ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా – 1

 ఈ వ్యాసం పొద్దు మేగజైనులో జూలై నెల మొదటి ఆదివారం ప్రచురితమైంది. కశ్యప్ కి, త్రివిక్రం గారికి నా కృతజ్ణ్జతలు.

<a target=”_blank” href=”http://poddu.net/?p=263“> పొద్దులో నా వ్యాసానికి లంకె.</a>

======================= 

నాకు ప్రతి ఆదివారం ఓ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళాలని ఉండేది. ఏదైనా మంచి పని చేయాలని ఉండేది. ముందు నిలబడే చొరవ లేక ఎవరైనా ముందు నడుస్తుంటే వారి వెనుక నేను పని చేద్దాం అనుకునేదాన్ని. మొత్తానికి ఏమీ చేయకుండానే కాలం గడిచిపోయింది.

కార్గిల్ యుద్ధం అప్పుడు మాత్రం ఏదైనా చేయాలనే తపన నా భయాలనన్నిటినీ అధిగమించి డబ్బులు సేకరించి పంపేలా చేసింది. ఇంకోసారి పేపరులో స్రవంతి అనే అమ్మాయికి రక్తమార్పిడి కోసం డబ్బులు అవసరమని చదివి నెట్ స్నేహితులందరికీ మెయిల్స్ పంపితే తక్షణమే స్పందించి వారి సహాయాన్నందించారు. మంచి పని ఏదైనా సరే అనుకున్న వెంటనే అమల్లో పెట్టేయాలి, తోడ్పాటు దానంతటదే అందుతుందని అర్థమయ్యేలా చేసారు.
group-photo_2.jpg
అయినా నాలో పెద్ద మార్పు లేదు. ఎందుకంటే అవి అన్నీ తాత్కాలిక స్పందనలే. ఆ సమస్య పరిష్కారాం కాగానే, హమ్మయ్య ఓ మంచి పని చేయగలిగాననే ఆనందం తప్ప, ఇంకా ఏమి చేయగలనా అని ఆలోచించలేదు. అప్పట్లో ఉద్యోగరీత్యా నాకు మంచి బ్రేక్ రాలేదు. మానసికంగా కూడా నేను సరిగా లేను.

“నేను జీవితంలో ఇంకా నిలదొక్కుకోలేదు.”
“కొంత వెనకేసాక సేవ చేస్తాను.”
“నాకు అంతటి సామర్ధ్యం ఉందా?”
“నాకు సమయం చాలదు.”
“ఎవరైనా ముందు ఉంటే నేను చేస్తాను.”

ఇలాంటి పలాయనవాదంతో గడిపేదాన్ని. ఎప్పటికైనా చేస్తానులే, సేవ చేయాలంటే పక్కా ప్రణాళిక ఉండాలి అని నన్ను నేను సముదాయించుకునేదాన్ని.

అలాంటి సమయంలో నాలో మార్పు తెచ్చింది ఓ ప్రయత్నం. చేద్దాంలే, చూద్దాంలే, పక్కా ప్రణాళిక వేసుకుందాం ఇలా అనుకుంటే అసలు మొదలే కావు. ఏదో ఒకటి మనం చేయలేనంత మాత్రాన మిగతావేవీ చేయలేమని కాదు. ఫలానాదేదో చేశాక, సాధించాక ఇంకేదో చేయడం కాదు. అసలు మనం ఉన్న పరిస్థితుల్లో, మనకు ఉన్న వనరులను ఉపయోగించుకుని పని చేసేటట్టు ఉండాలి. ఏవో లేవు అనుకోకూడదు, అని నేర్పిందో సందర్భం.

అర్థరాత్రి …… అపురూప క్షణాలు

2005 ఫిబ్రవరి 4 రాత్రి, ఈనాడు హెల్ప్ లైన్ లో ‘పదకొండేళ్ళ బాలిక అస్మా కి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ కి సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది’ అని చదివి మనసాగక తెలుగుపీపుల్ డాట్ కాం చర్చావేదికలో పోస్ట్ చేసాను. మనం అందరం కలిసి ఎంతో కొంత పంపుదాం అని. ఏదో పోస్ట్ చేసానే కానీ ఎంతమంది స్పందిస్తారు అనేదాని మీద నాకు ఎలాంటి ఆలోచన లేదు. నేను ఒక్కదాన్నే ఇవ్వగలిగే మొత్తం కంటే, ఏ కొంచెం ఎక్కువ అందచేయగలిగినా చాలు అనుకున్నాను.

పొద్దున లేచి చూస్తును కదా, నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. చాలా మంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు. డబ్బులు ఎలా పంపాలి అని అడిగారు. భాస్కర్ గారైతే అప్పటికే ఎమ్మార్వో గారికి డబ్బులు పంపేసారు. నాకు కొంచెం ఉత్సాహం వచ్చి, కొద్ది రోజుల వ్యవధి పెట్టుకుని ఎంత సేకరించగలిగితే అంత ఒక్కసారే పంపుదాం అని చెప్పాను. అలా మొదలైన ప్రయత్నం, ఇంకా బాగా సహాయం చేయగలమా అనే ఆలోచనతో మొదలై చివరికి మేమే బాధ్యత తీసుకునే స్థితికి వచ్చింది. ఎంతో అనుభవం ఈ మొదటి కేసులోనే. ఎలాగైతేనేమి ఆ పాపకి ప్రాణభయం లేదు, ఆపరేషను అవసరం లేదు, ఫిజియోథెరపీతోనే నయం చేయచ్చు అని విన్నాక ప్రాణం లేచొచ్చింది.

అస్మా విషయం విజయవంతంగా ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడు నాలో చాలా అంతర్మథనం జరిగింది. ముందు నిలబడగలిగితే, కొంచెం బాధ్యత తీసుకుంటే మనకు చేయూతనిచ్చేవారు ఎంతమంది ఉన్నారు, ఇతరులకి సహాయపడడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు అని అనిపించింది. అందరూ ఒకలాగే ఆలోచిస్తారు. ఎవరో ముందు నడిస్తే తాము ఎంతటి పని చేయడానికైనా సిద్ధపడతారు. ఒకసారి మనం ముందు నిలబడితే చాలు, తరువాత ఇక నడవనవసరం కూడా లేదు, మన తోటి వారే మనల్ని ముందుకు తీసుకెళతారు. ఇది నా అనుభవం నాకు తెలిపిన నిజం.

ఐతే ఆ బాధ్యత తీసుకోవడానికి ముందు వ్యక్తిగతంగా నా లోటుపాట్లు ఏమిటి, నలుగురికీ ముందు నిలబడగలగడానికి నా అర్హత ఏమిటి అనేది నా పరంగా ఎలా ఉంది, నలుగురి దృష్టికోణంలో ఎలా ఉంది అని ఆలోచించాను. అంతమంది నన్ను నమ్ముతున్నప్పుడు, నా మాటకు విలువిచ్చి మంచి పనికి తోడుగా వస్తున్నందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బలంగా అనిపించింది. నన్ను పట్టి పీడించే అపోహలు, నా పట్ల, నా సమర్థత, అర్హతల పట్ల నాకు గల భావాలు అన్నిటినీ ఆ నాటి ఆ స్ఫూర్తి అధిగమించింది.

సరే. ఈ సాయాన్ని ఇలాగే కొనసాగించాలి, ఇలా ముందుకు వచ్చిన వారిని వెనక్కి పోనీయకుండా ఇంకా ముందుకు సాగాలి అనుకున్నంత వరకు బాగుంది. ఎలా సాగాలి, ఇది తదుపరి ప్రశ్న. ఇలాంటి పనులు చెయ్యాలనుకున్నప్పుడు మొదట ఎదురయ్యే పెద్ద సమస్య కమ్యూనికేషన్. అవసరమొచ్చినప్పుడల్లా ఒక్కొక్కరికి మెయిల్స్ పంపడం చాలా కష్టం. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అలా కాకుండా ఒక మెయిలింగ్ గ్రూప్ ప్రారంభించినట్లైతే ఆ గ్రూప్ కు నేను మెయిల్స్ పంపుతూ ఉంటాను, ఇష్టమైన వాళ్ళే అందులో సభ్యులుగా చేరుతారులే అనుకున్నాను. గ్రూప్ ప్రారంభించాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఆ గ్రూప్ కి పేరు ఏమి పెట్టాలి అనే ప్రశ్న ఎదురైంది.

పేరులో ఏముంది!!

నెల్లూరులో శ్రీ పెరుగు రామకృష్ణ దంపతులు, శ్రీమతి జయప్రద గారి ప్రోద్బలంతో, మిగతా కవులందరి ప్రోత్సాహంతో నేను రెండు మూడు కవి సమ్మేళనాల్లో పాల్గొనడం జరిగింది.

శ్రీమతి పెరుగు సుజనారామం గారి శ్రేయోభిలాషి ఒక రిటైర్డ్ అంకుల్ ఉండేవారు. సాహిత్యం అంటే తనకి ఎంతో ఇష్టం. ఆయనకు నా కవితలు నచ్చాయి. నన్ను రామకృష్ణ గారి ఇంటిలో కలిసారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము అందరమూను. ఆ తరువాత ఒకసారి ఆయన తను కొత్తగా చదివిన పుస్తకం గురించి చెప్తూ, తనకు బాగా నచ్చిన కథ చెప్పారు:

సముద్రంలోని ఆటుపోట్ల వల్ల ఎన్నో స్టార్ ఫిష్ లు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. కొన్ని కిలోమీటర్ల మేర పరుచుకున్న ఒడ్డంతా స్టార్ ఫిష్ లే ఉన్నాయి. ఒకతను ఒక్కొక్క స్టార్ ఫిష్ ను తీసుకుని సముద్రంలోకి విసరసాగాడు. ఓ బాటసారి అతన్ని చూసి దగ్గరకి వెళ్ళి ఇలా అడిగాడు:

‘చూడు ఒడ్డు ఎంత పొడవుగా ఉందో. ఎన్ని వేల స్టార్ ఫిష్ లు ఉన్నాయో. ఒక్కొక్క దాన్ని అలా విసరడం వల్ల ఈ సమస్య తీరుతుందా, పరిస్థితిలో మార్పు వస్తుందా! ఎందుకీ వృథా ప్రయాస!’.

అప్పుడు అతను ఇతనికేసి చూసి, మరలా ఇంకొక స్టార్ ఫిష్ ను చేతిలోకి తీసుకుని ‘దీని పరిస్థితిలో మార్పు వస్తుంది’ అంటూ సముద్రం లోకి విసిరేస్తాడు.

చాలా అద్భుతమైన కథ అనిపించింది. ఆ రోజు అంకుల్ చెప్పిన ఆ కథ నాకు మరలా గుర్తొచ్చింది. మనందరి మనస్తత్వానికి సరిపోయే కథ. సమస్య పెద్దదైనప్పుడు, మనం చేసే ఓ చిన్న ప్రయత్నం వల్ల ఏమి ప్రయోజనం అనే నిరాశావాదం, పలాయన ధోరణే ఎక్కువ ఉంటుంది సమాజంలో.

అంతే కానీ ఏ ఒక్క వ్యక్తికి మనం మేలు చేయగలిగినా అది గొప్ప విషయమే అని అనుకోం. ఏది చేయలేం అనేదాన్ని గురించే ఆలోచిస్తాం తప్ప, మార్పుకోసం ఏది చేయగలం అని ఎప్పుడూ ఆలోచించం. అందుకే ఆ ఆలోచన కలిగించడానికే గ్రూపు పేరు “మార్పుకోసం” (ఇంగ్లీషులో “To Make A Difference”) అని పెట్టాను. గ్రూపు URL ఇది: http://groups.yahoo.com/group/tomakeadifference
గ్రూపుకొచ్చే మెయిళ్ళను, గ్రూపులో జరిగే చర్చలను అక్కడ చూడవచ్చు.

స్ఫూర్తిదాయకం

గ్రూప్ పెట్టాలనుకోవడం, పేరు నిర్ణయించడం అయిపోయాక, ఇక ఆచరణలో పెట్టడమే మిగిలింది. అప్పుడే ఎప్పుడో చదివిన మరొక కథ గుర్తొచ్చింది:

ఒకతను ఏదో కారణం వల్ల జైలుకెళ్తాడు. వాళ్ళ నాన్న అతనికొక ఉత్తరం రాస్తాడు. ‘ఒరేయ్ బాబు! మేం ముసలివాళ్ళమైపోయాం. బయటిపనులు చేయలేం. మన పెరడులో పాదులేసుకుని, పండే కూరగాయలతో ఏదో బతుకుబండిని నెట్టుదామనుకుంటున్నాం. పెరడు చదును చేసే శక్తి లేదు. వేరే వాళ్ళ చేత చేయించడానికి డబ్బులు లేవు. నువ్వు ఇక్కడ ఉండి ఉంటే ఈ బాధ్యత నువ్వు తీసుకునేవాడివి కదా’ అంటూ. అది చదివి ఇతను ఆలోచనలో పడతాడు.

ఓ పదిహేను రోజుల తరువాత తండ్రి నుంచి మళ్ళీ ఓ ఉత్తరం వస్తుంది తనకి. ‘ఒరేయ్ బాబు! పోలీసులకు నువ్వు ఏమి చెప్పావు? వాళ్ళు వచ్చి పెరడు అంతా తవ్వి వెళ్ళారు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. కానీ నాకైతే సంతోషంగా ఉంది. ఇక మొక్కలు వేసుకోవచ్చు’, అని. ఆ ఉత్తరం చదివి ఇతను తృప్తిగా నవ్వుకుంటాడు.

నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అన్నదాంతో సంబంధం లేకుండా, మనస్ఫూర్తిగా ఏమైనా చేయాలనుకుంటే ఎలాగైనా చేయగలవు అనేదే నీతి ఈ కథలో.

యాడ్ వాల్యూ టు యువర్ మనీ – ఇది టాగ్ లైను. డబ్బుకి విలువ జోడించడమంటే, ఆ డబ్బు ద్వారా కలిగే ప్రయోజనంతో పోల్చడం. మనం ఇచ్చిన 100 రూపాయలు లేక 500 రూపాయలు, ఒక సహాయానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఒక ఆపరేషను నిమిత్తం మనం ఇచ్చే డబ్బు, అందరి చేతులు కలిసే సరికి పది వేలో, ఇరవై వేలో, లేదా ఓ లక్షో అవుతుంది. ఇక్కడ 100 విలువ ఆ లక్షతో సమానం. ఓ మనిషికి దక్కిన ఆరోగ్యంతో, నిలబెట్టిన ప్రాణంతో సమానం, వెరసి ఓ జీవితం, ఊపిరి పీల్చుకున్న కుటుంబం. ప్రపంచంలోని ఏ బాంక్ అయినా, ఏ షేర్, స్టాక్ లేదా మ్యూచ్యువల్ ఫండ్ అయినా మన డబ్బుని అన్ని రెట్లు చేయగలదా, ఇంత తక్కువ సమయంలో. ఈ సత్యమే ఆ టాగ్ లైనుకి అర్థం.

ఇక గ్రూప్ పేజీలో ఉన్న ఫోటో గురించి కూడా చెప్పాలి. గూగుల్ లో గాలించి రెండు, మూడు ఇమేజులను కలిపి ప్రస్తుతం ఉన్న ఫోటో ని సృష్టించాను. “మిమ్మల్ని మీరు గ్రూప్ కి పరిచయం చేసుకోండి”. అందరికీ మన గురించి తెలియచేయడానికి సూర్యకిరణాలు సంకేతం. పరిచయం చేసుకున్నాక అందరితోను మన భావాలు, అనుభవాలు, సలహాలు పంచుకోవాలి. అప్పుడు ఒకరికొకరం బాగా అర్థమవుతాం. మార్గం చాలా పెద్దది. ఆశయం ఉదాత్తమైనది. కలిసి పని చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాం.

ప్రత్యేకతలు:

ఎన్నో సంస్థలు సంఘసేవలో రకరకాల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే, ఓ కొత్త గ్రూపు పెట్టాల్సిన అవసరం ఏముంది! దీని ప్రత్యేకత ఏమిటి?

1. ఏ ఒక్క నిబంధనకో బందీ కాకపోవడం:

సాధారణంగా సంస్థలకు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. వాటికి లోబడే అవి పనిచేయాలి. ఎంత డబ్బున్నా సరే, అవసరం ఎంత న్యాయమైనదైనా సరే వారి పరిథిలోకి రాకపోతే వారు ఎలాంటి సహాయం చేయరు. ఇది ఎవరి తప్పు కాదు. ఒక సంస్థ ప్రణాళికాబధ్ధంగా నడవాలంటే నిబంధనలకు అనుగుణంగానే పని చేయాలి.

ఈ గ్రూపు అలా ఉండకూడదు, ఏ ఒక్క నిబంధనో ఓ మంచి పని చేయడానికి అడ్డు రాకూడదు అనేదే ముఖ్యోద్దేశ్యం. ఇవే చేయాలి, ఇలాగే చేయాలి అనే థంబ్ రూల్స్ ఏవీ లేవు. ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడమే. ఒక కేస్ మా దృష్టికి వచ్చినప్పుడు, అది సరైనదేనా, ఫలాన వారికి సహాయం చేయాలా, వద్దా, చేయదలుచుకుంటే ఎలా చేయాలి అనేది నిజానిజాలు తేల్చుకుని, అందరూ కలిసి నిర్ణయిస్తాము.
ముఖ్యంగా ఎవరూ, ఏ సంస్థ సహాయం చేయని కేసులని మేము తీసుకుంటాము. అవసరం నిజమైందా కాదా అని మాత్రమే చూస్తాము. మానవతా దృక్పథమే మా నిర్ణయాలకు ప్రాతిపదిక.

2. నగదు చేతికి ఇవ్వకుండా ఉండడం:

విద్యా పరమైన సహాయమైనా, ఆరోగ్య పరమైన సహాయమైనా, ఇక ఏ రకమైనా సాధ్యమైనంతవరకు మేము డబ్బులు అవసరార్థులకు ఇవ్వము. పాఠశాల లేదా కళాశాల యాజమాన్యానికి కడతాము. టెక్స్టు మరియు నోటు పుస్తకాలు, సంచీలు, పెన్సిల్స్, పెన్ లు వగైరా అన్నీ మేమే కొంటాము. అలాగే హాస్పిటల్ కు రోగి తరపున డబ్బులు కడతాము. మందులు మేము కొనడం కానీ లేదా రోగి కొనుక్కుంటే డబ్బులు ఇవ్వడం కానీ చేస్తాము.

3. పాలనపరమైన ఖర్చులు లేకపోవడం:

మేం ఏ పని మీద వెళ్ళినా ఖర్చులు వలంటీర్లే భరిస్తాం. కన్వేయన్స్ చార్జులు, ఫోను బిల్లులు ఇలాంటి ఖర్చులు ఏవీ ఉండవు. ఎవరు ఎంత పంపినా సరే, మొత్తం ఆయా కేసుల పరంగా ఖర్చు అవుతుందే తప్ప, వాలంటీర్ల ఖర్చులంటూ ఏవీ ఉండవు. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆయా ఖర్చులు భరిస్తాం.

4. కుటుంబం లాగా ఉండడం:

సాధారణంగా సంస్థలు సంస్థల్లాగే ఉంటాయి, సభ్యులు సదస్యులలాగే ఉంటారు. కానీ మేం ఈ గ్రూప్ ని ఓ కుటుంబంలా భావిస్తాం. ఒకే రకమైన అభిప్రాయాలు లేకపోయినా, ఆలోచనా విధానాలు, ఆశయాలు ఒకటే. మా వ్యవహార శైలి అంతా ఆత్మీయంగా ఉంటుంది. ఓ సభ్యుల సమూహంగా కాక, స్నేహితుల కూటమిగానే దీన్ని మేం పరిగణిస్తాం. అలాగే వ్యవహరిస్తాం.

సేవ, ఇతరులకేనా?

నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అస్మాకు నేను సహాయం చేసానా, అస్మా నాకు సహాయం చేసిందా అని!!

1. నా సమయాన్ని నేను చాలా సద్వినియోగం చేసుకుంటున్నాను. ఒకప్పుడు చాలా వృథాగా గడిపేదాన్ని.

2. ఓ కవిత రాస్తేనో, ఓ పుస్తకం చదివితేనో, ఓ పాట వింటేనో, ఓ సినిమాకెళ్తేనో కలగని ఆనందం నాకు ఈ పనులు చేయడం వల్ల కలుగుతోంది.

3. ఎంతో మంది మంచివారితో నాకు పరిచయం కలిగింది. ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత. అన్ని వయసుల వారిలోనూ ఉత్సాహం. ఏదో చేయాలనే తపన.
allgroups_1.jpg
4. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అనుభవాలు పాఠాలు నేర్పాయి.

5. నాకు నా బ్లడ్ గ్రూపు ఏదో కొన్ని నెలల క్రితం వరకు తెలీదు. భయం. డాక్టర్లన్నా, ఇంజెక్షను అన్నా చాలా భయం. అలాంటిది నేను థలస్సీమియా వ్యాధి గురించి తెలుసుకున్నాక నా బ్లడ్ గ్రూపు చెక్ చేయించుకున్నాను. నేను ఎలాంటి సేవ అయినా చేస్తాను కానీ రక్తదానం మాత్రం చేయను అనుకునేదాన్ని. ఇంజెక్షను అంటేనే భయం. ఇక రక్తదానం అంటే అమ్మో!! కానీ త్వరలో అది కూడా చేయబోతున్నాను.

6. నాకు చిన్నప్పటి నుంచి షిర్డీ బాబాతో మంచి అనుబంధం. ఎప్పుడూ ఏదో ఒకటి తగువులాడుతూ ఉంటాను. అలాంటిది లోకంలో ఉండే బాధలు కొంచెం దగ్గరగా చూడడం మొదలెట్టాక, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చినందుకు మనం ఎంతగా వినమ్రులమై ఉండాలో, అందుకు ప్రతిగా మన తోటివారికి ఎంతగా సేవ చేయాలో కదా అనిపిస్తుంది.

7. పాశ్చాత్య దేశాల్లో మనం ఎవరి ఇంటికైనా వెళ్ళాలంటే ముందుగా వారి అనుమతి తీసుకోవాలి అని చదివి తెగ విమర్శించుకునేదాన్ని. కానీ ఆ మాటకర్థం నాకు ఇప్పుడు బాగా తెలుస్తోంది. ఎప్పుడూ ఎవరో ఒకరు మా ఇంటికి రావడం, నా పనులు నిలిచిపోవడం, లేదా చేయాలనుకున్నవి చేయలేకపోవడంతో విలువ తెలిసొస్తోంది. ఎవరినీ విమర్శించకూడదు. ఆయా పరిస్థితులు మనకు అనుభవంలోకి వస్తే కానీ అలానే ఎందుకు ప్రవర్తిస్తారో మనకు అర్థం కాదు.

8. మనసుంటే మార్గముంటుంది. అలాగే మనం తీవ్రంగా దేనికోసమైనా తపిస్తే తప్పక దాన్ని మనం సాధించగలం. పరిస్థితులు వాటంతట అవే ఎదురవుతాయి మనం ఏ ప్రయత్నం చేయకపోయినా. ది అల్కెమిస్ట్ లోని ‘వెన్ యు వాంట్ సంథింగ్, ఆల్ ద యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్’. ఇది చాలా నిజం. సమాజానికి ఏదో చేయాలి అనే తపన నాకు చిన్నప్పటి నుంచీ ఉండేది. అనుకోకుండా నేను మొదలెట్టాను. అనుకున్నట్టుగా చేయగలుగుతున్నాను. ఇంకా బాగా చేయాలనే ఉత్సాహాన్ని పొందుతున్నాను.

9. సహజంగా నేను చాలా మూడీ. అలాంటిది ఓ కొత్త వ్యక్తి గ్రూపు గురించి మెయిల్ చేసినా, ఫలానా విధంగా పని చేద్దాం అని చెప్పినా, ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అన్నీ మరిచిపోయి ఇంకా ఇంకా శ్రమించాలని ఉత్తేజం కలుగుతుంది.

10. అన్నిటికీ మించి వెలకట్టలేనిది, వర్ణించలేనిది, మన సహాయం అందుకున్న వారి మొహంలోని సంతోషం, కృతజ్ఞతాభావం.
allgroups_2.jpg

ఇప్పుడు చెప్పండి. మనం ఇతరులకు సహాయం చేస్తున్నామా, మనకు మనమే సహాయం చేసుకుంటున్నామా?

వెనుకబాటుతనం – లోపం ఎక్కడుంది?

ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో సామాజికాంశాల మీద తరాల తరబడి కృషి చేస్తున్నా ఆశించదగ్గ స్థాయిలో పరిస్థితుల్లో మార్పు ఎందుకు రావడం లేదు?

ప్రకటనలు

సేవ – సగటు మనిషి

 ఈ వ్యాసం నవంబరు 2007 భూమిక సంచికలో ప్రచురింపబడింది. భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారికి కృతజ్ణ్జతలతో.
భూమికలోని నా వ్యాసానికి లంకె.
 ========

అనామకం

నా అస్థిత్వాన్ని నేనెందుకు వ్యక్తపరచనో తెలుసా?

నాలోని భావనా వీచికలు, ఆలోచనా ప్రవాహాలు
నా ఈ కవితలు
అవి ఇంతవరకు అక్షర రూపమే దాల్చాయి
ఇంకా ఆచరణ మార్గం పట్టలేదు
ఆశయదీపం వెలిగించలేదు
అలా జరిగిన రోజున,
సగర్వంగా ప్రకటిస్తాను
నేనే ఈ కవితలు వ్రాసానని
మహదానందంగా మనవి చేస్తాను
నేనే ఈ ఆలోచనలు చేసానని
ప్రస్థానం

ఒకప్పుడు
ఆవేశం అక్షరాలు ఒలికించేది
ఆవేదన కాగితంతో గోడు వెళ్ళబోసుకునేది

ఇప్పుడు
ఆవేశం, ఆవేదన …. ఆలోచనగా మారాక
ఆచరణ మార్గం పట్టాక
రాయడానికి ఊసులు లేవు
చేయడానికి పనులు తప్ప

————

ఎందరో మహానుభావులు. వయసులోనూ, జ్ణ్జానంలోను, అనుభవంలోను ఏ మాత్రం సరిపోలని నేను నా భావాలు పంచుకోవడం ఓ దుస్సాహసమే. కాకపోతే బలహీనత కూడా ఓ పాఠమే. నేను ఓ సగటు మనిషికి ప్రతినిధిని కాబట్టి, సదరు సగటు మనిషికి ఉండే అన్ని అవలక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి, నేను తెలుసుకున్న విషయాలు సగటు మనుషులను స్పందింపచేస్తాయి అనే.

ఎంత స్వార్ధ పరుడైనా సంఘంలో జరిగే వాటికి అతీతంగా మనలేడు. సామాన్యులకి సంఘంలో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి….. పత్రికల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా. ఈ రోజుల్లో మనం నిత్యం చదివేవి ఏంటి? హత్యలు, మానభంగాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం మొదలైనవి. ఎవరు మంచో, ఎవరు చెడో కూడా అర్థం కాని వైనం. మన నీడను చూసి మనమే ఉలికిపడే కాలం. పుస్తకాల్లో చదువుకున్న వాటికి, ప్రత్యక్షంగా జరిగే వాటికి ఎక్కడా పొంతన ఉండదు. ఆవేశం కలుగుతుంది. ఏదో చేయాలనిపిస్తుంది. ఏమి చేయాలో అర్థం కాదు. ఎంత ఆలోచించినా పరిష్కారాలు తోచవు. అప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయత ఆవేదనని కలిగిస్తుంది.  కానీ ఆవేశం లేదా ఆవేదన ద్వారా కలిగే ఉద్వేగం చల్లారాలి కదా… ఎలా…… అలా మొదలయ్యేవే కవితలనబడే తవికలు. ఏవో పిచ్చి రాతలు.

రాసాక ఇక ఊరికే ఉండం కదా. అందరికీ కాకపోయినా అభిరుచులు కలిసిన వాళ్ళకు చెప్తాము. అరే పత్రికలకు పంపించచ్చు కదా అని తోటి వాళ్ళ సలహాలు. చెట్టు లేని చోట ఆముదపు చెట్టు అనే సామెత ఏమిటో బాగా అనుభవంలోకి వస్తుంది. ఏమీ చేయలేకపోతున్నామే అనే నిస్సహాయతలోంచి జనించిన వాక్యాలు ప్రచారం కోసం కాదు కదా. ఆచరణ లేని ఆలోచన కానీ, ఆవేశం కానీ ప్రయోజనమేమిటి? అందులోనూ వీలైనంతవరకు తమలో తామే ముడుచుకుపోయే స్వభావం కలవారికి పిరికితనమే కానీ, ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది? కేవలం పదాడంబరమే అయితే రాజకీయనాయకులు బాగా ప్రగల్భాలు పలకగలరు కదా.

సరే మరి పిరికివారు దేనికీ పనికిరారా? వారి దేశభక్తి ఎందుకూ కొరగానిదేనా? సమాజానికేమీ ఉపయోగపడలేరా? ధర్నాలు, పోరాటాలు చేయలేని వారు, ఇది అన్యాయం అని ఎలుగెత్తి అరిచే చేవలేని వాళ్ళు, చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు అనే గాంధీ గారి మర్కట సిధ్ధాంతాన్ని అనుకూలంగా వాడుకునేవారు…… మరి ఏమి చేయాలి? వేరే మార్గమే లేదా? ఎంతో అంతర్మథనం. పోనీ హింసా మార్గం సరైన మార్గమేనా? బస్సుల్ని తగులబెట్టి, రైళ్ళను, టెలిఫోను బూతుల్ని పేల్చేసి, అడపా దడపా బాధ్యులైన వారిని చంపేస్తే ప్రయోజనం సిద్ధించిందా…లేదే? మరి ఏది సరైన మార్గం. సగటు బతుకు వెళ్ళదీస్తూనే సమాజానికి ఉపయోగపడలేమా? ఓ మంచి మార్పుని ఆశించలేమా? కనీసం కొన్ని తరాల తర్వాతైనా తరింపచేసుకోలేమా?

మథన పడగా, పడగా….ఎప్పుడో చదివిన ఓ చిన్ని కథ గుర్తుకొచ్చింది. చీకటి లో చిరుదివ్వెలా వివేకపు వెలుగు విరజిమ్మింది. చిన్న గీత. పెద్ద గీత. పెద్ద గీతను చెరపకుండ దాన్ని చిన్నది చేయాలంటే ఏమి చేయాలి? దాని పక్కన మరో పెద్ద గీతను గీయాలి. అంటే. చెడు ప్రస్తుతం పెద్ద గీత. కానీ దాన్ని పట్టించుకోలేనంత చిన్నది చేయాలంటే మంచిని అంతగా పెంచాలి. ఎలా సాధ్యం. ఏ ఒక్కరితోను సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ ‘నేను సైతం’ అని తమ వంతు పాత్ర నిర్వహించేలా ఉత్తేజం కలిగించాలి. పక్కవాడి సంగతి దేవుడెరుగు తమ గురించి కూడా తాము పట్టించుకోలేనంత ‘బిజీ’ జీవితాల్లో మునిగిన వారితో ఎలా సాధ్యం!!

సాధ్యమే. ముందు వారికి సమాజ సేవ అంటే ఉన్న అపోహలను తొలగించాలి. సహజంగా ప్రతి ఒక్కరికీ, ఎంత దుర్మార్గులైనా సరే తోటి వారికి (ఆ తోటి వారు దుర్మార్గులే కావచ్చు) సహాయం చేయాలనే ఉంటుంది. ప్రతి మనిషిలోను పరోపకార చింతన ఉంటుంది. విడ్డూరంగా అనిపించినా సరే. అందుకే గదా పగ వారికి కూడా ఈ బాధ వద్దు అనే పద ప్రయోగం ప్రతి ఒక్కరిలోను నానుతోంది.

తమ దగ్గర సమయం లేదని, స్థిరత్వం లేదని, కొంత ఆస్థి వెనకేసాక, బాధ్యతలను తీర్చుకున్నాక అప్పుడు తీరికగా పక్కవాళ్ళ గురించి ఆలోచిస్తామని అనుకుంటూ ఉంటాము. సేవ అన్నా, మార్పు అన్నా ఓ సమస్యను మొత్తం కూకటివేళ్ళతో సహా పెకిలించగలిగితేనే ప్రయోజనం అనుకుంటాము. ఆ పని ఎలాగూ చేయలేము కాబట్టి ఇక ఆలోచించడమే అనవసరం అన్న ధోరణిలో ఉంటాము.

అయితే కొంచెం సమయం కేటాయించగలిగితే, ఎంతమందితో చేతులు కలిపితే అంతటి మార్పుని తేగలమని అనుకోము. ఏదీ సాధ్యం కాదు అన్న భావనని నరనరాన జీర్ణించుకుని ఉంటాము. నిరాశా, నిస్పృహలో ఉన్నవారికి ఓ ఓదార్పు, ఓ పలకరింపు, ఓ చిరునవ్వు కూడా ఎంతో సాంత్వన నిస్తాయని అర్థం చేసుకోలేము. కొద్దో, గొప్పో తపన ఉన్నా, మనమొక్కరమే ఏమి చేస్తాములే అనే నీరసం పని మొదలెట్టకముందే ఆవహించేస్తుంది. ఓ సినిమాకి రమ్మని బలవంతం చేసినంతగా ఓ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో, ఓ చర్చావేదికకో, ఓ సమావేశానికో పిలవడానికి ధైర్యం చేయం. ఏదో సంకోచం. ఎక్కడలేని సందేహం.

ఈ బాలారిష్టాలన్నీ దాటి మన మనసుకి నచ్చినదేదో చేస్తామా, భేతాళ ప్రశ్నలు, భూతద్దపు పరిశీలనలు, ఉచిత సలహాలు, అనుచిత వ్యాఖ్యానాలు. ఈ పనే ఎందుకు చేసావు? ఆ పనెందుకు చేయలేదు? ఫలాన అంశం అయితే ఇంకా ప్రయోజనం ఉంటుంది. వ్యక్తులకు ఉపయోగపడే పనులు కాదు, సమూహాలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఇది ఇలా చేసి ఉండచ్చు కదా. అలా చేసి ఉండచ్చు కదా.. సమస్యకు స్పందించని వారు సహాయానికి మాత్రం విపరీతంగా ప్రతిస్పందిస్తారు.  నాకెందుకొచ్చిన గొడవరా భగవంతుడా అని సహాయం చేసేవారికి అనిపించేంతగా. 

అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అలా చెప్పేవారెవ్వరూ ఉబుసుపోక చెప్పరు. రకరకాల కారణాలు ఉంటాయి. వారి వారి భావజాలాన్ని మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే వారు చెయ్యాలనుకునేవి వివిధ కారణాల వల్ల చేయలేక చేసే వారి ద్వారా చేయించాలని చూస్తారు. ప్రతి ఒక్కరికీ తాము వెళ్ళేదే సరైన మార్గమని, ఇతరులు సమయాన్ని వృధా పరుస్తున్నారని అనిపిస్తుంది. కాబట్టి సహజంగానే మనకు ‘ సరైన ‘ దిశా నిర్దేశం చేయాలనుకుంటారు.

వినేవారికి, చెప్పేవారికి కూడా ఓ సలహా. చెప్పేవారు ఎలా ఉండాలంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి వదిలేయాలి. అంతే కానీ ఫలానాది తప్పు, ఫలానాది ఒప్పు, ఇదే చెయ్యాలి, అదే చెయ్యాలి అని చెప్పకూడదు. ఏమవుతుంది? అసలేమీ చేయకపోవడం కన్నా, ఏదో ఒకటి చేయడం మంచిదే కదా. హృదయపూర్వకమైన, నిబద్ధత కలిగిన ఏ ప్రయత్నం వృధా పోదు, ఫలితమెలా ఉన్నా సరే. ఏదో ఒక జీవిత సత్యం తెలుస్తుంది. అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠం కలకాలం గుర్తుంటుంది.

ఇలా చేస్తే అలా జరుగుతుంది అనే అంచనా నిజమే కావచ్చు. కానీ స్పందన మాత్రం ఎప్పుడూ ఒకేలాగ ఉండదు. ఉదాహరణకు ప్రార్థనాస్థలాల్లో పేలుళ్ళ విషయమే తీసుకుందాము. అది ఏ మతం కి సంబంధించినదైనా బాంబులు పేలుతాయి. నష్టం జరుగుతుంది. కానీ ఫలితం? ఆ దుశ్చర్యలకు పాల్పడ్డవాళ్ళు కోరుకున్నట్టుగా మత ఘర్షణలైతే చెలరేగవు కదా. ఒకరిని ఒకసారి మభ్యపెట్టవచ్చు, ఇద్దరిని రెండు సార్లు, ముగ్గురిని మూడు సార్లు. అంతే కానీ అందరినీ ఎల్లవేళలా మభ్యపరచడం, మత్తులో జోగేలా చేయడం ఎవరూ చేయలేరు. పని, ఫలితం ఒకటే అయినా పర్యవసానాలు, ప్రతిస్పందనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.

అలాగే వినేవారు కూడా ‘ వినదగు నెవ్వరు చెప్పిన ‘ అన్నట్టుగా ఎవరేమి చెప్పినా విని, అలా ఎందుకు చెప్తున్నారా అని ఆలోచించాలి. నిర్ణయం మాత్రం తామే తీసుకోవాలి. మన లక్ష్యాలు, చేసే పనుల పట్ల మనకు స్పష్టమైన అవగాహన ఉంటే చాలు. ఆధ్యాత్మిక వాదమైనా, భౌతిక వాదమైనా, హేతువాదమైనా ఏదైనా ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అనే గా చెప్తుంది. మనమేమిటో మనకు తెలిసినంత కాలం నిరుత్సాహ పడవలసిన అవసరం లేదు.

ఓ చిత్రకారుడు బొమ్మ వేస్తుండగా చూసి అరే పిచ్చి గీతలు గీస్తున్నావు అంటే, అతను కూడా అవునా అనుకుని సందేహంలో పడితే తాను కోరుకున్న రూపాన్ని సృష్టించలేడు. అలా కాకుండా ప్రశాంతంగా తన పని తాను చేసుకు పోతే తన స్వప్నాన్ని నిజం చేసుకోగలుగుతాడు, తనలోని తృష్ణని తీర్చుకోగలుగుతాడు. ఎవరైనా చేయవలసింది అదే. ఒక పని తక్కువ, మరో పని ఎక్కువ కాదు. చేయి, చేయి కలిపితే ఏదీ అసాధ్యము కాదు. ఓ మంచి పని చేయబూనితే మొదటి అడుగు మాత్రమే మనం వేయాల్సింది. మిగతా అడుగులు వాటంతట అవే పడతాయి. మొదటి అడుగు మాత్రమే ఒంటరిదవుతుంది. రెండో అడుగునుంచి మరి కొన్ని పాదాలు జత కలుపుతాయి. అయితే ఏ క్షణమైనా మన అడుగు మాత్రమే మిగిలే ఆస్కారం ఉంది. అప్పుడు కూడా నిశ్చలంగా అడుగులు వేస్తూనే ఉండాలి. అప్పుడే ఆ ప్రస్థానానికో అర్థం చేకూరుతుంది. ఇదంతా పుస్తక పరిజ్ణ్జానం కాదు. ఆచరణ మార్గం నేర్పిన అనుభవ పాఠమే.  

నా విజన్ మరియు డిసెంబరు 9 సమావేశం

“ఎన్నో రోజుల నిరీక్షణం,
ఫలించిందీ క్షణం”

ఈ పంక్తులు నేను ఓ పెళ్ళి కోసం రాసిన కవితలోని మొదటి పాదం లోనివి.

పెళ్ళి గురించి కాకపోయినా అలాంటి అనుభూతే కలుగుతోంది. ఈ నెల 9 వ తారీఖున నేను తలపెట్టిన సమావేశం వ్యక్తిగతంగా నాకు ఎంతో ప్రియమైనది. సెప్టెంబరు 9 న జరిపింది ఓ మొదటి అడుగు అయితే, ఇది అడుగులు వేసే ప్రయత్నం.

ఎందుకు నేను ఓ సమస్యకి అంకితం కాకుండా, అన్నిటిలోను కలుగచేసుకుంటున్నానని ప్రశ్నించేవాళ్ళకి సమాధానం ఇచ్చి ఇచ్చి ఓ రకంగా విసుగొచ్చేసింది. నా విజన్ ని నేను సాధించి చూపెట్టలేనా అని. అప్పుడప్పుడు  మా టిమాడ్ సభ్యులలో కూడా ఎవరైనా ఓ చిన్న ప్రశ్న లేవనెత్తితే చాలు సంకోచం. మళ్ళీ ఉపోద్ఘాతం. మన ఆశయం ఇది కదా, మన లక్ష్యాలు, మన విధానం ఇది కదా అనుకుంటూ. ఇంకేదైనా సహించగలనేమో కానీ, మా గ్రూపు మేము పెట్టుకున్న విలువల నుంచి దూరమైపోతుందా అన్న ఊహే నాకు చాలా బాధను కలుగచేస్తుంది. సవాలక్ష గ్రూపులుండగా, మేము మళ్ళీ ఒక గ్రూపు పెట్టుకున్నామంటే దాని వెనుక ఓ పరమార్థం ఉంది. ఓ ఆశయం ఉంది. పేరుకి, ప్రాముఖ్యతకి అతీతంగా అనుకున్న పనులు చేసుకోవాలనే ఆకాంక్ష ఉంది.

మనసులో ఎన్నో ఆలోచనలు. కానీ ఎందుకో ఒకప్పటిలా వాటిని నేను రాయలేకపోతున్నాను. చాలా తీవ్రంగా ప్రయత్నిస్తే తప్ప మునుపటిలా రాయలేనేమో. ఎంతో కష్టపడి అన్ని గ్రూపుల వెంటపడి సమావేశానికి ఒప్పించాను. ఇప్పటి వరకైతే సంఖ్య 50 కి దగ్గరవుతుంది. నేను అనుకున్న సంఖ్య సాధించినట్టే. 100 మంది వస్తే ఇక మాటల్లో చెప్పలేనంత సఫలత కింద లెక్క. అయితే మరి నేను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలనా. నాకు దొరికింది ఈ ఒక్క రోజు. అందరూ నా విజ్ణ్జప్తిని మన్నించి ఓ రోజంతా ఈ సమావేశం కోసం కేటాయించడానికి ఒప్పుకున్నారు. దీనిని ఎలాగైనా సార్ధకం చేయాలి. నా విజన్ ని అందరికీ అర్థం అయ్యేలాగా చెప్పగలగాలి. ఓ అజెండా తయారు చేసినా కానీ ఏదో అసంతృప్తి. ఎట్టకేలకు ఇవాళ 5 గంటలు కష్టపడి (తెల్లవారుజామున 1 గంట నుంచి 4 వరకు, మరలా ఉదయం ఓ గంట) తయారు చేసా నా విజన్ డాక్యుమెంట్. ఎంతో సంతోషం కలిగింది. చాలా రోజుల తరువాత ఓ తృప్తి.

Vision Document

మీరు అందరూ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను అందించండి. చివరిగా తెలుగుబ్లాగు సభ్యులైన జ్యోతి గారికి, వీవెన్ , కిరణ్ చావా (ఒరెమున అంటే ఇంకా బాగా అర్థమౌతుందేమో), త్రివిక్రం, జాన్ హైడ్ గార్లకు కృతజ్ణ్జతలు. మీ బ్లాగుల ద్వారా, పార్టిసిపేషన్ ద్వారా నాకు సహకరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే నా విజ్ణ్జప్తిని మన్నించి ఈ సమావేశంలో పాల్గొనేందుకు అంగీకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో నాకు సహకరిస్తున్న స్నేహితులందరికీ పేరు, పేరున ధన్యవాదాలు.