కిటికీ ప్రయాణం

ఎస్ . ఆర్ నగర్ మోడల్ ట్రావెల్స్ ఆఫీసు మహా రద్దీగా ఉంది. సమయం రాత్రి 8 గంటలు.

హడావిడిగా పరుగులాంటి నడకతో కౌంటర్ దగ్గరకు వెళ్ళింది స్నిగ్ధ.

‘నెల్లూరికి టికెట్ ఉందా? ‘ అడిగింది.

‘ఉంది ‘ చెప్పాడు.

‘విండో సీటు ఇవ్వండి ‘ డబ్బులిస్తూ చెప్పింది.

ఇచ్చాడు.

‘హమ్మయ్య. కిటికీ సీటు దొరికింది ‘ అనుకుంటూ లగేజి తీసుకొని బస్సు కోసం ఎదురుచూస్తూ నిల్చుంది.

ఎస్ ఆర్ నగర్ నుంచి అమీర్ పేట హుడా కాంప్లెక్స్ వరకు ఎంతో మంది తన లాగే బస్సు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆనందం. అందరి మొహాల్లోనూ ఆనందం. శెలవలు దొరికి ఇంటికి వెళ్తున్నామనే ఆనందం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది.

అసలు ఎక్కడి నుంచైనా సొంత ఊరికి ప్రయాణమై వెళ్తుంటే ఎంత సంతోషం! ఎప్పుడైనా, ఎవరైనా అలా వెళ్తున్నప్పుడు చూడాలి వారి వారి మొహాల్లో ఏదో వింత తేజస్సు కనబడుతుంది. అందరి మొహాలు ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయి.

వాచ్ చూసుకుంది. పది నిముషాలు అయ్యింది. ఇంకా బస్సు రాలేదు. మళ్ళీ చుట్టూ చూసింది. అందరూ బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరిలోనూ అసహనం లేదు. ఆత్రం మాత్రమే ఉంది. విచిత్రం తనకు కూడా తొందర అనిపించలేదు. సహజంగా తనకు దేనికోసమైనా ఎదురుచూడాలంటే మహా చిరాకు. అందునా బస్సు కోసమైతే మరీను.

‘ఎదురుచూపు ‘ గురించి అందరూ మహా గొప్పగా చెప్తారు కానీ ఇలా బస్సు కోసం, ట్రైన్ కోసం ఎదురుచూడడం లో ఏం ఆనందం ఉంది అనుకునేది తను. ఒక ఊరిలోనే ఒక చోటి నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలంటే ఇలా వెయిట్ చేయాల్సి రావడం చికాకే కదా. బహుశా మనం వెళ్ళాల్సిన దూరంతో పోలిస్తే వెయిట్ చేయాల్సిన సమయం ఎక్కువగా ఉంటే విసుగు జనిస్తుందేమో.

బస్సు రానే వచ్చింది. ప్రైవేటు ట్రావెల్సే కాబట్టి అందరూ తాపీగానే ఎక్కుతున్నారు హడావిడి పడకుండా. స్నిగ్ధ కూడా నిదానంగా ఎక్కి తన ప్రియమైన ‘కిటికీ’ సీటు దగ్గరకు వెళ్ళి కూర్చుంది. ఒకరి తరువాత ఒకరు ఎక్కుతున్నారు. బస్సు కదలటం లేదు. బహుశా అందరూ వచ్చి ఉండరు.

కిటికీ లోంచి తల బయటకు పెట్టి చూడసాగింది. ప్రయాణం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆగకుండా సాఫీగా సాగిపోతే ఆహ్లాదంగా ఉంటుంది. అయితే వెళ్ళే వాహనాన్ని బట్టి మన అనుభూతులు, ఆలోచనలు మారుతుంటాయి. బస్సులో ఒకలాగా, రైలులో ఒకలాగా మనం ప్రపంచాన్ని చూడగలం.

రైలులో ప్రయాణిస్తూ ఉంటే మనం చాలా ఎక్కువ మందిని గమనించగలం. అదే బస్సులో అయితే ఒకరిద్దరిని మాత్రమే మనం చూడగలం. రైలులో ప్రయాణం ఇష్టమైన వారికి బస్సులో ప్రయాణం చేయాలంటే కొంచెం ఇబ్బందే. రైలు విశాలంగా ఉంటుంది. పడుకోడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చదువుకోవచ్చు. రైలు ఎంత స్పీడుగా వెళుతున్నా చదువుకోగలం. కంటికి ఇబ్బంది అనిపించదు, చదువుకోవడానికి అసౌకర్యంగానూ ఉండదు.

అదే బస్సైతే అస్సలు చదువుకోలేం. బస్సు ఎంత మెల్లిగా నడుస్తున్నా కూడా చదువుకోవడానికి అనువుగా అనిపించదు. పడుకోవడానికి అసలే కుదరదు. పోనీ చుట్టుపక్కల జనాన్ని గమనిద్దామా అంటే అదీ వీలు కాదు. కిటికీ పక్క సీటు దొరికితే కొంతలో కొంత నయం. కిటికీ తెరిచి తల చక్కగా ఆన్చి బయటకు చూడచ్చు. లోపలి ప్రపంచాన్ని మరవచ్చు.

మెల్లగా బస్సు కదిలింది. తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది స్నిగ్ధకి. చిన్నపిల్లలు ప్రయాణం మీద వ్యాసం వ్రాసినట్టు ఉన్న తన భావాలకి.

స్నిగ్ధకు బస్సు ప్రయాణం ఇష్టం లేదు. ప్రయాణం అంటే రైలు అయితేనే ఇష్టం. ఒంగోలు పాసెంజరు అంటే మరీ ఇష్టం. ఎం. ఎస్ . సి. తిరుపతిలో చేరిన తర్వాత కొంచెం తరచుగా నెల్లూరు, తిరుపతి మధ్య ప్రయాణం చేసింది. తన ఊరికి తనను అత్యంత చౌకగా, తొందరగా చేర్చే ఒంగోలు పాసెంజరు అంటే చాలా చాలా ఇష్టం. ఎన్నెన్ని అనుభవాలు. అనుభూతులు. ఒక్కొక్క ప్రయాణాన్ని విపులంగా వ్రాయగలిగితే ఒక్కో చిన్న కథ అవుతుందేమో.

అసలు తనకే కాదు……..ఒంగోలు పాసెంజరు ప్రయాణించే బెల్టులో ఉండే వారందరికీ ఆ పాసెంజరు అంటే చాలా ఇష్టం అని నిస్సందేహంగా చెప్పచ్చు. మూడు యూనివర్సిటీలు( ఎస్. వి., మహిళా, అగ్రికల్చరల్ ), మెడికల్ కాలేజి, రంగంపేట ఇంజినీరింగ్ కాలేజి, ఇది కాక తిరుమల, చంద్రగిరి, చుట్టుపక్కల చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు అన్నీ కలిసి తిరుపతికి మంచి డిమాండ్. సగం మంది విద్యార్థులు, సగం మంది భక్తులు, యాత్రికులు, సగం మంది సీజన్ మీద ప్రయాణించే ఉద్యోగులు, మరి కొంత సగం కూలీలు. వీరందరికీ అందుబాటులో ఉండే టికెట్ ధర.

ఇప్పటికీ ఏ పని మీదయినా స్టేషనుకి వెళితే ఒంగోలు పాసెంజరుని చూస్తే అదో ఆత్మీయమైన అనుభూతి. నాది అనే భావన.

‘కిటికీ సీటు నాకు ‘,
‘కాదు నాకు ‘,
‘అబ్బ! అల్లరి చేయకుండా ఇద్దరూ సర్దుకుని కూర్చోండర్రా! ‘

ఓ తల్లి ‘కిటికీ సీటు ‘ కోసం తగువులాడుకుంటున్న తన పిల్లల్ని మందలిస్తోంది.

నవ్వొచ్చింది స్నిగ్ధకి. ఇంత పెద్దది అయినా తనకు కూడా తగ్గని ‘కిటికీ’ మోజు గురించి. ఇంతకీ ఈ కిటికీ కుండే గొప్పతనం ఏమిటి? చక్కగా చల్లగాలి తగులుతుంది. బయటి ప్రపంచం వేగంగా కదిలిపోతూనే ఉంటుంది. ఏమీ ఆలోచించకపోయినా, నిశ్శబ్దంగా, నిర్వికల్పంగా బయటి ప్రపంచాన్ని చూస్తూ ఒకలాంటి ‘శున్యత ‘ ను అనుభవించచ్చు. లేదా దేని గురించైనా ఆలోచించదలచుకుంటే మన ఆలోచనలు ఏ ఆటంకం లేకుండా అలా అలా…………… విశాల విశ్వంలోకి ఎగిరి వెళ్ళిపోతాయి.

నాకు సరే కానీ అందరికీ కిటికీ అంటే ఎందుకంత ఇష్టం? విచిత్రంగా మనకి ఒకచోట
ఉన్నప్పుడు కలిగే భావాలు మరో చోట వేరుగా ఉంటాయి. ఆఖరికి పడుకునేటప్పుడు కూడా ఒక వైపు పడుకుంటే కలిగే అనుభూతులు, మరో వైపు ఒత్తిగిల్లితే ఉండవు. ఓ కథో, కవితో వ్రాయాలనుకున్నప్పుడు డాబా మీదికెళ్ళి కూర్చుంటే, ఎవరైనా పైకొస్తే వాళ్ళు మననేమీ డిస్ట్రబ్ చేయకపోయినా ఏమీ వ్రాయలేము. అందుకే రైటర్స్ అందరికీ ఒక్కోలా వాతావరణం ఉంటేనే వ్రాయడం ఇష్టం.

కాబట్టే కిటికీ పక్క సీటుకి అంత డిమాండ్. చిన్న, పెద్దా తేడా లేకుండా అంత ఇష్టం. నవ్వుకుంది స్నిగ్ధ. మనుష్యులు పెద్దవారయ్యారనుకున్నా, చిన్నపిల్లలతో పోటీపడేలా ఇలాంటి సరదాలు మిగిలే ఉంటాయి. ఉదాహరణకి ఉయ్యాలూగడం, క్రికెట్ ఆట అయితే బ్యాటింగే చేయాలనడం, నీళ్ళలో ఆడడం. ఎక్కడైనా బీచ్ కి వెళితే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుంది! అందరూ చేరి, అల తీరాన్ని తాకి తిరిగి వెళ్ళేటప్పుడు ‘ఓ’ అని అరవడం. అదో సరదా!

చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆనందంగా బయటకి చూడసాగింది స్నిగ్ధ. పిల్లగాలులు అని వీటినే అంటారా? అలా సుతిమెత్తగా మేనును తాకుతుంటే సుతారంగా హృదయవీణను మీటినట్టుంటుంది. అంత మందిలో ప్రయాణిస్తున్నా, మనతో మనకు సాంగత్యం దొరికే క్షణాలు.

‘ఒక్కటే వెళ్తానంటావు బోర్ కొట్టదా? ఒక్కరోజు ఆగితే అందరం కలిసి వెళ్ళచ్చు కదా!’

‘బోర్ సంగతి దేముడెరుగు. నాకు భయమే బాబు! కనీసం ఒక్కరైనా పక్కన లేకపోతే బయలుదేరాలనే అనిపించదు ‘.

స్నేహితురాళ్ళ మాటలు గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంది. తనకెప్పుడూ ఒంటరిగా ప్రయాణించాలంటే భయము, బోర్ లాంటివి అనిపించవు. ఎవరికి వారే స్నేహితులైన వేళ అలా అనిపించదు. తమకంటూ ఓ చిన్ని మానసిక ప్రపంచం ఉండేవారు ఒంటరితనాన్ని అనుభవించే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి.

అసలు నిజం చెప్పాలంటే తనకు ఎవరైనా తోడు ఉంటే అసలు నచ్చదు. అలాగని ఎవరితో మాట్లడని రిజర్వ్ డ్ నెస్ కాదు. పరిచయస్థులని పలకరిస్తుంది. తెలిసినవారితో కబుర్లాడుతుంది. కానీ ఊరికే ఉబుసుపోని కబుర్లు ఎన్నని చెప్పగలను అనేది తన అభిప్రాయం.

సహజంగా ప్రయాణాల్లో కాలక్షేపం కోసం కాకుండా మన మనసు విప్పి మాట్లాడగలిగితే అలాంటి వారితో ప్రయాణం ఆనందంగా అనిపిస్తుంది. లేకపోతే ఒంటరిగా వెళ్ళడమే మహదానందం అనిపిస్తుంటుంది తనకు.

కాకపోతే మనకు బాగా అలవాటైన మన స్నేహితులైతే చిన్నప్పటి విషయాలు నెమరువేసుకోవడం, లేకపోతే మిగతా స్నేహితుల గురించి ముచ్చటించుకోవడం, హాబీల గురించి చర్చించడం, ఆవకాయ నుంచి అమెరికా దాకా మాట్లాడుకోవడం…….. నిజంగా సమయం తెలీకుండా గడిచిపోతుంది.

ఆ మధ్య సుమన్ తో కలిసి నెల్లూరికి వెళ్ళడం గుర్తొచ్చింది స్నిగ్ధకి. సుమన్ తన చిన్నప్పటి ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకడు. పాటలు పాడుకున్నారు. ఈ సాంగ్ బావుంటుంది కదా. ఇది విన్నావా. ఈలా మాట్లాడుకుంటూ చాలా సేపు పాడుకున్నారు. ఇంటర్వ్యూల గురించి, పజిల్స్ గురించి మాట్లాడుకున్నారు. తను క్రిష్టియన్. కాబట్టి చర్చిల గురించి, ప్రేయర్ గురించి ఇలా ఏదేదో చెప్పాడు. తర్వాత తమ గాంగ్ లోని మిగతా ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నారు. జోక్స్ వేసుకున్నారు. అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు.

కిటికీ కి తల ఆన్చి బయటకి చూస్తూ, పూర్తిగా లోపలి ప్రపంచాన్నే మర్చిపోయిన స్నిగ్ధ శబ్దం అవడంతో పక్కకి తిరిగి చూసింది. పక్క వరసలో ఎవరో స్టీలు డబ్బా పడేశారు. తన పక్కన కూర్చుంది ఎవరా అని చూసింది. ఎవరో పెద్దావిడ నిద్రపోతోంది.

ఆండాళ్ళు గుర్తొచ్చి ఏడుపొచ్చింది స్నిగ్ధకు. అప్రయత్నంగా కళ్ళలోంచి నీళ్ళు జలజలా రాలాయి. అమ్మమ్మ. ఆండాళ్ళు అంటే అమ్మమ్మ. అమ్మమ్మ, తను కలిసి ఎన్నిసార్లు ప్రయాణం చేసారో! అమ్మమ్మ అనుకోగానే ఓ నులివెచ్చని అనుభూతి. ఆ మెత్తటి శరీరాన్ని హత్తుకుని, గట్టిగా పట్టుకుని ఉంచేయాలి అని తపన. ఎవరూ తన నుంచి తీసుకెళ్ళకుండా ఒడిసిపట్టుకోవాలనే ఊహ. కానీ ఏది? ఎక్కడుంది? నవంబర్ 4 న కార్తీక మాసంలో చిలుకుల ఏకాశి రోజున అమృత ఘడియల్లో కన్నుమూసింది. లేదు. తను లేదు. తను కాదు నా పక్కన. తనను గుర్తుకు తెచ్చే ఓ పెద్దావిడ.

జీవితం ఎవరికీ అంతుబట్టదు. మృత్యువు అసలే అర్థమవదు. మనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా తనువు చాలిస్తామో తెలుసుకోగలమా!! ఈ జీవిత ప్రయాణానికి ఎలా వీడ్కోలు చెప్తామో ఎవరికీ తెలియదు.

ఓ నిట్టూర్పు విడిచి మళ్ళీ కిటికీ లోంచి బయటకు చూసింది. అందరి మామ చందమామ అందంగా కాంతులీనుతున్నాడు. నిజంగానే ప్రకృతి ఎంత సౌందర్యమైనది. అందం అని మనం మనుషుల్లో వెతుక్కుంటాం కానీ ప్రకృతి లోని అణువణువు ప్రత్యేకమైన అందంతో భాసిల్లదు!?! బురదగుంటలో కూడా అందమే. ఎండిన వృక్షం అయినా, బీడు వారిన భూమి అయినా, ఇంకిపోయిన చెరువులైనా కూడా తనకు అందంగానే కనిపిస్తాయి. పొలం పనులు చేసేవాళ్ళు, జాలర్లు వీళ్ళు ఇంకా అందంగా కనిపిస్తారు. సహజత్వాన్ని మించిన అందం ఉంటుందా?

బస్సు ఆగింది. కొంత మంది దిగారు. కొంత మంది ఎక్కారు. మన జీవితాన్ని ప్రయాణంతో పోలుస్తారు కదూ. నిజమే. ఆలోచిస్తూ ఉంటే ఎన్నో పోలికలు కనిపిస్తున్నాయి.

మన ప్రయాణం పొడుగూతా దారిలో పచ్చని పొలాలతో పాటు బీడు వారిన భూములు దర్శనమిస్తాయి. నీటి చలమలతో పాటే ఎండిపోయిన బావులు, చెరువులు పలకరిస్తుంటాయి. సిటీ సోకులు, పట్నం పరువాలు, పల్లెటూరి పడుచులు, అన్ని రకాల మనుషులూ కనిపిస్తారు. అయితే ఎక్కడా మనం ఆగం, మన గమ్యం వస్తే తప్ప.

మన కష్ట, సుఖాలూ అంతే కదా. ఏవీ శాశ్వతంగా ఉండవు. అలాగే మనం వాటిని చూసే దృష్టిని బట్టి కూడా ఉంటుంది. ఎండిపోయాయి అనుకుంటే నిరాశే.

అలా కాక ఈ కరువూ, కాటకం రావడానికి కారణాలేమిటి, మనం ఎలా నివారించగలం. అనివార్యమైన వాటి నుంచి ఎంత తొందరగా కోలుకోగలం, ఎలా చేయూత నివ్వగలం ఆలోచిస్తే, బాధే ఉండదు. భయమూ కలుగదు. మనం ఎన్నుకునే దారిని బట్టి కూడా ఉంటుంది.

బస్సులోపలే ఉంటే మంచి ఆలోచనలు రావు. మన భావాల్ని చుట్టుపక్కల ఉండే సీట్లు, బస్సు పై భాగం, ఎటు చూసినా అడ్డుకుంటున్నట్టు అనిపిస్తాయి. ఆ పరిధి దాటి ఇక ముందుకు పోలేవు. అదే కిటికీ పక్కన కూర్చుంటే, బయటి ప్రపంచంలోకి, గగనతలంలోకి అలా దూసుకుపోతాయి ఏ ఆటంకం లేకుండా.

ఓ గొప్ప వేదాంతం స్ఫురించింది. మనం మన లోపలి సమస్యలు, మన చిన్ని జీవితం గురించే ఆలోచిస్తూ కూర్చుంటే, మన భావాలు ఒక పరిధి దాటి మరి వికసించవు. అదే ఒక్క క్షణం చిన్న చిన్న సమస్యల్ని ఇగ్నోర్ చేస్తూ, బయటి ప్రపంచంలోకి చూస్తే ఎంత ఆత్మానందం! మనల్ని మనమే మర్చిపోతాము. వింతలు అని ఏడింటిని పేర్కొన్నామే కానీ, తరచి చూస్తే ఈ ప్రపంచంలో ప్రతిదీ వింతే.

‘పూవుల్లో దాగున్న పండ్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం ‘ అనే పాట ఎంత నిజం!

మానవ స్వభావ వైరుధ్యాలు, ఈర్ష్యాద్వేషాలు, అనురాగ,అహంకారాలు ఒకటేమిటి, ప్రకౄతిపరంగా చూసినా, జీవజాలం తరపు చూసినా, ప్రతి చర్యా, ప్రతి క్రియా వింతతో కూడినదే.

మరో విధముగా ఆలోచిస్తే, కిటికీ ద్వారా మనకు కనిపించే బయటి ప్రపంచం సృజనాత్మకతకీ, ఆధ్యాత్మికతకీ సంకేతంగా అనిపిస్తుంది. కుంచించుకుపోయిన దృష్టితో కాకుండా అంతర్నేత్రంతో చూస్తే అదే సృజన.

అలాగే జీవితంలోని సమస్యలు మనకు అంటకుండా, ఒడ్డున (కిటికీ దగ్గర) కూర్చుని ఈ ప్రపంచమనే బస్సులోనే ఉన్నా బయటకి చూస్తూ, కనిపిస్తూ, కనిపించకుండా, వినపడుతూ, వినపడకుండా మనతో, మానవులతో దోబూచులాడే ఆ పరమాత్మను శోధిస్తూ, మన ఆత్మను ఆయన అస్థిత్వాన్ని కనుక్కోవడానికి ఉసిగొల్పచ్చు. బహుశా దీనినే ‘డిటాచ్ మెంట్ ‘ అంటారేమో.

మనం ఎంచుకున్న దారి ఏదైనా, ఈ భావజాలాన్ని అర్థం చేసుకుని ఆచరించగలిగితే, ప్రయాణం అయినా, జీవితమైనా సాఫీగా సాగిపోతుందేమో.

ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో తెలీలేదు. మరి కొద్ది సేపట్లో నెల్లూరు వచ్చేస్తుంది. లగేజి తీసి రెడీగా పెట్టుకుంది స్నిగ్ధ.అల్లంత దూరంలో నెల్లూరు బస్ స్టాండ్ కనిపించింది.

ప్రయాణం ముగిసింది. జీవితం పలకరించింది. ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. అవి కంచికి. స్నిగ్ధేమో ఇంటికి.

ప్రకటనలు

దోర్…..

చాలా హృద్యమైన సినిమా, చాలా సహజంగా ఉంది. ఆలోచించే కొద్దీ ఎన్నో కోణాలున్నాయి.

బతుకుతెరువు కోసం దూర తీరాలకు వెళ్ళాల్సి రావడం, భార్యాభర్తలు, తల్లీ బిడ్డలు దూరమవక తప్పని పరిస్థితి, లేదా అలాంటి పరిస్థితిని కోరి కొని తెచ్చుకున్న సమాజం.

సాధించాలనే ఆశయం, ఆత్మ విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే. ఎంత పెద్ద పనైనా చేయగలమనే నమ్మకం, చేయాలనే బలమైన ఆశయం ఉంటేనే సాధ్యమౌతుంది.

దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా స్త్రీల జీవితాలు ఎలా ఉంటాయి, వారి హక్కుల కోసం, కనీస స్వేచ్ఛ కోసం వారు ఎంతగా పోరాడాలి.

ఎంత దు@ఖం కమ్మేసిన జీవితమైనా చిన్న చిన్న ఆనందాలను ఎలా ఆస్వాదిస్తుంది. జీవితం విలువ ఏమిటి.

హిమ్మత్ – ధైర్యం, హోస్లా.. ఇది ఆత్మవిశ్వాసం తో కూడిన ధైర్యం కావచ్చు ఉండటం ఎంత అవసరం. ఎలాంటి నిరాశాజనక పరిస్థితుల్లో అయినా ఓ కార్యసాధకునికి మార్గం ఎలా దొరుకుతుంది….. ఊహించని వ్యక్తుల నుంచి సాయం ఎలా అందుతుంది…. దొంగతనం చేసేవాళ్ళు, మాయమాటలతో మోసం చేసేవాళ్ళలో కూడా మానవత్వం ఎలా నిబిడీకృతమై ఉంటుంది…..

హకీకత్…… ఈ పదం ఎంతో విలువైన పదం, ఆంగ్లంలో అయితే ఫాక్ట్ కావచ్చు దీని అర్థం. తెలుగులో సరైన పదం గుర్తురావడం లేదు. మన చేతిలో లేని కారణాల వల్ల జీవితాలకు జీవితాలే ఎలా తారుమారవుతాయి.

స్త్రీ, పురుషుల మధ్య శారీరిక మోజు లేని, నిష్కల్మషమైన అభిమానం, ప్రేమ ఉండచ్చు అని…….

ఇలా ఒకటేమిటి…… చాలా చాలా ఉన్నాయి ఈ సినిమాలో అర్థం చేసుకోదగినవి.

క్లుప్తంగా ఇది ఇద్దరి ఆడవారి కథ. హిమాచల్ ప్రదేస్ లో జీనత్ అనే ఆత్మవిశ్వాసం, ధైర్యం కల అమ్మాయి ఉంటుంది. ఆమె, ఆఅమిర్ అనే అతను రెండేళ్ళుగా ప్రేమించుకుంటూ ఉంటారు. ఆమిర్ తల్లిదండ్రుల అనుమతి కోసం వేచిచూస్తుంటారు. ఉద్యోగం కోసం దుబాయి వెళ్ళాలని నిర్ణయించుకుని జీనత్ ని పెళ్ళి చేసుకుని దుబాయి వెళ్ళిపోతాడు. జీనత్ క్రమంగా అత్తమామల ప్రేమని పొందుతుంది. వారికి చేదొడు, వాదోడుగా ఉంటుంది.

రాజస్థాన్ లో మీరా, శంకర్ భార్యాభర్తలు, అగ్నివంశీయులు. ఆచారవ్యవహారాలలో శ్రోత్రియంగా ఉంటారు. అత్తగారి అత్తగారు, అత్తగారు, మామగారు, భార్యా, భర్త, వాళ్ళు పెంచే ఓ కూతురు ఉంటారు. వాళ్ళ భవనం (హవేలీ) అప్పుల్లో ఉన్న కారణంగా శంకర్ దుబాయి వెళ్తాడు.

శంకర్, ఆమిర్ ఒకే రూములో స్నేహంగా ఉంటారు. ఎవరూ లేని సమయంలో వారిద్దరి మధ్య ఎందుకో వివాదం జరిగి అనుకోకుండా పై నుంచి కిందపడడం వల్ల శంకర్ చనిపోతాడు. శంకర్ చావుకి కారణమైనందున ఆమిర్ కు ఉరిశిక్ష పడుతుంది. దుబాయి చట్టాల ప్రకారం  మృతుని భార్య క్షమిస్తే దోషికి ఉరిశిక్ష రద్దవుతుంది.

ఆమిర్, శంకర్ కలిసి తీయించుకున్న ఫోటో తప్ప ఇక ఏ వివరాలు జీనత్ దగ్గర ఉండవు. అతని ఊరు రాజస్థాన్ అని తప్ప ఇంకేమీ తెలియదు. అయినా అలాగే బయలుదేరుతుంది. ఓ సిఖు సాయంతో రాజస్థాన్ వరకు వెళ్తుంది. అక్కడ ఓ దొంగ తన సంచీ, సామాను దొంగలిస్తాడు. ఒంటరిగా ఉన్న ఈమెను బలాత్కరించడానికి ప్రయత్నించబోతే, ఆమె సామానులు దొంగిలించిన అతను పోలీసు వేషంలో వచ్చి రక్షిస్తాడు. ఇతను రకరకాల వేషాలతో ప్రజలను మోసగిస్తూ తన పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి గురించి తెలుసుకుని తనకి సాయపడతాడు. మొత్తానికి జోధ్పూర్ దగ్గర సరోహా అనే పట్టణం అని తెలుసుకుని వారి ఇంటికి వెళ్తారు. మీరాని కలుసుకోక ముందే… శంకర్ అమ్మ, నాన్న, తమ్ముడు ఆమెను వెళ్ళగొడ్తారు.

ఎలాగైనా మీరాని కలిసి ఆమే చేత సంతకం పెట్టించుకోవాలని జీనత్ అనుకుంటుంది. మీరా చాలా చలాకి అయిన పిల్ల కాకపోతే భర్త పోయిన తర్వాత తన ఇష్టాలన్నిటినీ చంపుకుని జీవచ్ఛవంలా బతుకుతూ ఉంటుంది. చిన్న చిన్న ఆనందాలు పొందేందుకు కూడా తనకు అర్హత లేదు అనుకుంటుంది. అలాంటి ఆలోచనలు రావడమే తప్పు అని భావిస్తుంటుంది.

గుడికి వెళ్ళడం కోసం మాత్రం తను బయటకి వస్తుందని తెలుసుకుని తన భర్తని వెతికేందుకు మీరా సహాయాన్ని అర్థిస్తుంది జీనత్. మొదటే విషయం చెప్తే శంకర్ తల్లిదండ్రుల లాగే మీరా కూడా ఎక్కడ నిరాకరిస్తుందో అని భయపడుతుంది. క్రమంగా వారి మధ్య స్నేహం చిగురిస్తుంది. జీనత్ సహచర్యంలో తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు గడిపే హక్కు తనకు ఉందని, తన హక్కులను తనే సాధించుకోవాలని మీరా తెలుసుకుంటుంది. ఇంతలో ఉరిశిక్ష తేదీ ప్రకటించబడుతుంది. మీరాకి విషయం చెప్తే కోపంగా సంతకం పెట్టడానికి నిరాకరిస్తుంది. మీరా, జీనత్ తో స్నేహం చేస్తోందని తెలిసిన శంకర్ తల్లిదండ్రులు మీరాని బంధిస్తారు. నిరాశతో జీనత్ తిరిగి వెళ్తూ మీరకి ఉత్తరం రాసి వెళ్తుంది. అమ్మమ్మ (అత్తగారి అత్తగారు) సలహాతో, సాయంతో మీరా బయటపడుతుంది. ఆమిర్ ని క్షమిస్తూ సంతకం పెడ్తుంది. జీనత్ తో కలిసి వెళ్తుంది తన ఊరి నుంచి, బందిఖానా లాంటి జీవితం నుంచి.

నటీనటుల నటన, దర్శకత్వ ప్రతిభ, సంగీతం, ప్రదేశాలు, డైలాగులు ఒకటేమిటి అన్నీ చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని డైలాగులు హృదయానికి హత్తుకుండిపోతాయి.

దర్శకత్వం, కథ నాగేష్ కుకునూర్ వి. జీనత్ గా గుల్ పనాగ్, మీరా గా అయేషా టకియా, దొంగగా శ్రేయాస్ తల్పడే, శంకర్ నాన్న గా గిరీశ్ కర్నాడ్, ఓ ఫ్యాక్టరీ అధిపతి/అధికారిగా నాగేష్ కుకునూర్ నటన చాలా బాగుంది.

ఏ హోస్లా కైసే ఝుకే…….. ఏ ………. కైసే రుకే……..అనే పాట చాలా బాగుంటుంది. ఫిజా తర్వాత నాకు అంతగా నచ్చింది ఈ సినిమా.

మనోభావాలు

ఎక్కడ ఏ అలజడి జరిగినా గాయపడేవి మనోభావాలే. మనోభావాలు అంటే ఏమిటో, ఎలా ఉంటాయో చూపించండి నాకు అంటూ ఎవరో తెలుగుపీపుల్ వెబ్ సైటులో చాలా చక్కగా వ్రాసారు.

ముంబై మారణకాండలో, ఈ మధ్య తరచుగా భారతదేశంలో జరిగే ఉత్పాతాలలో దెబ్బతిన్నవి ఎవరి మనోభావాలు !! హిందువులువా, ముసల్మానులవా, క్రైస్తవులవా, పార్శీలవా, సిక్కులవా … ఎవరివి?

ఈ మధ్య ప్రతి ఒక్కరి మనోభావాలు తెగ స్పందిస్తున్నాయి, ముఖ్యంగా నిద్రించే, చేతగాని, చేవలేని, పట్టింపులేని మనవి, సాధారణ ప్రజలవి.

మనమెప్పుడూ సాధారణప్రజల కోవలోనే ఉండేందుకు సిద్ధపడతాము. అప్పుడు ఏ బాధ్యత అవసరం లేదు. ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ నిందిస్తే సరిపోతుంది. ఆ పార్టీ చెత్తదా, ఈ పార్టీ వెధవాయా అని వ్యాఖ్యానాలు చేసుకుంటూ ఉంటే రోజు గడిచిపోతుంది.

ముంబైలో కమెండోలు వారి పని పూర్తయ్యాక బయటకొచ్చి వెళ్ళిపోతుంటే…… భారతమాతా కీ జై…… జై జవాన్ అని సాధారణ ప్రజలు అరిచారని చదివాక ….. భరతమాత, జవాన్లతో పాటు నా మనోభావాలు కూడా గాయపడ్డాయి.

పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతున్న యుధ్ధఖైదీలను విడిపించాలంటూ వారి కుటుంబాలు కాళ్ళరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే……. అప్పుడేమైంది జై జవాన్ నినాదం.

కార్గిల్ యుధ్ధమప్పుడు లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా మరియు అతని సహచరులను అత్యంత కిరాతకంగా హింసించి చంపేసి, చిత్రహింసకు గురైన శవాలను నిస్సిగ్గుగా మనకి అప్పగిస్తే……. ప్రభుత్వం ఎలా స్పందించింది అని ఒక్కరైనా ప్రశ్నించామా !!

చైనా తో యుధ్ధం, పాకిస్తాన్ తో యుద్ధాలు….. జరిగిన రోజులను మనం స్మృతిపథంలో ఉంచుకోము. సినిమావాళ్ళ పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ వార్తలే.

ఇంచుమించు మన దేశంలోని ప్రతి రాష్ట్రంలోను తీవ్రవాదుల తూటాలకు మన జవానులు వీరమరణం పొందుతున్నారు. ఏనాడైనా వారికి శ్రధ్ధాంజలి ఘటించామా? అసలు వారికి పోరాడేందుకు సదుపాయాలు కల్పిస్తున్నామా?

జై జవాన్….. భారత్ మాతా కీ జై…… మనలాంటి సాధారణ ప్రజలందరికీ …… ఇలా నినదించేందుకు… హక్కు లేదు…..అర్హత లేదు…….

సైన్యానికి యువత అవసరం ఎంత ఉంది !! మనలో ఎంత మందిమి సైన్యంలో చేరుతున్నాము? మనం ఏమీ చేయము. అదేదో సినిమాలో చెప్పినట్టుగా…….. జెండా పండుగ రోజు జాతీయ గీతాలాపనతో మొలకెత్తే దేశభక్తి ఆ గీతంతోనే ముగుస్తుంది.

ముంబై లాంటి దుశ్చర్యలు జరిగినప్పుడల్లా అవివేకమైన ఆవేశంతో, అర్థం పర్థం లేని నినాదాలు చేస్తాము. పాకిస్తాన్ మీదకు యుద్ధానికి వెళ్ళాలని అంటాం. అవును మనకేమి పోయింది? పోయేవి సైనికుల ప్రాణాలు మాత్రమే కదా…

అందుకే మనకి యుధ్ధం కావాలి. సొల్లు వేసుకోవడానికి బోలేడు కబుర్లు ఉంటాయి అప్పుడు. పాకిస్తాన్ కాదు భారత దేశం శతృవు. మనం…. సాధారణ ప్రజానీకం.. శతృవులం.

ఓ పంది, ఓ గోవు, ఓ కాగితం, ఓ కట్టడం…..

కాదేదీ కలత కనర్హం….

ఒకరినొకరం చంపుకోవడమే ఆదర్శం.

డబ్బు కోసం మనమే ఉగ్రవాదులను రానిస్తాము, ఆశ్రయమిస్తాము, అన్నీ సమకూరుస్తాము. డబ్బు తప్ప ఏమీ పట్టని మన జీవితాలు ఉగ్రవాదుల తూటాలకు బలవ్వడమే భేషుగ్గా ఉంటుంది.

అవును…………. మనోభావాలు గాయపడ్డాయి…

మీవో, నావో కాదు……..

మానవత్వానివి !!!

టాంగో చార్లీ

ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడండి. హృదయం ద్రవిస్తుంది. అలాగే సైనికుల పట్ల భక్తితో గుండె ఉప్పొంగుతుంది. నాకో మంచి కవిత తట్టింది. కాకపోతే వ్రాయలేక మనసు బరువెక్కింది.

నిజానికి నేను చాలా చాలా టపాలు వ్రాయాలి. సంవత్సరాల తరబడి మనసులో నిక్షిప్తమై ఉన్న బాధ కెలికి తీసినట్టయింది. కన్నీరు నాకు కొత్త కాదు. చాలా సున్నిత స్వభావమైనందున నాకు కన్నీళ్ళు తేలికగా వస్తాయి. కాకపోతే వయసు పెరిగే కొద్దీ వాటిని కనబడనీయకుండా దాచడం ఎలాగో అలవాటైపోయింది.

నాకు అత్యంత బాధ కలిగిన సమయాల్లో నేను చేసే పని ఒంటరిగా నా గదిలో పడుకుని కరువు తీరా ఏడ్వడం. మనసులో దుఃఖం తాలూకు ఏ ఈక మిగలనంతగా ఏడ్వడం. అందుకే నేను కవితలు వ్రాసినా, బాధపడినా, నాతో నేను సమయం గడుపుకోవాలన్నా రాత్రి సమయాన్నే ఎంచుకుంటాను.

అయితే వైయక్తిక కారణాలు కాక సమాజం కోసం తీవ్రంగా చలించింది నిన్న, ఈ రోజు. ఇప్పటికీ నేను ఈనాడు ఆదివారం పత్రికలో వచ్చిన పూలన్ దేవి కథను పూర్తిగా చదవలేదు. సగం చదివేటప్పటికే వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ ప్రభావం ఎంతగా ఉన్నదంటే నా రూములో నుంచి బయటకు రాలేనంతగా. విపరీతమైన భయం. నా రూములో కూడా మునగదీసుకుని, ముదుచుకుని పడుకున్నాను. ఎంతసేపు ఏడ్చానో, ఎప్పుడు నిద్రపోయానో నాకు గుర్తులేదు.

ప్రత్యేక ఆర్థిక మండళ్ళ గురించి తెలుసుకోవాలని ఎప్పటి నుంచో ఉన్నా, నిన్నటి సమావేశం అందుకు అవకాశం కల్పించింది. ఈ విషయం చెప్పినందుకు రాకేష్ కి కృతజ్ఞ్జతలు. విపరీతమైన అలజడి. నాలో ఇది కాలేజీ రోజుల్లో బాగా ఉండేది. దినపత్రిక చదివితే కానీ దంతధావనం కూడా చేయను. అప్పట్లో ఈనాడు, వార్త రెండూ తెప్పించుకునేవాళ్ళం. (ఆశ్చర్యపోకండి. మా అమ్మది చాలా జాలి గుండె. పేపర్ వేయించుకోమని వచ్చే పిల్లలకి కొంచెం కమీషను వస్తుంది కదా) వార్త పత్రికనైతే సాంతం చదివేదాన్ని.

అప్పట్లో ఒకటే హింస. పోలీసులు, నక్సల్స్ ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలు. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇవాళ పేపర్లో పోలీసులని చంపారని ఉంటే ఇంకొక రెండు రోజుల్లో నక్సలైట్లతో ఎన్ కౌంటర్ వార్త ఉంటుందని. అదే విధంగా నక్సలైట్లు హతమైతే ఏ టెలిఫోన్ ఎక్స్చేంజో, ఓ ఇంఫార్మర్ అనబడే వ్యక్తో, లేదా పోలీసులో మరణిస్తారని. విపరీతమైన బాధ. మన ప్రజలనే మనం ఒకళ్ళనొకళ్ళం చంపుకోవడమేమిటని.

వాటి తర్వాతి స్థానం మానభంగాలు, వరకట్న చావులు. ఇవే ప్రతిరోజూ చదవాల్సి వచ్చే వార్తలు. ఓ స్త్రీనైనందుకు స్త్రీలనే నేను బాగా అర్థం చేసుకోగలను. కొంత మంది పురుష కవులు స్త్రీల బాధల గురించి, భావాల గురించి, అనుభూతుల గురించి అంత చక్కగా ఎలా వ్రాయగలిగారనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎందుకంటే నాకు ‘మగ ‘ అనే పదము అర్థం కాదు కనుక.

ఓ స్త్రీకి, పురుషుడికి మధ్య తాము స్త్రీ, పురుషులము కాదు ఓకే ఆత్మ ఒకే మనసు అన్న భావన పెంపొందినప్పుడు కలిగే ఓ ప్రేమ, ఓ చర్య మానభంగం లాంటి వికృతరూపు దాల్చడానికి కారణేమిటో అర్థం కాదు. శరీరమేనా ప్రధానం. సంతోషం లేని సుఖం ఏ ఆటవిక సంస్కృతిలోనైనా ఉంటుందా. మనం చాలా తప్పు చేస్తున్నాము. మనిషిని ఎవరితోనూ పోల్చలేము. ఎందుకంటే మానవజాతే అత్యంత ప్రమాదకారి.

చదివినప్పుడల్లా బాస్టర్డ్స్ అని కసితీరా తిట్టాలని ఉంటుంది. కానీ ఆ రూపేణా కూడా ఓ స్త్రీ నింద భరించాల్సొస్తుంది అని ఆవేదన. నాకు అనిపిస్తుంది ఏ స్త్రీ కూడా తన మీద దౌర్జన్యం చేసిన వ్యక్తిని ప్రాణాలతో బతకనీయకూడదని.

స్త్రీల విషయంలో కూడా నాకు జీర్ణం కాని విషయాలు రెండే రెండు. ఒకటి వరకట్నం తేలేదని కోడళ్ళను రాచి రంపాన పెట్టడం, లేదా చంపడం. రెండు వేస్యావృత్తి లోకి ఆడవారిని లాగడం. ఓ స్త్రీ అయి ఉండి ఇంకొక స్త్రీకి అటువంటి దురవస్థ కలిగించాలనుకోవడం….. అమ్మో నాకు ఎప్పటికీ అర్థం కాదు.

నాకు ఎంతో ఇష్టమైన గాలోస్ అనే పద్యమే గుర్తొస్తుంది. దేవుడట సృష్టిలోని సమస్త జీవజాలాన్ని కాపాడడానికి మనిషిని సృష్టించాడట. కానీ మనిషేమో ఒక్కొక్కదాన్ని కేవలం వినోదం కోసం చంపేస్తున్నాడట. ఈ కవితలో ఇది ఒక రకమైన అర్థం. ఇంకో వేదాంత భావం కూడా ఉంది. కాకపోతే అది ఇక్కడ అప్రస్తుతం.

ఇక ఆ తరువాత అన్నిటికన్నా ముఖ్యమైనది పాకిస్తాన్ తో యుద్ధం, శతృత్వం, స్నేహం అన్నీను. అదే విధంగా చైనా, అమెరికా మరియు అంతర్జాతీయ సంబంధాలు, సమీకరణాలు. నాకు ఎప్పుడూ స్థిరమైన అభిప్రాయాలంటేనే గౌరవం. నాన్చుడు ధోరణి, గోడ మీది పిల్లి వ్యవహారాలు నచ్చవు. నేను ఏ పర్టీకి మద్దతిస్తాను, వివిధ అంశాల పట్ల నా నిర్ణయమేమిటి అన్న దాంట్లో నాకు స్పష్టత ఉండాలని అనుకునేదాన్ని. తీవ్రంగా చదవాలని ఉండేది.

(ఇప్పటికీ స్పష్టతలేని అంశాలు – లైంగిక విద్య పిల్లలకు నేర్పడం, వేశ్యా వృత్తిని చట్టబద్ధం చేయడం. )

చైనా కూడా నా దృష్టిలో శత్రువే. ఎందుకంటే అది మనతో యుద్ధం చేసింది. మన మీదకి దండెత్తి వచ్చింది. అమెరికా అంటే ఏహ్య భావం. ప్రపంచం వాడబ్బ సొత్తని జులుం చెలాయించడం చూస్తే ఒళ్ళు మంట. ప్రపంచ వాణిజ్య సంస్థ భవనాలు కుప్పకూలినందుకు నాకు ఆనందమే కలిగింది. ఆ మరణాల పట్ల బాధ ఉంది. ఇప్పటికీ నాకు గుర్తుండేది. ఓ భార్య చనిపోతూ.. ఐ లవ్ యూ డార్లింగ్.. అని భర్తకి చెప్పడం. తన భర్త తన చివరి క్షణాల్లో తన పక్కన లేడు. కానీ తాను తను దగ్గర ఉంటే ఏమి చెప్పాలని అనుకుంటుందో అది రికార్డు చేసింది. ఆ చెప్పడం కూడా ఎంతో హడావుడిగా చెప్తుంది. ఎవరో తరుముతున్నట్టు. అవును కదా ఆ తరిమేది మరెవరో కాదు మృత్యువు 😦

పాకిస్తాన్ తో స్నేహ హస్తం అని ‘ఇండియా పాకిస్తాన్ ఫ్రెండ్స్ ఫోరం ‘ అని ఒక వ్యాసం వ్రాసా అథర్స్ డెన్ వెబ్ సైటులో. దానికి నా స్నేహితుల నుంచి వచ్చిన స్పందన మనలో వేళ్ళూనుకున్న భావాలు ఎంత బలమైనవో అర్థం అయింది. పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు నేను రెండే రెండు అంశాలు గుర్తుకు తెచ్చుకుంటాను. ఒకటి వాజ్ పేయి మాటలు… ‘మనం మన స్నేహితులను మార్చుకోగలము కానీ మన పొరుగింటివారిని కాదూ అని. అలాగే అబ్రహాం లింకన్ మాటలు… ‘నీ శత్రువుని జయించాలంటే అతన్ని నీ మిత్రుణ్ణి చేసుకో. శత్రుత్వాన్ని జయిస్తావు ‘ అని. ఎంత గొప్ప వ్యాఖ్య. మనం కొట్టుకోవడమే కావాలి అమెరికా వాడికి, చైనీయులకి (మన రాజకీయనాకులకి కూడా కావచ్చు). మనం స్నేహంగా మసలడమే గొప్ప ప్రతీకారం. కలిసి సాధించే అభివృద్ధే వారికి కంటగింపు కలిగించాలి. ఇది నా ఆశ. ఒక భారతీయురాలిగా నా కోరిక.

తరువాత ఉత్తేజపరిచే అంశం స్వాతంత్ర్య పోరాటం, దేశభక్తుల త్యాగాలు. కానీ ఇప్పుడు ఓ యాభై సంవత్సరాల తర్వాత అవన్నీ వృథా కాబోతున్నాయా అని భయమేస్తుంది ఈ సెజ్ లను గురించి తెలుసుకుంటుంటే.

మన దేశంలో మన భూభాగాన్నే మనం సకల సదుపాయాలు, రాయితీలు కల్పించి ఇస్తాము. ఆ భూభాగం మీద మన రాజ్యాంగం, మన చట్టాలు చెల్లని చీటిలు చేయచ్చని రాసిస్తాము. భూమి యజమానులని, దిన కూలీలుగా, పని కోసం దేసమంతా తిరిగేలాగా చేస్తాము. సెజ్ లలో పని తాలూకు నియమాలు వింటుంటే నేను బ్రిటీషు వారి కాలం నాటి విషయాలు వింటున్నానా లేక మన సొంత దేశం, రాష్ట్రం, నా జిల్లా కు సంబంధించి 21 వ శతాబ్దానికి సంబంధించినదే అని నమ్మబుద్ధి పుట్టడం లేదు. (అవును గట్టిగా చెవులు మూసుకోవడం చాలా మంచిదే. నమ్మిన క్షణం నుంచి నిద్ర పట్టదు. నేను నిద్రపోవాలి. రేపు అమెరికన్ల ప్రాజెక్టు మీదే కదా నేను పని చేయాల్సింది.)

ఈ సెజ్ ల గురించి నేను నిన్న (మొన్న) విన్న వివరాలన్నీ వ్రాస్తాను ఒకటొకటిగా.

22/09/07 : పని – ఫలితం

ఇవాళ అంతా ఫోన్స్ , మెయిల్స్ తోనే సరిపోయింది. ఆఖరికి అమీర్ ఎస్టేట్ లో ఉన్న హాస్టలు పిల్లలని కూడా పిలిచాము. కశ్యప్ తమ్ముడు భార్గవరామునికి బ్లాగు ముఖంగా నా కృతజ్ణ్జతలు. తనే నన్ను తీసుకెళ్ళాడు.

రేపు ఉదయం శ్యామలకుంటలో సుందర్ ధన్వంతరీ యజ్ణ్జం చేయిస్తున్నారు. ఉదయం 8:30 నుంచి 10:30 వరకు జరుగుతుంది. అదయ్యాక ఇక వెన్యూ దగ్గరకి వచ్చి ఆ ఏరియాలో ఉండే హాస్టలు పిల్లలను పిలవాలని ప్లాను.

తెలుగుపీపుల్ వాళ్ళని పిలవడం కుదరలేదు. మెయిల్ ఇద్దామనుకుని మర్చిపోయాను. తీరా రాత్రి నేను వెళ్ళేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు.  MVR గారు ఊర్లో ఉండడం లేదు.  PSR గారు వేరే మీటింగ్ కి వెళ్తున్నారు. అది తొందరగా పూర్తైతే దీనికి వస్తాను అన్నారు.

పుణ్యం పుచ్చిపోయి పిలిచిన అందరూ వస్తే ‘హలు నిండినది ‘ బోర్డు పెట్టేయచ్చు 🙂 నా వరకు నేను చాలా సిన్సియర్ గా ప్రయత్నించాను. పని చేయడం నా వంతు. ఫలితం ఇయ్యడం భగవంతుని వంతు. కాకపోతే నాకు ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ లేదు. బాబా నాకు బానే తర్ఫీదునిస్తున్నారు పరోక్షంగా. ఇది ఎలా జరిగినా నేను చలించకుండా ఉండాలి అనుకుంటున్నాను. మాస్టరు గారు చెప్పింది అదే కదా. సత్సంగాలప్పుడు, గుడిలో చేసే కార్యక్రమాలప్పుడు చలించకుండా ఉండాలి అని. మరి చూడాలి.

ఒక్క తలస్సీమియా విషయం తప్ప దాదాపుగా అన్ని పనులు పూర్తి చేసాను ఇవ్వాళ. అదో తృప్తి.

ఎవరి దగ్గరైనా వీడియో కెమెరా ఉంటే తెండి అని అడుగుదాము అనుకున్నా. కానీ బాగుండదేమో అని అడగలేదు. లక్కీగా సుందర్ నిన్న కొన్నారు. యజ్ణ్జం ఉంది, ఈ మీటింగ్ కూడా ఉంది కదా అని కొన్నారుట. అంతకు ముందు మీటింగ్స్ కూడా ఆయన ల్యాప్ టాప్ తో వీడియో తీశారు. అన్నీ కలిపి వచ్చే వారంలో అప్ లోడ్ చేయమని చెప్పాలి.

కౌటిల్య నాన్నగారు, లాయరు ప్రసాదరావు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ణ్జతలు చెప్తున్నాను. ఆయన ఎంత శ్రధ్ధ తీసుకుంటున్నారో చెప్పలేము. రాత్రి వెళ్ళి వెన్యూ చూసొచ్చాను. బాగానే ఉంది. మైకు కూడా పెట్టుకుంటే బాగుంటుందేమో అంటే దాని గురించి కూడా తనకు తెలిసిన ఓ టెంటు హౌసు వాళ్ళకి ఫోన్ చేసారు. రేపు అది కూడా దొరకచ్చు.

అలాగే సుందర్ గారికి, సత్యాకృష్ణ కి. ఈ అబ్బాయి వారంలో ఆరు రోజులు వర్క్ చేయాలి. ఇంటి బాధ్యత తనదే. ఐనా సరే ఆఫీసు పనుల్లో కానీ, గ్రూపు పనుల్లో కానీ ఎంతో శ్రధ్ధ తీసుకుంటాడు. మా గ్రూపు వాళ్ళని మీటింగ్ కి పిలిచే బాధ్యత తనకి ఇచ్చాను. నేను మెయిల్ చేసాను. ఫాలో అప్ చేసి వాళ్ళు వచ్చేటట్టు చేయడం తన వంతు. 

22/9/07 – ఇవాళ్టి పనులు

1. షణ్ముఖి గారిని కలవాలి. సత్యాకృష్ణ వస్తాను అన్నాడు. నేను, సుందర్ , సత్యాకృష్ణ ఇంకా సురేందర్ వెళ్తాము. రేపు ఉదయం ఆవిడకి ఫోన్ చేసి తనకు వీలైన సమయంలో కలవాలి. ఆవిడ చెప్పిన టైము అందరికీ చెప్పాలి.

2. సాయంత్రం హోమియో డాక్టరు గారిని కలవాలి. శ్రీ యు. వి. ఎన్ . కె. రాజు గారు వస్తాను అన్నారు. అక్కడ మరో సమావేశం.

3. FRF వాళ్ళ మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఒకరు పరిచయమయ్యారు. వారు ఈ వారం ఇంకా ఊర్లో ఉంటే వాళ్ళని తలస్సీమియా సొసైటీకి వెళ్ళమని చెప్పాలి.

4. రేపు సమావేశానికి సంబంధించి పనులు ఏవైనా ఉంటే చూడాలి. కెప్టెన్ సత్యప్రసాద్ గారితో మాట్లాడాలి.

5. చరణ్ మరియు వినయ్ లకి  ఒకళ్ళ నెంబరు ఒకళ్ళకి ఇచ్చాను. ఎల్లుండి అశోక్ నగర్ స్లం లో వాళ్ళు చదువు చెప్తారు.

6. రేపు ఉదయం సుందర్ శ్యామలకుంటలో యజ్ణ్జం చేస్తున్నారు. ఆరోగ్య యజ్ణ్జం. ఆ విషయం అందరికీ చెప్పాలి.

7. ఆశ్రయ్ ఆకృతి బాబు గారికి వెన్యూ దొరికిన విషయం చెప్పాలి.

8. హరినాథ్ గారిని కలవాలి. OCMS Project గురించి మాట్లాడాలి, అలాగే నెల్లూరు ఋషి శక్తి యోగ మాస్టరు గారికి వెబ్ సైటు Sep 31 కల్లా చేస్తాను అని చెప్పాను. దీని గురించి కూడా హరినాథ్ గారితో మాట్లాడాలి.

హమ్మయ్య

సుందర్ గారు ఓ పెద్ద భారం తీర్చారు. ఇప్పుడే ఫోన్ చేసారు. లాయరు గారితో (మా గ్రూపులోని స్కూల్ పిల్లవాడు కౌటిల్య నాన్నగారు) మాట్లాడారుట. మొన్న విజయ్ గారు చెప్పిన విషయాలు, రాకేష్ చెప్పిన విషయాలు ఓ గంట సేపు వివరించారుట. ఆయన అసలే లాయరు కదా చాలా శ్రద్ధగా విని, ఏవో కొన్ని ప్రశ్నలు కూడా చెప్పి, ఇవి అన్నీ మనం అడుగుదాము అన్నారుట.

ఆయన నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ కి రెగ్యులర్ గా వెళ్తుంటారుట. కాకపోతే వాళ్ళు డబ్బులు అడగచ్చు. అడిగితే నేనే స్పాన్సర్ చేస్తాను అన్నారుట. సుందర్ ఏమో వాళ్ళు మనకు ఊరికే ఇస్తే మనం ఉచిత మెడికల్ కాంప్ నిర్వహించుదాము అని చెప్పారుట. అంతగా అయితే అన్ని గ్రూపుల వారు కొంత మనీ షేర్ చేసుకునేటట్టు మాట్లాడితే బాగుంటుంది. మా గ్రూపు వాళ్ళు ఏమంటారో కూడా చూడాలి.

ఇదైతే ఎక్కువ మందే పడ్తారు. పుణ్యం పుచ్చిపోయి ఎక్కువమంది వచ్చినా స్థలం సరిపోతుంది. ఇక ఎవరెవరు వస్తున్నారు కంఫర్మ్ చేసుకోవాలి. భలేగుంది. నా అంచనా ప్రకారం ముప్పై కి తగ్గరు. యాభైకి పెరగరు. చూద్దాం.