రాకేష్ కుమార్ దుబ్బుడు

రాకేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఇంత వరకు కలిసిన వాళ్ళల్లో హీరో అనిపించిన మొదటి వ్యక్తి.

ఈ అబ్బాయిని నేను సెప్టెంబర్ 17, 2007 న కలిసాను, చాలా విచిత్రంగా. ఆ రోజు ఉదయం నాకు ఒక ఈ మెయిల్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి !! ఫిఫ్త్ పిల్లర్ అనే సంస్థ అధ్యక్షులైన విజయ్ ఆనంద్ గారి నుంచి. అంతకు కొద్ది రోజుల ముందే వారి గురించి చదివాను. లంచం ఇవ్వము, పుచ్చుకోము అని ముద్రించిన సున్నా నోటుతో వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించేందుకు ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో విజయాలు సాధించారు. అలాగే సమాచార హక్కు గురించి తమిళనాడులో బాగా ప్రచారం చేసి, ప్రజలు, చిన్నపిల్లలతో సహా, ఉపయోగించుకునేంత ప్రాచుర్యంలోకి తెచ్చారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ రోజు ఉదయం మెయిల్ చేస్తే , ఆ రోజు సాయంత్రమే కలిసాము ఎఫ్. అర్ . ఎఫ్ మరియు సహాయ గ్రూపు సభ్యులతో కలిసి. ఆ సమావేశానికి ఈ అబ్బాయి వచ్చాడు.

సమాచార హక్కు చట్టం గురించి విజయ్ ఆనంద్ గారు చెప్తూ ఉన్నప్పుడు మధ్యమధ్యలో ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితి గురించి ఇతన్ని ప్రశ్నలు అడిగారు. చాలా చక్కగా సమాచారం ఇచ్చాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మాతో పాటు వింటున్నాడు. కానీ అన్నీ తనే చెప్పేస్తున్నాడే అనుకున్నాను. విజయ్ ఆనంద్ గారు మాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళిపోయారు (మేము నిర్వర్తించలేదు 🙂 ).

అప్పుడు మేమందరం ప్రశ్నల వర్షం కురిపించాము. మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అంటూ. ఇతను సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోవడానికి రాలేదు 🙂 విజయ్ ఆనంద్ గారిని కలవడానికి వచ్చాడు 🙂 అప్పుడు తన గురించి వింటూ ఉంటే మొదట కలిగిన భావం ఏమిటంటే సినిమాల్లో చూపించే హీరో పాత్రని ఈ వేళ నిజంగా చూస్తున్నాను అని. నేనే కాదు తన గురించి తెలుసుకుంటే మీరు కూడా అలాగే అనుకుంటారు.

తనంతట తానుగా సమాచార హక్కు చట్టాన్ని గురించి తెలుసుకుని సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్లు ఫైల్ చేసేవాడు. పోనీ అవేమైనా చిన్న విషయాల మీదనా అంటే కాదు. కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ వ్రాయదలుచుకోలేదు, అవి ఏంటి అని. కావాలంటే తన బ్లాగ్ చూడండి. ఇదొక్కటే కాదు. అతను భూమి స్వచ్చంద సంస్థ సహ వ్యవస్థాపకుడు (నేను అప్పటికి కొన్ని రోజుల ముందే భూమి గురించి విన్నాను).  ఇంతా చేస్తే అతని వయసు ఎంత!! నాకన్నా నాలుగేళ్ళు చిన్న.

ఆ రోజు వరకు నాకు అవినీతికి వ్యతిరేకంగా ఓ ఆయుధం ఉంది, మనం కర్ర విరక్కుండా, పాము చావకుండా ప్రయత్నించవచ్చు అనే విషయం తెలీదు. దానికి తోడు రాకేష్ ని గురించి తెలిసాక మాత్రం అనుకున్నాను. నాకు ఎలాగూ ధైర్యం లేదు. ఆలోచనలు లేవు. కానీ ఈ అబ్బాయి ప్రయత్నాలకి ఉడత సాయం లాగానైనా ఉండాలి అనుకున్నాను. ఆ రోజు తను చెప్పింది ఏమిటంటే సమాచార హక్కు చట్టం గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. దీన్ని గురించి ప్రచారం చేయడం ఎంతో అవసరం అని. అప్పటికప్పుడే నిర్ణయించాము దీన్ని గురించి అవగాహనా సమావేశాలు ఏర్పాటు చేయాలని.

వ్యక్తిగా చెప్పాలంటే ఏ మాత్రం గర్వం లేని మనిషి. తన మీద తనకి విశ్వాసం ఎక్కువ. తనకంటూ నిర్దుష్టమైన లక్ష్యం, ఆ లక్ష్యం పట్ల నిబద్ధత, అనుకున్నది అనుకున్నట్టు చేసే క్రమశిక్షణ ఉంది. ఇలాంటి యువకులు ఉంటే మనం దేశం ఎటు పోతుందా అనుకోనక్కరలేదు. ఎందుకంటే అభివృద్ధి మార్గంలోనే నడిపించేందుకు కంకణం కట్టుకుని ఉంటారు కనుక. అతనే ఓ సైనికుడు అని ఈనాడు లో వచ్చిన వ్యాసం ఓ చక్కని నిర్వచనం.

ఈ లంకెలు చూడండి:

http://www.bhumi.in

 http://rakesh-will-do-it.blogspot.com/

ప్రకటనలు

సేవ – బాబా బోధలు – 4

దేవుని బ్యాంకు – మిస్టర్ , మిస్ టెన్ పర్సెంట్ లు

ఈ పదం వాడింది దీవెన వాళ్ళ నాన్న సుబ్బారావు గారు. దీవెన వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఓ సందర్భంలో ఆయన చెప్పారు. చిన్నప్పుడు మేము పోటిలు పడి మరీ తిరుమల కొండ మెట్లెక్కే వాళ్ళము. అబ్బో ఎన్ని సార్లు వెళ్ళామో అని. నేను పెద్దగా చర్చించలేదు.

ఆయన రోజూ తన కూలీలోంచి పది శాతం చర్చికి ఇచ్చేస్తారట. ఆయన కూలీ రోజుకి వంద రూపాయలు. ప్రతి రోజూ చర్చిలో పది రూపాయలు వేస్తారట. చర్చికొచ్చే మిగతావారు, ఈయనకన్నా ఎక్కువ సంపాదించేవారు ఈయనని ఎగతాళి చేస్తూ మాట్లాడేవారట… నీకు బ్యాంకులో ఎన్ని డబ్బులున్నాయేంటి రోజూ ఇన్ని రూపాయలు ఇస్తున్నావు అని. నాకు ఇక్కడి బ్యాంకులలో కాదు ఆ దేవుడి బ్యాంకులో డబ్బు ఉంది, అక్కడే జమ చేస్తున్నాను అని చెప్పేవారట. నేను ఇంటికి కూడా డబ్బు తీసుకెళ్ళను. ముందు చర్చికి వెళ్ళి అక్కడ పది రూపాయలు వేసాకే ఇంటికి వెళ్తాను అని. ఇప్పుడు నాకు ఆ భగవంతుని బ్యాంకు నించే కదమ్మా డబ్బు అందింది. మీరందరూ నాకు తెలీదు. ఇంత ప్రేమగా చూస్కున్నారు. ఇంత సాయం చేసారు. నేను అడిగితే మీరు చేసారా అని. నిజమే కదా. ఆయనెవరో, మేమందరం ఎవరమో. పవన్ పేపర్ లో చూసి ఫార్వార్డ్ చేయడమేమిటి, రవి వెళ్ళి కలవడమేమిటి, కశ్యప్, నేను నిమ్స్ కి వెళ్ళడమేమిటి, వాళ్ళు కన్సెషన్ ఇవ్వడానికి ఒప్పుకోవడమేమిటి…… ప్రతిదీ ఆశ్చర్యమే. డబ్బులు సాయం చేసింది చంద్ర, యశోదలు. కాకపోతే ప్రతి ఒక్కరమూ దీవెన కోసం శ్రమపడ్డాము. ఎందుకు!! ఎవరు చెప్పారు !! ఇంకొక విషయం ఏమిటంటే మాకు అప్పుడు నిమ్స్ లో ఎవరూ పెద్దగా తెలీదు. తర్వాత చాలా మందికి మా లాగే వెళ్ళి ప్రాథేయపడినా కన్సెషన్ దొరకలేదు. దీవెనకి దొరకడానికి కారణం ఏమిటి? ఏవరు !!

గౌతమీ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు రతన్ గారు వాళ్ళ దగ్గర కొత్తగా చేరిన ఒకమ్మాయి గురించి చెప్పారు. తను ఫ్రెషర్ గా జాయిన్ అయిందట. మొదటి నెల జీతం ఇచ్చినప్పుడు ఈ డబ్బులతో నువ్వు ఏమి చేస్తావు అని అడిగారట. ఓ పది శాతం మాత్రం చర్చిలో ఇస్తాను అన్నదట. తను హిందువే. కాకపోతే క్రిష్టియన్ స్కూల్లో చదువుకుందట. అప్పుడు అనుకుందిట. ఉద్యోగం వస్తే ప్రతి నెల పది శాతం చర్చికి ఇవ్వాలి అని. అందుకని ఇస్తుందట.

ఈ సందర్భంలో ప్రసాద్ చెరసాల గారి మాటలు కూడా గుర్తుకు వస్తున్నాయి. ఆయన మా గ్రూపులో చేరిన కొద్ది నెలలకే మాకు ప్రతి నెల వంద డాలర్లు ఇవ్వడం మొదలుబెట్టారు. అందరూ ఇరవై డాలర్లే ఇస్తున్నారు కదా మీరు అంతే ఇవ్వండి, వంద డాలర్లు చాలా పెద్ద మొత్తం కదా అంటే…… పర్లేదు ప్రశాంతి. నిజానికి మనం పది శాతం ఇవ్వాలి. కానీ ఇవ్వము. ఏవో కారణాలు చెప్పుకుంటాము. కాబట్టి ఈ వంద డాలర్లు ఇబ్బందేమీ కాదులే అన్నారు.

సేవ – బాబా బోధలు – 3

కర్మ క్షయం – కృతజ్ణత

ఇంచుమించు అదే సమయంలో నేను ఓ రెండు రోజులు ఉచిత హోమియో వైద్యం క్లాసుకి వెళ్ళాను, శ్రీ యు. వి. ఎన్ . కె. రాజు గారు చెప్పడం వలన. నాకు కుదరదులే అని మానేశాను. ఉచితం కదా. అందుకేనేమో!! నిజానికి నేను మనస్ఫూర్తిగా సమయం కేటాయించగలనని అనిపించలేదు. ఎందుకంటే అందుకు కావాల్సిన శ్రమ, శ్రధ్ధ నేను చూపలేననిపించింది. అంతకు మించి అప్పుడు అది తగిన సమయం కాదు అనిపించింది. ఆ క్లాసులో డాక్టరుగారు (ఆయన వృత్తి రీత్యా బ్యాంకు మేనేజరు. ప్రవృత్తి రీత్యా వైద్యులు. ఎన్నో ఏళ్ళ అనుభవం ) ఓ విషయం చెప్పారు. ఆయనకు జాతకాల గురించి కూడా బాగా అవగాహన ఉంది. మానవ ప్రయత్నంతో మన కర్మ నివారించబడుతుందా అనేదానికి ఉదాహరణ చెప్పారు.

ఈ జీవి ఆసుపత్రి పాలు కావాలి అని వ్రాసి ఉంటే, వేరే వారికి సేవ చేయడం కోసమో, బంధువులని, స్నేహితులని పరామర్శించడం కోసమో ఆసుపత్రికి వెళితే కొంత కర్మ ఖర్చైనట్టేనట. ఇదేదో బాగుంది అనిపించింది. హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే నాకు మొదటి నుంచి ఆసుపత్రి అన్నా, డాక్టర్లన్నా చాలా భయం. విభూతి, మా అమ్మ అప్పుడప్పుడు ఇచ్చే హోమియో మందులే తప్ప ఇంక ఏవీ అలవాటు ఉండేది కాదు.

ఇప్పుడేదో డాఖ్టర్లతో బాగా పరిచయం అయ్యింది, కేసుల పరంగా ఆసుపత్రికి వెళ్తున్నా కానీ నాకు భయమే. ఆసుపత్రికి వెళ్ళి వచ్చిన ప్రతి సారి బాబా మీద ఎనలేని గౌరవం పెరుగుతుంది. నిజమైన కృతజ్ణత కలుగుతుంది. ఆసుపత్రిలో చేరాల్సినటువంటి తీవ్రమైన రోగాలు ఇవ్వనందుకు, అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నందుకు.

ప్రతి రోజు వివిధ సందర్భాల్లో మనం దేవుడికి కృతజ్ఞత చెప్పాలని వచ్చే మెయిల్ ఫార్వార్డ్ గుర్తుకు వస్తుంది. మనస్ఫూర్తిగా థాంక్ యూ బాబా అని చెప్తాను అప్పుడు మాత్రం.

సేవ – బాబా బోధలు – 2

సహనం లేదా నమ్మకం – ఫెయిత్ అండ్ పేషన్స్

బాబా ఎప్పుడూ ఈ రెండింటి గురించే చెప్తూ ఉంటారు. కానీ ఆ నమ్మకం, ఓర్పు మనకున్నాయా !!

సాయం కోసం మన దృష్టికి వచ్చిన వాళ్ళకి మనం సాయం చేస్తాము అని చెప్పాము అనుకోండి వాళ్ళు మరలా మరలా మనల్ని ఆ విషయం గురించి అడుగుతుంటే ఎలా ఉంటుంది. అది కూడా మనం ఇచ్చిన మాట ప్రకారం ప్రయత్నిస్తూ ఉంటే !!  సమాధానం చివరలో చెప్తాను.

దీవెన కి గుండె ఆపరేషను కోసం నిమ్స్ లో చేర్చడం, అది కాస్తా పొడిగించబడుతూ, పొడిగించబడుతూ 45 రోజులు అవడంతో మాకు కనీసం ఓ 40 రోజుల పాటు నిమ్స్ కి వెళ్ళడం దినచర్యలో భాగమైపోయింది. అప్పుడే తోటి పేషంట్లు కూడా పరిచయం అయ్యేవారు. అలాగ పరిచయమైన వారే వృధ్ధ దంపతులైన పాపారావు, రాధ గార్లు. ఎన్ని వాదోపవాదాలున్నా, నచ్చినా, నచ్చకపోయినా వ్యక్తిగతంగా పాపారావు దంపతులకు చేయగలిగిన సాయాన్నే నేను గొప్పది అనుకుంటాను. మేము ఎన్ని పాఠాలైనా నేర్చుకుని ఉండచ్చు గాక, ఇది మాత్రం మా టిమాడ్ కి సంబంధించినంత వరకు విలువైన సాయం అని నేను అనుకుంటూ ఉంటాను. ప్రతి కేసు గురించి వివరంగా వ్రాస్తాను.

ఈ టపా సంగతిని బట్టీ, వీరిద్దరికీ మేము వారు ఊహించిన దాని కన్నా ఎక్కువ సాయం చేసాము. ఆసుపత్రి అవసరాలకే కాకుండా, ఆ తరువాత కూడా చేసాము. అయితే వాళ్ళు మధ్య, మధ్యలో ఫోన్ చేసి సాయానికి సంబంధించి అడుగుతూ ఉంటే అప్పుడప్పుడు కోపం వచ్చేది. మనం సాయం చేస్తాము అని తెలుసు. ఎలాగూ ఒకసారి చేసాము. మాట ఇస్తే చేస్తాము కదా. ఎందుకు అన్ని సార్లు అడుగుతారు అని.

బాబా పటం వైపు చూస్తే ఎందుకో నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. నేను అంతే కదా. బాబా నాకు ఎంతో చేసారు. అయినా సరే ప్రతి సారి నేను ఎంత విసిగిస్తూ ఉంటాను. ప్రతి దానికి ఋజువు చూపించమని అడుగుతూ ఉంటాను.  మరి నేను అడగడం ఎంత సహజమో, వాళ్ళు అడగడం కూడా అంతే సహజం కదా !!

సేవ – బాబా బోధలు

గమనిక/మనవి: భగవంతుడిని నమ్మని వారికి ఈ మాటలు కొంచెం విచిత్రంగా తోచవచ్చు. చదవాల్సిన అవసరం లేదు.

విషయానికి వస్తే నేను షిర్డీ బాబా భక్తురాలిని అని చెప్పే అర్హత లేకపోయినా ఆయనను నమ్మేదాన్ని అని చెప్పుకోగలను. నాకు ఆయనతో మంచి స్నేహం ఉండేది. నమ్మండి, నమ్మకపోండి. అలాగని ఆయన నాకు సశరీరంగా కనిపించలేదు.  వినిపించలేదు. కాకపోతే సమాధానాలు వస్తాయి అంతే. సినిమాకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆయన ఒప్పుకుంటేనే వెళ్ళేదాన్ని, లేదంటే ఉండిపోయేదాన్ని, ఇష్టమున్నా లేకపోయినా. కొన్ని సార్లు ఎలాగోలాగా ఒప్పించుకునేదాన్ని.

ఎలాగా అంటే… శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టరు గారు వ్రాసిన శ్రీ సాయి లీలామృతం పుస్తకం ద్వారా. మనసులో ఓ ప్రశ్న అనుకొని తెరిస్తే వచ్చే ఆ రెండు పేజీలలో మనకు తప్పక సమాధానం దొరుకుతుంది. బడికి వెళ్ళద్దా, వద్దా అని అడిగిన ప్రశ్నతో ఆయనకు, నాకు స్నేహం మొదలైంది. అంతకు ముందు వరకు తెలిసిన వ్యక్తి. మా ఇంట్లో అందరూ బాబా భక్తులు కావడంతో మిగతా దేవుళ్ళ పూజలు చేసినా నాకు బాబానే దైవం. అదృష్టవశాత్తు బాబా సెక్యులర్ దైవం 🙂

కాకపోతే సేవకు సంబంధించిన బ్లాగులో బాబా గురించి ఎందుకు వ్రాయాల్సి వచ్చిందంటే ఓ బలమైన కారణం ఉంది. నిజాంపేటలో గుడిసెలు తగలబడినప్పుడు (ఈ సంవత్సరం జూలై లో) ప్రసాద్ చెరసాల గారి స్నేహితులు సతీష్ గారు సహాయం చేద్దాం అన్నారు. సరే అని వారి కోసం మనీ కలెక్ట్ చేసాము. మా ఇన్నోమైండ్స్ ఆఫీసు వారు బాగా సాయం చేసారు, కొంతమంది కొలీగ్స్ వారి స్నేహితుల ద్వారా కూడా ఇచ్చారు. అలాగే ఇంకా కొన్ని కంపెనీల వారు వెళ్ళి సాయం చేసారు (వర్చూసా, డెలాఇట్ ).

మేము బియ్యము కొని ఇద్దామని వెళ్ళాము. అప్పుడు వాళ్ళు మా డబ్బులు పోయాయి, నగలు పోయాయి ఇలా చెప్తూ ఉన్నారు. బియ్యం పట్ల పెద్ద ఆసక్తి చూపలేదు. (అయితే మేము బియ్యము, దుస్తులు పంచినప్పుడు వాటి కోసం గుమికూడారు, అది వేరే విషయం). మేము నిజానికి వీలైనంత సాయం చేయాలని వెళ్ళాము. వాళ్ళ అవసరాలేమిటో కనుక్కుని వీలున్నప్పుడు చేద్దాము అనుకున్నాము కానీ మేము చేయగలిగిన సాయం పెద్దగా కనిపించలేదు. ఒక్క శివాని అనే పిల్ల ముందుకొచ్చి నాకు చదువుకోవాలని ఉంది. చదువుకుంటాను అని అడిగింది. కొంచెం ఆలస్యమైనా తనకి తను కోరుకున్నట్టుగా చేర్పించబోతున్నాము.

అప్పుడు అనుకున్నాను వీళ్ళు డబ్బుల మీద ఆశ చూపకుండా ఉంటే, కావాల్సిన సహాయం, జీవితంలో నిలదొక్కుకోవడానికి, ముందుకెళ్ళడానికి సాయం చేసి ఉండే వాళ్ళం కదా అని. మనం చేయగలిగింది, ఇవ్వగలిగింది వీళ్ళు అడగడం లేదు. అందుకే ఏమి ఇవ్వాలని వచ్చామో అది ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఇక ఇవ్వము కదా అని.

అప్పుడు తట్టింది నాకు. భగవంతునితో మన ప్రవర్తన కూడా ఇంతే ఉంటుంది కదా అని. ఆయన మనకు ఎంతో సాయం చేయాలని చూస్తారు. మనమేమో ఎప్పుడూ లౌకిక విషయాలే అడుగుతుంటాము. ముఖ్యంగా నేను. నాకు ముక్తీ, గిక్తీ పట్ల అస్సలు ఆసక్తి లేదు. మళ్ళీ మళ్ళీ పుట్టాలి అనుకుంటూ ఉంటాను. బాబా చరిత్రలో ఓ సందర్భంలో…. ‘ఏమి చేస్తాము. ఎవరు కోరింది వారు పొందుతారు ‘  అంటారు. లౌకికమైన కోరికలు తీర్చరు అని కాదు కానీ అంతకు మించి ఎదగాలి అని కోరుకుంటారు. విద్యార్ధులు ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలని, తమ స్థాయి కన్నా ఎదగాలని కోరుకునే ఉపాధ్యాయుల లాగా. కానీ మనం నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోతే ఎలా ఉంటుంది !!

గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం – 2

ఇవాళ నాకు గౌతమీ ఆశ్రమ వివరాల బ్రోచర్ అందింది. ఆ ఆశ్రమ చరిత్ర చదువుతూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి అంటారే అలాంటి అనుభూతి. నాకైతే హృదయం ఉప్పొంగడం లాంటి భావన. ఎప్పుడూ కూడా మనం సినిమాల్లోని భాషని డైలాగులంటాము. కానీ ప్రతి అక్షరం ఎంత సత్యమో నాకు కొన్ని ఏళ్ళగా అనుభవం లోకి వస్తోంది. రచయితలు వాడే భాష నిజంగా అనుభవైకవైద్యమేనేమో.

ఆశ్రమాన్ని చూసినప్పటికంటే చదువుతున్నప్పుడు ఇంకా ఎంతో ఆనందం కలుగుతోంది. ఈ ఆశ్రమాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. స్వాతంత్ర్య సమరయోధుల కలలకి ఈ ఆశ్రమం నిలువెత్తు సాక్షి. ఆ బ్రోచర్ లో ఒక చోట ఇలా వ్రాసారు: ఈ ఆశ్రమ శంఖుస్థాపనకి పెట్టిన ముహూర్తబలమో, లేదా స్థలం ఇచ్చిన వారు, సేవ చేయాలనుకునే వారి సంకల్ప బలమో ప్రతిదీ చాలా అద్భుతంగా సమకూరింది అని. ఎందరో త్యాగధనుల సంకల్పబలాన్ని మనం నిరూపించాలి.

మన జాతీయ పతకాన్ని, మన జెండాని తగలబెడ్తాము, ఎవరడ్డొస్తారో చూస్తాము అని పోలీసు ఇన్స్పెక్టర్ ముస్తఫా అలీ ఖాన్ సవాలు చేస్తే 70 సంవత్సరాలు పై బడిన గుత్తి సుబ్బరాజు గారు ముందుకు వచ్చి ‘నన్ను పడగొట్టందే ఈ జెండాను నీవు పీకలేవు ‘ అంటూ ముందుకు వచ్చినప్పుడు పోలీసులు బిత్తరపోయి ఆయనను అరెస్టు చేయడం తప్ప ఏమీ చేయలేకపోయారట. ఎంత స్ఫూర్తినందించే విషయం.

అప్పట్లో ప్రజలు ఎన్నెన్ని త్యాగాలు చేసారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత. ఉత్తేజంతో పాటు నిస్పృహ కలుగుతోంది. మన భూభాగం మీద పరాయి వారి హక్కు, అధికారం ఉండద్దు, మన భూమిని మనమే పరిపాలించుకోవాలి అనే ఆశయంతో పోరాడి అమూల్యమైన స్వాతంత్ర్యాన్ని మన ముందు తరం మనకందిస్తే, ఇప్పుడు అదే భూమిని సెజ్ ల పేరుతో మళ్ళా దారాధత్తం చేస్తున్నాము. యె డీం డ్ ఫారిన్ టెరిటరీ……. ఎవరైనా నిర్వచించగలరా….. !!! చదువుకున్న వాళ్ళు కూడా ఈ సో కాల్ డ్ అభివృధ్ధి (నిజంగా జరిగేది, ఒరిగేది దేవుడెరుగు) అనే మాయలో పడి ఇవి మనకు ఎంతో ఉపయోగం అంటూ మాట్లాడితే ఎంతో బాధ కలుగుతుంది.

ఇవాళ ఆంధ్రజ్యోతిలో సంగం లక్ష్మీబాయమ్మ అనే సమరయోధురాలి గురించి వ్రాసారు. ఆ ఒక్క కాలం (నిజంగానే ఓ చిన్న కాలం ) చదివితేనే ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ప్రతి చిన్న విషయాన్ని వారు ఎలా పట్టించుకునేవారో, ప్రతి చిన్న అంశంలో కూడా దేశభక్తిని చూపేవారో చదువుతుంటే ఆశ్చర్యం కలిగింది. వాళ్ళెక్కడ !! మనమెక్కడ !!

ఇక విషయానికి వస్తే…. మురళీ వాళ్ళ కంపెనీలో మాట్లాడాడు. వారు సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. సోమవారం వివరాలు అన్నీ పంపిస్తే కనీసం ఓ ఐదు కంప్యూటర్లైనా ఇవ్వచ్చు. మా టిమాడ్ గ్రూపు తరపున 30 రగ్గులు ఇద్దాము అని ఆలోచన. ఇవాళ బ్రోచర్ అందింది అని చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు మిగతా అవసరాల గురించి అడిగాను. ఒక లేజర్ ప్రింటర్ (వాడినదైనా పర్లేదు), పిల్లలు కూచునేందుకు ఓ పది బల్లలు అడిగారు.

త్రినందా ఫౌండేషన్ సతీష్ గారిది పిఠాపురమట. దీపావళి పండగ సందర్భంగా ఆయన వారి ఊరిలోనే ఉన్నారు. సీతానగరం ఆ ఊరికి చాలా దగ్గర. కాబట్టి ఆయన ఈ ఆశ్రమానికి వెళ్ళి వస్తారు. ఫోటోలు తీస్తారు. ఎంత లేదన్నా గురువారానికల్లా మనం ఫోటోలు చూడచ్చు.

ఈ టపా చదివిన వారందరూ రాజమండ్రికి చెందిన లేదా రాజమండ్రి చూడడానికి వెళ్ళాలనుకుంటున్న స్నేహితులతో ఈ ఆశ్రమాన్ని గురించి చెప్పండి. ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లలుండే తల్లితండ్రులు వారిని తీసుకెళ్ళాల్సిన ప్రదేశం. పిల్లల్లో స్వాతంత్ర్యం పట్ల గౌరవాన్ని కలిగించినవారవుతారు. ఓ మంచి స్ఫూర్తినిచ్చిన వారౌతారు.

This is Ashram’s address: Kasturba Gandhi National Memorial Trust, Andhra Branch, Seethanagaram – 533 287 Via Rajahmundry, East Godavari Dt., Andhrapradesh, India.

Ph: 0883-2458802, 2458415.

వార్ధా జ్ఞాపకాలు – అనుభూతులు

 Please go through the following URLs:

 

http://simplethots.com/index.php?option=com_content&view=article&id=276:i-met-gandhi-at-wardha-he-is-a-social-worker&catid=25:the-project&Itemid=54

 

http://picasaweb.google.com/tapana2008/WardhaTripAugust2008#

You can see the mail thread in the following URL for the thoughts of some of the members who visited Wardha:

http://groups.google.co.in/group/birdsofsamefeathers/browse_thread/thread/f9806c9ae15eb2e9/510263a2caded143?lnk=gst&q=Wardha+trip#510263a2caded143