈమెకు తోడుగా భర్త, సోదరుడు నిలిచారు. సామదానభేదదండోపాయాలను ప్రయోగించి విఫలమైన ప్రభుత్వం ఆమె ఇంటిని మాత్రం వదిలేసి చుట్టు పక్కల తవ్వుకుంటూ వెళ్ళి ఆమె ఇల్లుని ఓ కొండ మీది ప్రదేశంలా మార్చారు. ఆమె తన ఇంటిపై చైనా జెండానే ఎగురవేసి ఉంచింది. అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా ఈ విషయం అందరికీ తెలిసి ప్రపంచ దేశాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. చేసేదేమీ లేక చైనా ప్రభుత్వం ఆ సెజ్ ని నిలిపివేసింది.

House of Wu Ping

Wu Ping’s house is seen in March 2007 in Chongqing, China. Wu, whose struggle against the developers earned her the nickname “Stubborn Nail,” and her husband had their two-storey brick house in the southwest city of Chongqing demolished late Monday night.

మనందరం కూడా అంతర్జాలాన్ని మంచి పనుల కోసం వినియోగించడం మొదలుపెట్టాలి.

మరిన్ని లంకెలు :

http://www.iht.com/articles/2007/03/26/news/house.php

http://venture160.wordpress.com/2007/03/22/interview-with-chinas-most-incredible-holdout/

గోవా విజయం – ప్రవీణ్ సబ్నిస్ మాటల్లో

ప్రవీణ్ సబ్నిస్ గోవా కి చెందిన సామాజిక కార్యకర్త. విద్యార్ధి ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన నాటక రంగ నిపుణుడు కూడాను. థియేటర్ ఆర్టిస్ట్. ఎంత చక్కగా, క్లుప్తంగా, విశదంగా చెప్పారంటే, సెజ్ లంటే ఏమిటో అరటి పండు వలిచినట్టు చెప్పారు. ఆయన ఉపన్యాసం వింటే ఎల్ . కె. జి. పిల్లలకు కూడా సెజ్ అంటే ఏమిటో అర్థమైపోతుంది. ఓ ఉపన్యాసకర్త అంతలా స్పెల్ బౌండ్ చేయడం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. యాబ్జల్యూట్లీ వండర్ఫుల్ అండ్ సింప్లీ సూపర్బ్.

గోవా బచావో అభియాన్ ఆధ్వర్యంలో గోవాలో సెజ్ లకు వ్యతిరేకంగా ఉద్యమం ఎందుకు విజయాన్ని సాధించిందంటే అక్కడ వీరు సామాన్య ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వివరించారు. గోవాలోని మిషనరీలు కూడా ఎంతో విజ్ణ్జతతో ఈ పోరాటంలో పాల్గొన్నాయి. మే 2005 న సెజ్ ల చట్టం చేయబడితే, 19 ఆగష్టు నాడే గోవాలో చర్చిలు ఓ సమావేశాన్ని ఏర్పరిచి ప్రజలకు ఈ సెజ్ ల ద్వారా కలిగే నష్టాలను  వివరించడం మొదలుపెట్టాయి.

గోవా బచావో అభియాన్ వాళ్ళు ప్రజలందరికీ సెజ్ ల గురించి ఎలా వివరించారో చూద్దాం:

1. సెజ్ ని అర్థమయే ఉదాహరణలతో పోల్చి ప్రమాదమెలాంటిదో వివరించారు.

సెజ్ ని ఫ్రాక్చర్డ్ ఫింగర్ (గాయపడ్డ వేలు) గా అభివర్ణించారు. నీడ, పళ్ళు ఇవ్వని చెట్టుతో పోల్చారు.

గోవా తీరప్రాంత చట్టాల పరిధిలోకి వస్తుంది (Coastal Regulatory Zone Mgmt – CRZM). కానీ వీళ్ళు పారిశ్రామికులకి, పర్యాటక శాఖకి ప్రాజెక్టులు కట్టబెట్టడంతో సహజంగానే వాళ్ళు ఈ తీరప్రాంత చట్టాలని ఉల్లంఘిస్తున్నారు. ఓ సర్వే ప్రకారం మైనింగ్ అన్నది వన్యమృగ ఆవాసాల స్థలాల కన్నా 4 రెట్లు పెరిగింది.

ఏదేని ఒక యాక్ట్ ని అమలు పరచాలంటే స్థానిక పంచాయితీల అనుమతి కావాలి. కానీ సెజ్ లకు అలాంటి అనుమతి తీసుకోవడం లేదు. వ్యవసాయాధారమైన భూమిని తీసుకుంటున్నారు. అలాగే జలచరాలు, సముద్ర సంపద నాశనమవుతోంది.

2. చట్టాల ఉల్లంఘనకి సంబంధించి సవివర ఉదాహరణలను చూపడం

క్లేర్మాంట్ అనే కంపెనీ కి ఫుడ్ పార్క్ కోసం సెజ్ ని కేటాయించారు. కానీ ఇంటర్నెట్ లో అదే కంపెనీ రియల్ ఎస్టేట్ యాడ్ ఇచ్చింది. అక్కడ 800 విల్లాలు, స్విమ్మింగ్ పూల్ మరియు గోల్ఫ్ కోర్స్ ఉంటాయని. వీళ్ళు అది ఎత్తి చూపుతూ కంప్లైంట్ చేసేసరికి ఆ వెబ్ సైటుని తీసేసారు.

మరో ఉదాహరణ: ఐదు నక్షత్రాల హోటల్ ని ఒకదాన్ని తీరప్రాంతంలో కట్టారు. నిబంధనల ప్రకారం అది కట్టకూడదు. కాకపోతే అధికారులు అక్కడ ఒక రోడ్డు ఉన్నదని చూపి, తీర ప్రాంత చట్టం కిందకి రాదని అనుమతి తెచ్చుకున్నారు. కోర్టు కూడా ఈ విషయంలో చేతులెత్తేసింది. గూగుల్ మ్యాప్ కి, అధికారులు చూపెట్టే మ్యాప్ కి శత సహస్రం తేడా ఉంది.

ఈ అవినీతి భాగోతాలన్నీ ఉదాహరణలతో సహా ప్రజల ముందు పెట్టారు.

3. ఇతర సమూహాలతో కలిసి పని చేయడం

ఒకే అంశం మీద పని చేసే వారందరూ కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఇక్కడ నాయకులు ఎవరూ లేరు. అందరూ కార్యకర్తలే. నిర్ణయాలు, కార్యాచరణ ప్రణాళికలు అన్నీ చర్చించి తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి పని చేసారు.

4. సెజ్ లు చట్టానికి, న్యాయానికి, రాజ్యాంగానికి విరుధ్ధమైనవని నిరూపించడం

ఎ. సెజ్ లు జాతికి వ్యతిరేకం (యాంటీ నేషనల్ )

ఎందుకంటే సెజ్ అనేది మన దేశంలోనే పరాయి దేశం గా సెజ్ ల చట్టంలోనే అభివర్ణించబడ్డది. (సెజిందీ.నిచ్.ఇన్ – లంకెను చూడవచ్చు). ఇట్ ఈజ్ ఎ ఫారిన్ టెర్రిటరీ.

బి. సెజ్ లు రాజ్యాంగ విరుధ్ధమైనవి (యాంటి కాన్స్టిట్యూషనల్ )

— మౌలిక వసతుల కల్పన అని చెప్పబడింది. కానీ యూజర్ చార్జీలు మరియు ప్రాపర్టీ ఫీజులు కట్టించుకోవడానికి వీరికి అనుమతి ఇవ్వబడింది.

— స్థానిక ప్రభుత్వం లాగా పని చేస్తుంది కానీ జవాబుదారీ తనం ఉండదు. జవాబుదారీగా ఉండాలని ఆ చట్టం లో నిర్దేశించబడలేదు.

— ఇక్కడి ప్రజల ఓటు హక్కు గురించి ఖచ్చితమైన మార్గదర్శకాలు లేవు. రాజకీయంగా ఇది అత్యంత ప్రమాదకరంగా పరిగణించాల్సిన అంశం.

సి.  సెజ్ లు ప్రజలకు వ్యతిరేకమైనవి (యాంటీ పీపుల్ )

సెజ్ లు మనం ఊహించగలిగేదానికన్నా భయంకరమైనవి.
కస్టమ్స్ డ్యూటి నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంతో విలువైన భూములు కారు చౌకగా తీసుకుంటారు.
పరిశ్రమల కోసం అని తీసుకున్న భూమిని రియల్ ఎస్టేటు కోసం ఉపయోగిస్తారు.

(మన దేశంలో ఇంతవరకు ఏర్పాటు చేసిన సెజ్ లలో సగం భూమి ఖాళీ పెట్టుకున్నారు. ఇదంతా రియల్ ఎస్టేటు కోసమే. ఇంత భూమి ఖాళీ ఉన్నా కూడా మరలా ప్రజల దగ్గర భూములని లాక్కొంటున్నారు. మరో టపా వ్రాస్తాను.)

గోవాలో ఓ సెజ్ కి సంబంధించి 3 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 10 ఏప్రిల్ 2007, 10 జూలై 2007, 6 నవంబరు 2007.  నాలుగు అప్రూవ్ కాబడినవి కాగా మరో 11 ప్రపోజల్స్ ఉన్నాయి. మొదటి సెజ్ ని సాక్షాత్తు గోవా ముఖ్యమంత్రి ప్రారంభించారు. (ఇనాగురేటేడ్). ఇది మామూలే అనుకుంటారేమో. కాకపోతే నోటిఫికేషన్ వెలువడే ముందుగానే ప్రారంభించేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ వివరాలు తెలియవు. అంతా సెజ్ అధికారుల నిర్ణయాల ప్రకారం జరుగుతుంది. వీరికి కనీసం వార్త కూడా తెలియదు.

విచిత్రమేమిటంటే వీరి ఆందోళన ఫలితంగా ఫుడ్ పార్క్ ప్రతిపాదన కొట్టి వేయబడినా ఈ స్థలం చుట్టు పక్కల భూ సేకరణ జరుగుతూనే ఉంది – ఆక్జిలరీల కోసం.

సెజ్ లు అన్ని రకాలుగా వినాశకరమే – భూమి, వాతావరణం, ప్రకృతి వనరులు మొత్తంగా దేశ సార్వభౌమత్వానికి చాలా ప్రమాదకరం.

పోరాట పంథా

1. అర్థమయ్యే నినాదాలు

అంకా నకా సెజ్, అంకా పై పెజ్ – ఇది నినాదం. అంటే మాకు సెజ్ లు వద్దు, పెజ్ కావాలి అని. పెజ్ అంటే మన అంబలి లాంటి పదార్థము. మరో అర్థంలో అందరికీ ఆరోగ్యం కలిగించేది అని.

2. చదువుకున్న వారు గ్రామాలకి వెళ్ళి ఈ పేద రైతులకి సహకరించాలి.

ప్రవీణ్ ఏమంటారంటే చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు రైతులతో ధర్నాల్లో పాల్గొనాలి. అలా చేస్తే పోలీసులు కొంచెం వెనక్కి తగ్గుతారు. వారి ధైర్యం సన్నగిల్లుతుంది. మన విశ్వాసం పెంపొందుతుంది.

3. సెజ్ చట్టాన్నే అడ్డు పెట్టుకుని సెజ్ మీద పోరాటం

ఒకసారి వీళ్ళు ఒక సెజ్ స్థలంలో ధర్నా చేస్తుంటే అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. ఇది ప్రత్యేక ఆర్థిక మండలి ఇక్కడ భారత ప్రభుత్వ చట్టాలు చెల్లవు కనుక మీకు మమ్మల్ని అరెస్టు చేసే హక్కు లేదనడంతో వారు వెనుదిరగవలసి వచ్చింది 🙂

4. అవినీతిని వెలికి తీయడానికి ప్రాధాన్యత

సెజ్ మనకి ఎలా అభివృధ్ధి వ్యతిరేకమో వివరించడంతో పాటు, సెజ్ లకు అనుమతి ఇస్తున్న వైనంలోని అవినీతిని కూడా ఆర్ టి ఐ చట్టం సహాయంతో వెలికి తీయాలి అంటారు.

వీరు అలాగే చేయడంతో సెజ్ లకు అనుమతి ఇచ్చిన అధికారులు భయంతో వణికిపోయారు. వీరు ఆ కేసుని నెగ్గారు. కేవలం తెల్ల కాగితం మీద ఏ కంపెనీ ఆ సెజ్ ని తీసుకుంటుందో వివరించకుండా, ఏ పరిశ్రమ స్థాపించబడుతుంది, అంచనాలు ఏమిటి ఇలాంటి వివరాలు లేకుండా ఇవ్వబడిన అప్లికేషన్ ఆమోదించబడింది. ఇలాంటివి వెలికి తీసి ప్రజల ముందు ఉంచడం ఎంతో అవసరం అంటారు ప్రవీణ్.

5. సమస్యలు

గోవా చిన్న ప్రదేశం కాబట్టి సమస్యలు లేవు అని అందరూ అనుకుంటారు కానీ చిన్న ప్రదేశం కాబట్టే సమస్యలు కూడా అని చెప్పారు. ఒకానొక గ్రామంలో మగవారందరినీ మూడు నెలల పాటు పోలీసులు నిర్బంధించారు. అణచివేత ధోరణులు కూడా చాలానే ఉన్నాయి.

గోవా స్థానికేతరులది కాదు. వీళ్ళు వచ్చి మీకు నూరిపోస్తున్నారనే విష ప్రచారం కూడా జరిగింది. ఐతే గోవాలో నివసిస్తూ గోవా అభివృధ్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ గోవాకి చెందిన వారే అనే బలమైన వాదన ప్రజల ముందుకి తీసుకొచ్చి ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు.

6. స్ట్రటజీ

ఎ. గ్రామస్థులతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరుచుకోవడం
బి. ఎవరిదో ఒకరి నాయకత్వం కాకుండా, కార్యకర్తలందరూ సమిష్టి నిర్ణయాలు తీసుకుని అమలుపరచడం
సి. ఆర్ టి ఐ చట్టాని బాగుగా ఉపయోగించుకోవడం
డి. ఈ యాక్ట్ లో కూడా ప్రశ్నలు మాత్రమే అడిగి ఊరుకోకుండా ఫైళ్ళను చూపించమని అడగాలి.

  • ఓ సెజ్ కోసం భూమి ఎలా, ఏ ప్రాతిపదికన సేకరించబడినది
  • డవలపరు అప్ప్లికేషను ఎలా పెట్టుకున్నాడు, ఏమి వివరాలు ఇచ్చాడు. 
  • ఎప్పుడు, ఎలా భూమిని డవలపర్ కి దఖలు చేసారు.

సెజ్ చట్టాన్ని వెనక్కు తీసుకోవడం (రిపీల్ ద యాక్ట్) అన్నది లక్ష్యమైతే ఈ కేటాయింపుల్లోని అవినీతిని బయటపెట్టడం ఓ ఆయుధం.

ఇది కూడా మరో స్వాతంత్ర్య పోరాటం గా భావించి మనందరం ఈ సెజ్ ల చట్టం పట్ల మన వ్యతిరేకతని, అయిష్టతని ప్రభుత్వానికి తెలియపరచాలి.  కార్యకర్తలందరి మీద క్రిమినల్ కంప్లైంట్ చేయడంతో అందరూ కలిసి పోలీసు హెడ్ క్వార్టర్స్ లోనే ధర్నా చేసారు. న్యాయం వీరి వైపే ఉన్నందున వీరిని అరెస్టు చేయలేకపోయారు.

భావి ప్రణాళికలు

ప్రజా వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారి వ్యవహారాలని రహస్య కెమెరాల సాయంతో నిగ్గుతీసి ప్రజలకు చూపించాలి. రెండు చెట్ల మధ్య ఓ పంచని కట్టి దానినే తెరగా చేసుకుని ఈ వివరాలన్నీ చూపించచ్చు.

గూగుల్ ఇమేజెస్ ని వాడుకుని ఈ సెజ్ లకి సంబంధించి జరిగే అవినీతిని బయటపెట్టచ్చు.

రాజకీయాలకతీతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సర్పంచులని తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీల వ్యక్తులని ఈ పోరాటంలో భాగస్వాములని చేయరు. సమావేశాలకి పిలవరు.

పెజ్ అలయన్స్  ఏర్పాటు

దేశ వ్యాప్తంగా సెజ్ లకు వ్యతిరేకంగా పోరాటం చేసే వారు, వ్యతిరేకించే వారు ఇందులో సభ్యులుగా చేరచ్చు. భారతీయతే ప్రాతిపదిక కానీ ప్రాంతీయత కాదు.

అభివృధ్ధి ప్రణాళిక

సృజనాత్మక ఆర్థిక సముదాయాలను ఏర్పరచడం – స్థానికంగా ఏ వృత్తుల వారైతే ఉంటారో ఆయా వృత్తులని ప్రోత్సహించడం. లేదా వారు కోరుకున్న కొత్త వృత్తులను నేర్పించడం.

విశాలమైన ఆట స్థలాలు ఉండే పాఠశాలలు కట్టించడం.

వైద్య ఆరోగ్య కేంద్రాలు ఏర్పడి సక్రమంగా పని చేసేట్టు చూడడం

విత్తనాలు, ట్రాక్టర్ లు అవసరానికి అందుబాటులో ఉండేటట్టు చేయడం. వ్యవసాయానికి తగిన సలహాలు ఇవ్వడం.

కోరికలకి, అవసరాలకి మధ్య గల భేదాలని అర్థం చేసుకునేలా చేయడం.

భారత మాత మన తల్లి అయితే, ప్రభుత్వం తాగుబోతు తండ్రి లాంటిది. తాగుబోతు తండ్రి తల్లిని పరాయి వాళ్ళకి ఇస్తుంటే చూస్తూ ఊరుకోవడం బిడ్డలుగా మన ధర్మం కాదు. తండ్రే అయినా సరే తగిన బుద్ధి చెప్పాల్సిందే. ఆ బాధ్యత మనదే. అది మనం సక్రమంగా నిర్వర్తించాలి.
ముగింపు

మనుష్యులు మూడు రకాలు. మొదటి రకం పనులు జరిగేలా చూస్తారు. రెండో రకం వారు పనులు జరుగుతోంటే చూస్తూ ఉంటారు. ఇక మూడో రకం వారు ఏమి జరిగిందా అని ఆశ్చర్యపోతుంటారు. (Make things happen, watch things happen, wonder what happened 🙂 )

మనం ఏ రకానికి చెందుతాము అన్నది మనమే నిర్ణయించుకోవాలి.

ప్రత్యేక ఆర్థిక మండలి – 1 వ భాగం

అసీం శ్రీవాస్తవ డిల్లీ కి చెందిన విలేఖరి. మానవహక్కుల వేదిక వాళ్ళు ప్రత్యేక ఆర్థిక మండళ్ళకి సంబంధించి ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన మొదటి వక్త. ఆయన ప్రసంగం ఆధారంగా వ్రాసిన టపా ఇది. వింటున్నప్పుడు నాలో కలిగిన భావాలని కూడా వ్రాసాను. కాబట్టి విషయంతో పాటుగా వైయక్తిక పరమైన అభిప్రాయాలు ఉన్నాయి. 
అసీం శ్రీవాస్తవ ఈ క్రింది విధంగా ప్రత్యేక ఆర్థిక మండళ్ళ గురించి వివరించారు:

1. ఎప్పుడు, ఎలా, ఎందుకు చట్టం చేయబడింది.

9 మే 2005 న ఈ చట్టం గురించి పార్లమెంటులో చర్చించాలని నిర్ణయించారు. 11 మే 2005 న చట్టంగా ఆమోదించబడింది. ఆ రోజున 42 అంశాలు చర్చించవలసి ఉంటే ఇది ఆఖరుది. ఈ చట్టం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కేవలం 7 మంది సభ్యులు మాత్రమే సభలో ఉన్నారు.

మురసోలి మారన్ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ షెంగ్ జిన్ అనే ప్రత్యేక ఆర్థిక మండలిని చూసి, అది నచ్చడంతో అలాంటి వాటిని భారతదేశంలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

వివిధ మంత్రులు విదేశాలకు వెళ్ళినప్పుడల్లా వారికి ఏది నచ్చితే అది సవివరమైన చర్చ లేకుండా, కూలంకషంగా అర్థం చేసుకోకుండా చట్టాలుగా ప్రజల నెత్తిన రుద్దుతున్నారు.

మన దేశంలో చట్టాలు ఎలా చేయబడతాయి అనే విషయానికి సంబంధించి ఇదొక బాధాకరమైన ఉదాహరణ.

2. ఈ చట్టం చెప్తున్నదేమిటి?

ప్రత్యేక ఆర్థిక మండలి – ప్రత్యేక అని పేరులోనే ఉన్నందున ఇది అన్నిటికీ అతీతమైన చట్టంగా రూపొందించబడింది.

ఏదైనా ఒక సంస్థ లేదా సంస్థల సమూహాలు కొన్ని ఎకరాల స్థలాన్ని తమ వ్యాపారాభివృధ్ధికై తీసుకుంటారు. అత్యంత తక్కువ రుసుముతో, వివిధ రాయితీలతో వీరికి ఈ స్థలం మంజూరు చేయబడుతుంది.

ఇక్కడ ప్రభుత్వం చే నియమించబడిన అభివృధ్ధి అధికారి (డవలెప్ మెంట్ ఆఫీసర్) ఉంటారు. అన్నీ ఆయన ఆమోదంతోనే జరగాలి. ఈ చట్టం లోని సెక్షన్లు 49, 51 ప్రకారం రాజ్యాంగాన్ని కూడా ఈ ప్రదేశంలో అమలు చేయరు. రాజ్యాంగం ఇక్కడ సస్పెండ్ చేయబడుతుంది. మన చట్టాలు, న్యాయం ఇక్కడ చెల్లుబాటు కావు.

వ్యవసాయ యోగ్యమైన భూములని ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కోసం ఇవ్వకూడదు.  ఏ పరిశ్రమ స్థాపించబోతున్నారు, ఎప్పటికి పూర్తిచేస్తారు, ఎంత మందికి ఉపాధి చూపించదలుచుకున్నారు ఇలాంటి వివరాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టుని అధికారులకు ఇవ్వవలసి ఉంటుంది.

కేటాయింపు – ఆమోదం:

ఒక సంస్థకు ప్రత్యేక ఆర్థిక మండలిని ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయించాలంటే 5 అంచెల ప్రక్రియ పాటించాలి.  మొదటి రెండు అంచెలు ఏ రాష్ట్రంలో ఈ ప్ర. ఆ. మం. ని ఏర్పాటు చేస్తారో ఆ రాష్ట్రం ఆమోదించాలి. మిగతా మూడు అంచెలను – ఇన్ ప్రిన్సిపల్ , ఫార్మల్ మరియు నోటిఫికేషన్ దశలు అంటారు.  ఈ మూడు దశలని కేంద్రం పర్యవేక్షించాల్సి ఉంటుంది.

ఆర్థికాభివృధ్ధి:

ఆర్థిక పరమైన అభివృధ్ధి సాధించి, ప్రజలకు పని కల్పించడమే లక్ష్యం. ఈ ఆర్థిక ప్రగతి అన్నదానికి కొలబద్ద ఏమిటంటే ఎగుమతి, దిగుమతులతో పోల్చి చూసినప్పుడు కనీసం ఒక డాలర్ అయినా లాభం రావాలి.

మౌలిక వసతుల కల్పన:

ఇది నిజంగానే కల్పన. చట్టం ఏమి చెప్తున్నదంటే ఏ సంస్థ అయితే ప్రత్యేక ఆర్థిక మండలి ని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుందో ఆ సంస్థ మౌలిక వసతులైన రోడ్లు, విద్యుత్తు, నీరు, వసతి మొదలగునవి అక్కడి ప్రజలకు కల్పించాలి.

ఉద్యోగ భద్రత:

ఎవరి స్థలాలైతే తీసుకొనబడతాయో వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించి మంత్రులకే స్పష్టత లేదు.

3. ప్రభుత్వం చెప్తున్న వాటిలో నిజం పాలు ఎంత?

అ. వ్యవసాయ భూములనే తీసుకుంటున్నారు.

రైతుల చేత బలవంతంగా మా భూములు ఎందుకూ పనికి రానివని సంతకాలు చేయించుకుంటున్నారు.

ఒప్పుకుంటే కొన్ని లక్షలు ఇస్తాము (స్థలం విలువకు ఏ మాత్రం సరితూగని రొక్కం), లేకపోతే అదీ లేదు అని సాక్షాత్తు కలెక్టర్లే ప్రజలను నయాన, భయాన లొంగదీసుకుంటున్నారు. భూములున్న రైతులు ఇప్పుడు దేశ దిమ్మరులుగా మిగిలారు. ఏ రాష్ట్రంలో పని దొరికితే ఆ రాష్ట్రానికి పరుగులు తీస్తున్నారు. కుటుంబాలకు దూరమవుతున్నారు. వేలాది కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి.

బి. ఉద్యోగ కల్పన లోపభూయిష్టం

ఎక్కువ శాతం ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఐ టి కి సంబంధించినవే. ఐ టి సంస్థల్లో బాగా చదువుకున్న వారికే ఉద్యోగాలు దొరకడం కష్టం. అలాంటిది ఈ గ్రామాల్లోని ప్రజలకు, రైతులకి ఏమి ఉద్యోగం కల్పిస్తారు?

కొంతమంది యువకులను మాత్రం సెక్యూరిటి గార్డులుగా నియమిస్తారు. మిగతా వారందరిదీ దిక్కుతోచని పరిస్థితే. పెళ్ళి కాని యువతులని మాత్రమే తీసుకుంటారు. పెళ్ళి అయితే పిల్లలని కనము అనే షరతులతో పనిలో చేర్చుకుంటారు.

ఇక్కడ నియమిత పని గంటలకు సంబంధించి నిబంధనలు లేవు. ఎక్కువ గంటలు పని చేయించుకోవచ్చు. అందుకు భత్యం చెల్లిస్తే సరిపోతుంది.

దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళలో పని విధానాలు, నియమాలు చూస్తే బ్రిటీషు కాలం నాటి వివరాలు చదువుతున్నామా లేక 2008 కి చెందిన విషయాలా అన్నది అర్థం కాదు.

4. వివిధ కోణాల్లో కలిగే నష్టాలు:

అ. న్యాయపరంగా

మన న్యాయం అమలే కాదు. ప్రజాస్వామ్యానికి దైవం లాంటి రాజ్యాంగమే చెల్లుబాటు కాని పరిస్థితుల్లో ఇక ఎటువంటి న్యాయాన్ని ఆశించగలం. కేవలం కేంద్రం నియమించిన అభివృద్ధి అధికారికి మాత్రమే విచక్షణాధికారాలు ఉంటాయి. సంస్థ తరపున కొంతమంది డైరెక్టర్లని నియమించుకోవచ్చు. ఎంతమంది అన్నదాని మీద స్పష్టత లేదు. ఒకవేళ వాళ్ళే ముగ్గురు లేదా నలుగురు ఉన్న పక్షంలో నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నది ఊహించడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎవరికి కంప్లైంట్ చేస్తాము. ఏమని చేస్తాము?

బి. రాజకీయంగా

ఎన్నికలు జరిగినప్పుడు, ప్రత్యేక ఆర్థిక మండలి మన దేశంలోనే పరాయి దేశంగా నిర్వచించబడినప్పుడు, ఓటు హక్కు ఎలా ఉంటుంది, విధి విధానాలేమిటి ఇంత వరకు ఎవరికీ తెలీదు. అక్కడ ప్రత్యేక పాలన కూడా ఉంటుందా. ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తే…… ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళన్నీ పరాయి దేశాలుగా మారిపోయిన రోజున, అసలే తీవ్రవాదం కోరలు సాచిన ఈ రోజుల్లో పరిస్థితిని ఊహించాలన్నా భయం వేస్తుంది.

మన దేశంలోనే పరాయి దేశాలను సృష్టించి బంగారు పళ్ళెరంలో భరతమాత అంగాంగాలను విక్రయిస్తుంటే, దేశ సరిహద్దులో అన్ని ప్రతికూలవాతావరణ పరిస్థితులను తట్టుకొని విధులు నిర్వహిస్తున్న సైనికుల త్యాగాలు గంగపాలే. ఇంతకు మించిన దేశ ద్రోహం ఉంటుందా.

సి. వనరుల పరంగా

వ్యవసాయాధారిత భూములనే ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు కేటాయిస్తున్నారు. ఎందుకు అన్నది విదితమే. వ్యవసాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కనీస వసతులు ఏర్పడి ఉంటాయి. రోడ్లు కానీ, విద్యుత్తు కానీ, నీటి వసతి కానీ ఉంటుంది కాబట్టి ఇందుకోసం వాళ్ళు ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ ఉండదు.

ప్రకృతిని నాశనం చేస్తున్నారు. చెరువులు ఎండిపోతాయి. (వీటికి సంబంధించి ఉదాహరణలతో మరొక టపా వ్రాస్తాను).

5. అక్రమాలు

అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే పాలకుల అవినీతికి, అక్రమానికి, ధన దాహానికి అంతమనేది లేకుండా పోతుంది. డబ్బులు దండుకుంటే దండుకున్నారు. కనీసం దేశ భద్రతకి సంబంధించి, సార్వభౌమత్వానికి సంబంధించి, ప్రకృతి వనరులను కాపాడడం గురించి ఏ మాత్రం స్పందన లేకుండా ఎలా ఉంటారా అన్నది అర్థం కాని విషయం. చివరికి కలెక్టర్ల స్థాయి అధికారులు కూడా ఈ విషయంలో బాధ్యత ఎరిగి ప్రవర్తించకపోవడం దారుణమైన విషయం. తిలా పాపం తలా పిడికెడు చందం వేళ్ళూనుకొనిపోయింది.

గోవాలో సామాజిక సేవకులు ఆర్ టీ ఐ యాక్ట్ సహాయంతో ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కోసం వచ్చిన అప్లికేషన్లు, ముఖ్యంగా ఆమోదం పొందిన సంస్థలకు సంబంధించినవి అడిగి అవినీతి ఏ స్థాయిలో ఉందో, బాధ్యతారాహిత్యం ఎంత నీచంగా ఉందో ప్రజల ముందుకు తెచ్చారు.

కేవలం ఓ తెల్ల కాగితంపై కనీసం సంస్థ పేరు లేకుండా, స్టాంపు లేకుండా, అంచనాలు ఏవీ లేకుండా ఉన్న ఒక సాధారణ పేజీతో కూడిన అప్లికేషను ఆమోదించబడింది. ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవలసిన విషయం. బయటపడితే ఏమవుతుంది అన్న కనీస భయం కూడా లేని నిర్లజ్జ.

నిందించాల్సింది వాళ్ళని కాదు. ఇంతకు పదింతలు జరిగినా మనకు ఏమీ పట్టదు. చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎవడెటుపోతే మనకేమిటి, దేశం ఏమైపోతే మనకేమిటి. మనదాకా వస్తే కానీ మనకు పట్టదు. అప్పుడు మాత్రం మనకు అందరూ సహాయం చేయాలి. లేకపోతే కనీసం మనం పరికించి కూడా చూడం. ఎందుకంటే మనకు బొత్తిగా సమయం లేదు.

ముక్తాయింపు:

స్థూలంగా చెప్పినా, సూక్ష్మంగా చెప్పినా మన దేశంలో పరాయి దేశాలను సృష్టించడమే ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళ అర్థం. ఒకప్పటి పరాధీనతలో కేవలం పాలన మాత్రమే పరాయి వారి చేతుల్లో ఉండేది. ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళని పెంచుకుంటూ పోతే భారతదేశం గర్వించే ప్రకృతి వనరులను శాశ్వతంగా కోల్పోతాము. కేవలం భారతదేశ ప్రజలే కాదు మొత్తం మానవాళే నష్టపోతుంది. ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేసి మనకు స్వాతంత్ర్యాన్ని సిద్ధింప చేసిన మన పూర్వీకుల పట్ల, అలాగే మన తర్వాతి తరాల వారి పట్ల మనం ఎంతో అన్యాయం చేస్తున్నాము.

ఇప్పుడు కానీ మేల్కొనకపోతే తర్వాత మనల్ని క్షమించుకుందామన్నా వీలవదు. అసలు అలాంటి అవకాశమే ఉండదు. నా చిన్ని కడుపే శ్రీరామ రక్ష, నా సొంత బతుకే విషమ పరీక్ష అని మన మనస్తత్వాల గురించి కార్గిల్ యుద్ధ సమయంలో రాసుకున్నాను. అది ఇప్పటికీ అలాగే ఉంది. ఈ భావజాలం నుంచి మనం బయటపడాలి. ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కి వ్యతిరేకంగా పోరాడటమంటే మరో స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకోవడమే.

ప్రజలు అందరూ కలిస్తే, తెలివిగా పని చేయగలిగితే ఈ విషయంలో మన పాలకులను ఒప్పించడం పెద్ద సమస్య కాబోదు. నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కాకపొతే ఇక ఎప్పటికీ దొరకదు.

ఏ సంస్థకు చెందిన వాళ్ళో, పరాయి దేశం వాళ్ళో తప్ప మన దేశాన్ని మనం బాగు చేసుకోలేనంత, అభివృధ్ధి సాధించలేనంత దద్దమ్మలమా మనందరం!!