సురేష్ ఏదిగ

ఇతను నాకు రైజ్ నెట్ వర్క్ ద్వారా పరిచయం. భోపాల్ గ్యాస్ బాధితుల గురించి ఎక్కువ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఆ తరువాత పిల్లల గురించి. క్రై సంస్థ కోసం నిధులు సేకరిస్తూ ఉంటారు.

నాకు తెలిసి ఇతన్ని ఎటర్నల్ ఆప్టిమిస్ట్ గా డిఫైన్ చేయచ్చు.  అసలు ఇతను ఎదుటివాళ్ళ గురించి ఏ క్షణంలోనైనా వ్యతిరేకభావం కలిగి ఉంటారా, లేదా కోపం వస్తుందా అన్నది అనుమానమే 🙂

US చాప్టర్ కి క్రియాశీల సభ్యులు. RTI Act అంటే ప్రత్యేకమైన గౌరవం. ఈయనలో నచ్చేది ఏమిటంటే stringent రూల్స్ ఉండవు. ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అన్నదే ప్రధానం. డబ్బుకి కూడా అవసరమైనంత విలువ మాత్రమే ఇస్తారు.

సాయిచరణ్ కేసులో అయితే తన సొంత డబ్బులు ముందుగా ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. తర్వాత కలెక్ట్ చేసి తీసుకోవచ్చులే అని. అది ఎప్పటికైనా సరే.

మెయిల్స్ కి రెస్పాన్స్ చేస్తారు. తన అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఒకానొక సమయంలో గ్రూపుకి సంబంధించిన విషయాల్లో ఈయన మౌనం నాకు బాధని, కోపాన్ని కూడా కలగచేసింది. కానీ సమయమే దేనికైనా సమాధానం అన్నట్లు తరువాత సైనికులకి సంబంధించి ఈయన చేయూత కూడా అంతే ఆనందాన్ని కలిగించింది.

ఏ వ్యక్తి అయినా ఒకరి సహకారం ఉన్నా, లేకున్నా తను అనుకున్న పని చేస్తారు. కానీ మనతో కలిసి వచ్చిన వారి సహకారం ఉంటే ఆ పనిని ఇంకా సమర్ధవంతంగా చేయగలుగుతారు.

నేను అన్నిటికన్నా గర్వపడే విషయం ఏదైనా ఉందంటే అది మా గ్రూపు సభ్యుల ఐకమత్యమే. భేదాభిప్రాయాలు ఉన్నాయి. లేవనను. కానీ మొత్తంగా ఆలోచిస్తే అందరి స్వభావము ఒకటే. మాలో ఎవ్వరికీ ప్రచార కాంక్ష లేదు. ప్రశంసింపబడాలనే ఆశ లేదు. పేపరులో వేయించుకోవాలనే ఊహ అంతకన్నా లేదు. అనుకున్న విధంగా పని చేసుకుంటూ పోతున్నామా లేదా, ఇంకా ఎంత బాగా చేయగలము అన్నదాని మీదే దృష్టి.

US చాప్టర్ కి సంబంధించి చంద్ర, యశోద, దివ్యల తో పాటు ఈయన కూడా ముఖ్యభూమిక పోషిస్తారు.

ప్రకటనలు

కోటి – కోటేశ్వర రావు :)

చంద్ర పరిచయం చేసిన వాళ్ళలో ఈయన ఒకరు. పేరుని చూసి నేను ఈయనకి ఏ నలభై ఏళ్ళో, పిల్లల తండ్రో అనుకునేదాన్ని. చంద్ర స్నేహితుడే అని తెలిసినా పేరు మహత్యమేమో అలా అనిపించేది.

ఈయన ఇస్రోలో పని చేస్తారు. ఫారిన్ లో ఎక్కడ అప్ప్లై చేసినా ఇంకా ఎక్కువ వేతనాలే వస్తాయి కానీ దేశ సేవ చేయాలి, దేశాభివృద్ధిలో తన పాత్ర ఉండాలి అనే తపనతో ఇస్రోలో చేరారు. కలాం గారు ఇస్రోకి వచ్చినప్పుడు ఆయనతో కలిసి తీయించుకున్న ఫోటో ఈయనకు అత్యంత గర్వకారణం.

ఈయన కూడా చాలా కేసులకి డబ్బులు పంపారు. తనవే కాదు, వాళ్ళ స్నేహితుల దగ్గర కూడా సేకరించి పంపేవారు.

చంద్ర పేళ్ళిలో ఈయనని చూసి నాకు తెగ నవ్వొచ్చింది. ఎందుకంటే చాలా సన్నగా, ఇంకా కాలేజీలో చదివే అబ్బాయిలాగా ఉన్నారు. నేను మీ గురించి ఇలా అనుకున్నానండి అని చెప్తే… మీరు మరీనండి. చంద్ర స్నేహితుడినైతే లావుగా, నలభై ఏళ్ళవానిలా ఎందుకు అనుకున్నారు అంటూ 🙂

ఈయనకు కూడా పెళ్ళి అయింది కొన్ని నెలల క్రితం. వెళ్ళడం కుదరలేదు. చంద్ర పెళ్ళికి మాత్రమే వెళ్ళగలిగాను. ఎందుకంటే పెళ్ళిచూపుల స్టేజీ నుంచి తెలుసు కాబట్టి ఆదివారం పెళ్ళైతేనే వస్తాననేదాన్ని. నా జీవితాన్ని నీ ఆదివారంతో ముడిపెడతావా అని గాభరాపడేవారు 🙂 అనుకోకుండా ముహూర్తం ఆదివారమే కుదిరింది:)

కోటి కూడా ప్రస్తుతం సైలెంటు సభ్యులే.

సీతారాం జక్క

ఈయన చంద్రకి కాలేజీ రోజుల నుంచి స్నేహితుడు. చంద్ర స్థాపించిన త్రినందా ఫౌండేషన్ లో కూడా సభ్యుడు.

విచిత్రమేమిటంటే చంద్ర ద్వారా నాకు యశోద, సీతారాం, సతీష్ గార్లు పరిచయం. చంద్రని కలిసింది నేను కేవలం ఐదు నిముషాలు మాత్రమే. అదీ తన పెళ్ళిలో. కానీ యశోదని, సీతారాం ని మూడు సార్లు కలిసాను.

ఈయన స్వామి వివేకానందకు వీరాభిమాని. ఆయన పుస్తకాలు విపరీతంగా చదువుతారు. ఆయనకు సంబంధించిన సంస్థలో సభ్యులు కూడా. వివేక చూడామణి మొదలగు ఆధ్యాత్మిక విషయాల్లో ఈయన కూడా చంద్ర లాగే. కాకపోతే చంద్ర లాగా హిమాలయాలకు వెళ్ళి సెటిల్ అయ్యే ఆలోచన అయితే లేదనే అనుకుంటున్నాను 🙂

ఈయన గ్రూపులో చేరినా కూడా సైలెంటు సభ్యులే. ఎక్కువగా మెయిల్స్ చేసేవారు కాదు. కానీ వివేకానంద అంటే మాత్రం వచ్చేసేవారు. ఈయన చేత మెయిల్స్ రాయించాలంటే వివేకానంద అన్న పదం ప్రయోగించాలన్నమాట అని నేను, దివ్య అనుకునేవాళ్ళం.

మెయిల్స్ చేసినా, చేయకపోయినా ఆర్థిక సహాయం చేస్తారు. మరింకేదైనా విషయంలో సహాయం కావాలని అడిగినా వెంటనే సమాధానమిస్తారు. వ్యక్తిగతంగా కూడా నాకు సాయం చేసారు మా తమ్ముడికి ఉద్యోగం గురించి. కెరీర్ గైడెన్స్. ఎప్పుడు మెయిల్ చేసినా గుర్తుపెట్టుకుని మరీ తమ్ముడి గురించి అడుగుతారు.

నిజాయితీ ఎక్కువ. పట్టుదల మనిషి. మాట ఇస్తే చేసి తీరతాడు. ఇవి ఇతని గురించి చంద్ర నాతో చెప్పినది.

ఈ స్నేహితుల ఇద్దరి పెళ్ళి వారం రోజుల వ్యవధిలోనే జరిగింది. రిసెప్షను హైదరాబాదులోనే జరిగినా వెళ్ళలేకపోయాము. నిజానికి సురేష్ ఆదిన గారు కూడా వెళ్ళాలనే అనుకున్నారు. కానీ ఎందువలనో అప్పుడు ఎవరికీ వీలవలేదు.

ఈయన కూడా గ్రూపు మెయిల్స్ చదివే బాధ్యత శ్రీమతి గారి భుజస్కంధాల మీద వేసారు.

ఈయన ప్రస్తుతం కూడా సైలెంటు మెంబరే. ఎప్పుడు యాక్టివ్ అవుతారో తెలియదు.

యశోద

చంద్రారెడ్డి జీవిత భాగస్వామి. నిజంగా అర్థాంగి. చంద్ర ఎంతో అదృష్టవంతుడు. తనకి సంఘసేవకి అభ్యంతరం చెప్పని అమ్మాయి దొరికితే బాగుణ్ణు అని అనుకునేవారు. కానీ తను కూడా చేసే స్వభావం కల అమ్మాయి దొరికింది :)అత్తగారు మెచ్చుకునే కోడలు.

యశోద నవ్వు నాకు బాగా నచ్చుతుంది. స్వచ్ఛత ఉంటుంది. భర్త బాధ్యతలనన్నిటినీ తను సంతోషంగా స్వీకరించడమే కాదు, సమర్ధంగా నిర్వర్తించడం కూడా.

చంద్ర బిజీ అయిపోయి గ్రూపు బాధ్యతలు కూడా తినకే అప్పచెప్పారు. అన్నిటినీ తను చూస్తుంది. దేనిని కూడా పట్టించుకోకపోవడం అన్నది లేదు. ఇటు తన పుట్టింటి పట్ల, మెట్టినింటి పట్ల కూడా సమాన ఆదరం చూపించే నేటి మహిళ.

నాలాగే తన స్వశక్తితో పైకొచ్చిన అమ్మాయి. నాలాగే పట్టుదల ఎక్కువ. అనుకున్నది సాధిస్తుంది. ఇవి చంద్ర తన గురించి చెప్తూ నాతో అన్న మాటలు.

అంటే అన్నానంటారు కానీ… మా గ్రూపులోని ఆడవారందరూ కూడా చాల ధృడమైన వ్యక్తిత్వం కలవారు. నాకు ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా చాలా గర్వంగా ఉంటుంది.

చంద్రారెడ్డి

ఇతని గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో! మేము షిఫ్ట్ గ్రూపు వాళ్ళు చెప్పిన, చెర్లపల్లిలో ఉన్న ‘హోం ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్ ‘ పిల్లలకు పుస్తకాలు ఇచ్చే ప్రయత్నంలో ఉండగా చంద్ర మా గ్రూపులో చేరారు. తను సాయం చేస్తాను అన్నారు. చాలా మొదట్లోనే అంటే జూన్, జూలై అయి ఉండచ్చు.

ఆ పని పూర్తి అయ్యాక తన గురించి మెల్లిమెల్లిగా తెలిసింది. ఒక బయటి వ్యక్తి మా గ్రూపులో చేరడం చంద్రతోనే మొదలు నాకు తెలిసి. అందరూ స్నేహితులు, లేదా స్నేహితులతో పని చేసేవారు లేదా స్నేహితుల స్నేహితులే.

ఈయనకి ఇంటర్నెట్ లో సోషల్ వర్క్ చేసే వాళ్ళ గురించి వెతకడం అలవాటట. అలాగ వెతుకుతుంటే మా గ్రూపు కనిపించిందిట.

నమ్మకం కలిగాక నా ఫోన్ నంబర్ ఇచ్చాను. తను మొదటిసారి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నన్ను నేనే వింటున్నానా అని అనిపించింది. చాలా విషయాల్లో అభిప్రాయాలు ఒకటే. బాగా నవ్విస్తారు కూడా.

అప్పుడు ఏదో విషయం మీద నేను అన్నాను… ఒక సారి, రెండు సార్లు తప్పితే మూడు సార్లు అడుగుతాను అండి. అంతకు మించి నేను ఎవరినీ అడగను. ఎంత స్నేహితులైనా అంతే.. అని. దానికి ఆయన అన్నారు..అలా ఉండకూడదు ప్రశాంతీ. నేనైతే భలే భయపెడతాను. ఒరేయ్ ఇప్పుడు ఎవరికోసమో నేను డబ్బులు కలెక్ట్ చేస్తున్నాను. మీరు ఇవ్వకపోతే రేప్పొద్దున మీ కోసం కూడా ఇలాగే కలెక్ట్ చేయాల్సి రావచ్చు అని. దెబ్బకు భయపడి ఇచ్చేస్తారు అని. నవ్వలేక చచ్చేదాన్ని.

వీళ్ళ గ్రామానికి ఎంతో చేసారు. ఇంకా ఈయన చదువుకున్న స్కూలులోని పిల్లలకి, స్కూలుకి సాయం చేస్తూ ఉంటారు.

ఈ మనిషి మహా యాక్టివ్. ఆ రన్ అని, ఈ రన్ అని అన్నిట్లోను ఉంటాడు. అది కాక మంచి అలవాట్లు. వివేక చూడామణి, భగవద్గీత, వివేకానందుని పుస్తకాలు ఇవి చదువుతారు. బాబా చరిత్ర, విష్ణుసహస్రనామం అయితే చెప్పక్కర్లేదు. నేను ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టేదాన్ని. యూ యెస్ లో ఉంటూ ఇన్ని మంచి లక్షణాలా అని.

అప్పట్లో సార్ పెళ్ళిచూపులు కూడా చూసేవారు. నేను సుందరకాండ పెళ్ళిచూపులు అని వెక్కిరించేదాన్ని. దివ్య, నేను చంద్రని ఎంతలా ఏడిపించామో లెక్కేలేదు 🙂 యశోదతో పెళ్ళి ఫిక్స్ అయ్యాక యశోదకి చెప్తే నవ్వి, నవ్వి ఇక నవ్వలేను అనేసింది 🙂

ఈయనకు నేను, దివ్య కలిసి ఇచ్చిన బిరుదు…… వన్ అండ్ ఒన్లీ చంద్ర 🙂

ఈయన ద్వారా యశోద, సీతారాం జక్కా మా గ్రూపులో సభ్యులయ్యారు. సతీష్ కేతినీడి గారు కూడా పరిచయం అయ్యారు.

US చాప్టర్ కి యశోద-చంద్ర నే కో ఆర్డినేటర్లు. US సభ్యులందరూ కూడా వీళ్ళకి డబ్బులు పంపితే వీళ్ళు ఇక్కడికి పంపుతారు. 

అరుణ్

పవన్ ద్వారా తినకి మా గ్రూపు పరిచయం అనుకుంటా. చాలా రోజులు మా మెయిల్స్ ని చదివి, మమ్మల్ని అర్థం చేసుకుని అప్పుడు యాక్టివ్ అయ్యాడు. నాకు ఇప్పటికీ ఆనందం కలిగి కడుపు నిండిపోయినట్టు అనిపించేది మాత్రం తిను గ్రూపుకి మొదటిసారి పంపిన మెయిలే 🙂

తన పరిచయంతో పాటు, ఇక్కడి మీటింగ్ కి  వస్తానని పోస్టు చేసారు. నేను చదువుతున్నది కలా, నిజమా అనిపించింది 🙂 నేను ఇక్కడ హైదరాబాదులో మీటింగ్ కి మనుషుల్ని వచ్చేలా చేయడం ఎలాగ అని తలపట్టుకుని కూర్చుంటే, చెన్నై నుంచి ఓ వ్యక్తి హాజరవుతాను అని చెప్పడం వింతే కదా. దానికి తోడు ఇక్కడి మనుషుల్ని మీటింగ్ కి పిలవడానికి చెన్నై నుంచి ఫోన్ చేసేవాడు. అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి అంటే పర్లేదండీ నాకు పడేది ఒక్క రూపాయే అనేవాడు. ఇలా భలే షాకులిచ్చేవాడు 🙂

అలాగే ఝన్ 20, 2007 న వచ్చారు. తిను ఒక్కడే కాదు స్నేహితుడు సత్యక్రిష్ణ ని, తమ్ముడు శరత్ ని కూడా తీసుకొచ్చాడు. ఈ అబ్బాయి ఎప్పుడూ యాక్టివే. యాక్టివ్ లేకపోవడం అంటూ లేదు ఇంతవరకు.

చెన్నై కేసులన్నీ తను చూసినవే. మీటింగ్ కి రాక ముందరే నేను చెన్నైలో ఇతన్ని కలిసాను. నేను, మా తమ్ముడు, సరిత ఇంజంబాకం సాయిపురం వెళ్ళినప్పుడు తినని అక్కడికి రమ్మన్నాను. వేసుకున్న షర్టు ఒక కలరైతే, చెప్పింది ఇంకొకటి. అందుకే వెక్కిరించాను మాకు కలర్ బ్లైండ్ నెస్ తెప్పించాలనుకుంటున్నారా అని 🙂

అరుణ్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ‘వన్ మేన్ ఆర్మీ ‘ అన్నది సరైన పదం. చెన్నైలో మా గ్రూపుకి ఒకే ఒక్కడు  🙂 

మూర్తి

మూర్తి మా గ్రూపులో సైలెంటు సభ్యుడు ఎందుకంటే తను మెయిల్స్ పెద్దగా చెక్ చేసుకోడు. పైగా నేవీ లో ఆఫీసరు. అందువల్ల పెద్దగా అవకాశం ఉండదు.

తిను స్కూల్ రోజుల నుంచి సుందర్ కి పరిచయం. మున్నీకి మంచి స్నేహితుడు. తిన గురించి సుందర్ ఎంతో బాగా చెప్పేవారు. ఆహా అనుకునేదాన్ని.

కానీ పరిచయమైన వెంటనే నాకు నచ్చిన వ్యక్తి మాత్రం మూర్తీ నే. అతని వ్యక్తిత్వం, వృత్తి పట్ల నిబద్ధత, దేశం కోసం ఏమైనా చేయాలి, అందరికీ ఉపయోగపడాలి అనే తత్వం నాకు ఎంతో నచ్చింది.

నేను ఏ మనిషిలోనైనా కళ్ళలో కనిపించే స్వచ్ఛతని చూస్తాను. అతి తక్కువ మందిలో నాకది కనిపిస్తుంది. అలాంటి వారిలో మూర్తి ఒకడు.

ప్రసాద్ చెరసాల గారి ప్రోద్బలంతో మేము చేపట్టిన దుప్పట్ల పంపిణీలో మూర్తి కూడా పాల్గొన్నాడు. దుప్పట్ల మీద గ్రూపు పేరు ముద్రించే విషయంలో మంచి సలహా ఇచ్చింది ఇతనే. అదే మేము ఫాలో అయ్యాము.

తినకి ఎక్కువ సమయం దొరికితే తప్పకుండా మా గ్రూపు కార్యక్రమాల్లో పాల్గొంటారు.