ఆ కొంచెం సేపు —

earthhourcandles.jpg

చీకటిలో, చీకటితో నేను – భూమి ఘడియలో నా ప్రహసనం  

రోజీ వాళ్ళకి రాధిక గారు పంపిన బియ్యపు బస్తాలు, నా పాత దుస్తులు కొన్ని, బ్రైనోవిటా ఆట ఇచ్చేసి మా మామ వాళ్ళింటికి వెళ్ళి పాత బట్టలు తీసుకుని వచ్చేసరికి 6:45 అయింది. మళ్ళీ మెయిల్స్ ఒకసారి చూసుకుని, కొవ్వొత్తులు కొనడానికి వెళ్ళాను.

మేము వాళ్ళకి బాగా పరిచయం. కొవ్వొత్తులు ఎందుకు కొంటున్నానో చెప్పాను. వాళ్ళు ఆసక్తి చూపించరేమో అనుకున్నాను కానీ చాలా కుతూహలంతో విన్నారు. మనమే ఆపేయాలా, ప్రభుత్వం తీసెయ్యదా అని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత మంచి మనస్తత్వమా అని.

గబగబా ఇంటికి వచ్చేసి కొవ్వొత్తులు వెలిగించి, విద్యుత్తు పరికరాలన్నీ ఆపేసాను. ఈ కొవ్వొత్తుల స్టాండులను (తెలుగులో ఏమనవలెను)  కొని చాలా రోజులైనా వాడడం ఆ రోజే. వీటికి ఓ చిన్న కథ ఉంది. వీటిని కార్గిల్ యుధ్ధంలో చిత్రహింసల పాలు బడి వీరమరణం పొందిన కెప్టెన్ సౌరభ్ కాలియా కోసం కొన్నాను. కానీ విమానంలో సామాను బరువుకి కొలబద్దలున్నందున పంపడం వీలు కాలేదు.

తర్వాత ఆకలి వేయడంతో బొప్పాయి పండు కోసాను. అందరూ కొవ్వొత్తుల భోజనం చేస్తే నేను కొవ్వొత్తుల వంట చేసాను. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి, టమాటా కూరకి సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఫోన్ల మీద ఫోన్లు. మా కక్క (బాబాయి) తర్వాత రవి, తర్వాత ఫయాజ్, తర్వాత సురేష్ గారు ఫోన్లు చేసారు.

ఇంతలో మా తమ్ముడు వచ్చాడు. ఇక హింస వాడికి 🙂 ఫోటో తియ్యమని ఒకటే గొడవ.

 eh_prasu2.jpgeh_prasu5.jpgearth-hour_prasu.jpg

అసలు కెమెరా చార్జర్ పోగొట్టుకున్నాను. లేకపోతే కత్తిలాగా వచ్చేవి ఫోటోలు 🙂 జూన్ 15 నాడు చేసే బత్తీ బంద్ లో పథకం ప్రకారం అన్నీ చేస్తాను 🙂

మా కక్క ఫోన్ చేసినప్పుడు విద్యుత్ ఆపేయండి కక్కా అని చెప్తే నేను బస్సులో ఉన్నానమ్మా అన్నారు. తర్వాత విషయం విని, పర్లేదులే మాకు 6 నుంచి 8 వరకు విద్యుత్ కోత ఉండింది. మేము చేసినట్టే లెక్క అన్నారు 🙂

ఫయాజ్ ఏమో వల కార్యాలయంలో ఉన్నాడట మెయిల్స్ చూసుకోవడానికి. నేను చెప్పగానే వాళ్ళ కాలేజీలోని అమ్మాయిలకి, అబ్బాయిలకి ఫోన్ చేసి చెప్పాడట. వాళ్ళు ఆపేసారటా. ఒకమ్మాయి ప్రశ్నలు అడిగిందట. ఎందుకు ఆపేయాలి? ఆపేయడం వలన భూమి వేడెక్కకుండా ఎలా అడ్డుకున్నట్టు అని. తర్వాత చెప్తాను. ముందు ఆపేయండి అన్నాడట. వాళ్ళలో చాలా మంది ఎర్త్ అవర్, భూమి ఘడియని పాటించారట.

మా టిమేడ్ సభ్యులలో రవి, నేను, వాణి భూమి ఘడియని పాటించాము.

నేను బొప్పాయ కాయ (అవును అది పండు కాదు. కాయే 😦 ) కోసినప్పుడు మిగిలిన గింజలు, అలాగే టమాట కూర చేయడానికి అన్నిటినీ తరిగినప్పుడు మిగిలే చెత్త చూసి చెత్తని నిర్వహించే పధ్ధతి బాగుగా చేస్తే ఎలా ఉంటుందా అనిపించింది. మారాలి అని నిశ్చయించుకుంటే మార్చుకోవలసినవి ఎన్నో కదా !!

జూన్ 15 వ తారీఖున మేము బత్తీ బంద్ నిర్వహిస్తున్నాము. బత్తీ బంద్ అన్నది పరిష్కారం కాదు. కాకపోతే ప్రకృతిని మనం ఎన్ని విధానాలుగా నాశనం చేస్తున్నామో తెలుసుకునేందుకు ఒక మొదటి అడుగు. బత్తీ బంద్ కోసమే ఓ కొత్త బ్లాగు మొదలెడ్తాను. మీరందరూ కూడా అందులో పాల్గొనాలని మనవి. మంచి మంచి విభాగాలు పెట్టుకుని రోజూ చర్చించుకుందాము. మార్పు దిశగా ఓ అడుగు ……. కలిసి వేద్దాం, సదాశయ సాధనకై అందరం చేయి కలుపుదాము.

మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ…మీ అందరి బ్లాగుల నుంచి బత్తీ బంద్ బ్లాగుకి లంకె ఇవ్వండి. బత్తీ బంద్ చేసి మీ అనుభవాలు, ఆలోచనలు పంచుకోండి.

ప్రకటనలు

ఎర్త్ అవర్: భూ గ్రహం కోసం ఓ గంట

ప్రపంచ వ్యాప్తంగా 24 నగరాలు ఈ భూమి కోసం ఓ గంట కేటాయించడానికి సంసిద్ధమవుతున్నాయి. మరి ఈ గంట లో వాళ్ళు ఏమి చేస్తారు? విద్యుత్తుని ఆపేస్తారు. రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు వారి వారి ఇండ్లలో విద్యుత్తుతో నడిచే పరికరాలన్నిటినీ ఆపేస్తారు.

దీని వల్ల ఏమవుతోంది. విద్యుత్తు వాడకం వల్ల కొన్ని పరికరాలు వదిలే గ్రీన్ హౌస్ గేసెస్ (ఆకుపచ్చ ఇంటి గాలులు…. :)) ఆ గంట పాటు వెలువడవు. అలాగే మనం ఎన్ని రకాలుగా ప్రకృతిని నాశనం చేస్తున్నాము అన్నది ఆలోచించవచ్చు. అదే విధంగా ఇప్పటికైనా మేలుకుని ఎన్ని రకాలుగా మనం ప్రకృతికి హాని కలగించకుండా జీవించచ్చు అన్నది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.

స్థూలంగా ఆలోచిస్తే మనకు కరెంటు ఆదా అవుతుంది. టి వి రొద ఉండదు కనుక, ఫాను, ఏ సి వగైరాలు ఉండవు కనుక మనం మన కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడుపుతాము. ఆరు బయటకు వచ్చి ఆకాశాన్ని, చందమామని, నక్షత్రాలని చూస్తాము. కలుషితమైన గాలి ఉంటుంది. చెట్లు పెద్దగా కనపడకపోవచ్చు. అప్పుడు మెల్లిగా మన ఆలోచనలు మన బాల్యం వైపు మళ్ళుతాయి. చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తుకొస్తాయి. వర్షాలు కురవాలంటే చెట్లు ఎంత అవసరం. చెట్లు మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. మనకు హానికరమైన కార్బన్ డై ఆక్సైడ్ ని అవి తీసుకుంటాయి.

చెట్లెక్కి ఆడుకోవడం, చెట్ల నీడన సేద తీరడం ఇవన్నీ మన పిల్లలకి మనం అందిస్తున్నామా!! ఈ కాంక్రీట్ జనారణ్యాలలో వృక్షాలకు చోటు లేకుండా చేస్తున్నామా? మన బాధ్యత ఎంత?  ఇలా ఆలోచించవచ్చు.

లేదా కొవ్వొత్తుల వెలుగులో అందరూ కలిసి భోజనం చేయచ్చు. సరదాగా పాటలు పాడుకోవచ్చు. అపార్ట్మెంటులోని సభ్యులందరినీ కూడగట్టి అందరూ పాల్గొనెలా ఏవైనా మంచి కార్యక్రమాలు చేపట్టచ్చు. చీకటి ద్వారా ప్రకృతి కోసం చిరు దీపాలు ఎలా వెలిగించవచ్చు అన్నది ఆలోచించి అమలు జరపచ్చు.

ఏమైనా చేయచ్చు. ఏమి చేసారో మాతో పంచుకోండి. ఓ ఆహ్లాదకరమైన మార్పు దిశగా మొదటి అడుగు వేయండి. ఇవేళ్టి రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు విద్యుత్తు ఆపేయండి.

బత్తీ బంద్

కరెంటు కోత కరెంటు కోత అని వెతలు పడిపోతారు
కల్లబొల్లి కబురులెన్నో చెప్తారు
నాకు మాత్రం కరెంటు కోత
కావాలి రోజూ ఓ పూట
ప్రకృతి చెప్పే సంగతులన్నీ

వినగలిగేది ఈ ప్రశాంత సాయంసంధ్యలోనే

ఇలా ఇంకా ఏవో లైన్లు ఉన్నాయి మర్చిపోయాను. డైరీ కనపడితే వ్రాస్తాను. ఇది స్కూల్లో ఉన్నప్పుడో, కాలేజీ టైములోనో రాసుకున్నాను. వీలైనంత వరకు నేను ఎక్కువ డాబా పైనే గడిపేదాన్ని. (డాబా మీద కూడా ఓ మంచి తవిక వ్రాసుకున్నానండోయి. అద్దేపల్లి గారికి ఓ గొప్ప కవి వ్రాసిన అరుగు అనే కవిత గుర్తొచ్చిందట ఇది చదివి. కొన్ని మార్పులు చెప్పి, అవి చేస్తే ఇంకా బాగుంటుంది అన్నారు).

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే యాంత్రిక నగర జివనం, కనీసం ప్రకృతిని ఆస్వాదించలేకపోవడం, కుటుంబ సభ్యులతో గడపలేకపోవడం ఇలాంటి జాడ్యాలన్నీ కరెంటు వల్ల వచ్చాయనేది నా నిశ్చితాభిప్రాయంగా ఉండేది. ఆ టివి రొద లాగా ఉండేది. (నేను ఇష్టంగా చూసేటప్పుడైతే కాదు 🙂 )

అలా చీకట్లో ఆకాశాన్ని, నక్షత్రాలను చూస్తుంటే అదో అనుభూతి. ఎన్ని ప్రశ్నలొస్తాయని. ఎన్ని ఆలోచనలొస్తాయని. శ్రీశ్రీ గారి మరో ప్రపంచం వేరే అర్థంలో అక్కడే కనిపిస్తుంది. ఏది ధ్రువ నక్ష్త్రం, ఏది అరుంధతి నక్షత్రం, నక్షత్ర సమూహాల ఆకారాలు, అవి వేటినో పోలి ఉండడాలు, పున్నమి రోజుల్లో అయితే చందమామ అందాలు. మళ్ళీ చంద్రుడిలో మనకు కనిపించే దృస్యాలు, గుర్తుకొచ్చే చందమామ కథలు. చిన్నప్పుడెప్పుడో మామని అడిగిన తమాషా ప్రశ్నలు…. చెట్లు నిద్రపోతాయా. నిలుచునే ఉంటే నొప్పెట్టదా, చెట్టు మీద చెట్టు, చెట్టు మీద చెట్టు పేర్చుకుంటూ పోతే ఎప్పటికి ఆకాశాన్ని చేరుకోగలం, నక్షత్రాలను అందుకోగలం అంటూ….

ఇప్పుడు ఏదీ అలాంటి అవకాశం నగరాల్లో. తీరిక లేదు, స్థలము లేదు. పొరపాటున బయటకు వచ్చినా కాలుష్యమే. చెట్లని కొట్టేస్తున్నాము. అన్నిటినీ విధ్వంశం చేసుకుంటున్నాము. కానీ ఆలోచించము. పోనీ వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నామా అంటే అదీ లేదు. ఉద్యోగం, డబ్బు ఇదే ధ్యాస. ఆరోగ్యం పట్ల శ్రధ్ధ లేదు. జన సంబంధాల పట్ల అసలే లేదు. ఏ రకమైన ప్రయోజనం లేదు మన జీవన విధానంలో. ఎందుకిలా. మనం చదువుకున్న వాళ్ళమేనా!!

కేవలం మనం చిన్న చిన్న విషయాల్లో మార్పుకి శ్రీకారం చుడితే ఎలా ఉంటుంది? ఉదాహరణకు నీటిని వృథా చేయకుండా ఉండడం, చెట్లని కొట్టకుండా, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం, మన వాహనాలు కాలుష్యం కలిగించకుండా చూసుకోవడం, వీలున్న చోటికి సైకిలు మీద వెళ్ళడం, మొక్కలు పెంచడం (ఇరుకిరుకు ఇళ్ళల్లో స్థలమేది), పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయకపోవడం.

శ్రధ్ధ పెట్టి ఆలోచిస్తే చాలా చిన్న పనులు. కానీ ఈ చిన్న పనులకే మనం బధ్ధకిస్తాము. వాయిదా వేస్తాము. ఆ తరువాత మనమొక్కటే చేస్తే సరిపోతుందా అని మన అలసత్వాన్ని సమర్థించుకుంటాము. మారాలి, మార్పు రావాలి అని ప్రతి రోజూ అనుకుంటాము. సినిమాకు పోదాము, ఫలానా వస్తువు కొందాము అని చెప్పినంత సులువుగా మనం అందరం కలిసి మంచి పని చేద్దాము అని చెప్పలేము.

నాకు ఎప్పుడూ అనిపించేది. అందరం కలిసి పని చేయాలి. ఏదైనా సాధ్యమే అని. అందరూ స్వచ్చందంగా ఒక రోజు సైకిలు మీద రావడం, లేదా ప్రభుత్వ రవాణా సేవలను ఉపయోగించుకోవడం, ట్రాఫిక్ క్రమబధ్ధీకరణకు మన వంతుగా నిబంధనలు పాటించడం ఇలాంటివి చేస్తే బాగుంటుంది కదా అని. కాకపోతే నవ్వుతారేమో, ఎవరూ సమర్థించరేమో అనే సంకోచం ఉండేది.

సమీర్ వాళ్ళు హైదరాబాదులో ట్రాఫిక్ నియంత్రణకు గాను ముందుగా హై టెక్ సిటీని ఎన్నుకొని అక్కడ విజయవంతంగా పని చేస్తున్నారు. అది తెలిసి సంతోషం కలిగింది. కాకపోతే నాకు డ్రైవింగ్ రాదు కనుక, నేను హై టెక్ సిటీకి ఎప్పుడో తప్ప వెళ్ళను కనుక అందరికీ ఆ ప్రయత్నం గురించి చెప్పడం వరకే నా తోడ్పాటు ఉండింది.

అయితే రాకేష్ రైతుల గురించి చేసిన పరిశోధన, నిగ్గు తేల్చిన నిజాల గురించి సిటిజన్ రిపోర్టర్ అనే కార్యక్రమంలో వస్తుంది చూడమంటే చూసాను. చిత్రంగా ఆ రోజే సమీర్ వాళ్ళ ఇనీషియేటివ్ గురించి కూడా వచ్చింది. ఐతే బత్తీ బంద్ అని ముంబై వాళ్ళు చేయ తలపెట్టిన అంశం నన్ను బాగా ఆకట్టుకొంది. ఇలాంటి ప్రయత్నాల గురించి కూడా ముందుకొస్తున్నారు, ఇలాంటి వాటి గురించి కూడా ప్రయత్నం చేయచ్చు అనిపించింది.

ఇక్కడ హైదరాబాదులో కూడా మనం చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. వెంటనే పక్షుల గ్రూపులోను, మా పిచ్చి గ్రూపులోను (ముద్దుగా అలా అనుకుంటూ ఉంటాము లెండి మేము) మెయిల్ చేసాను.

అలా మొదలైంది ఆలోచన నాలో మళ్ళీ ఈ విషయాలపై. నేను ఎలాగూ బత్తీ బంద్ రోజూ చేస్తాను. ఎందుకంటే నాకు చీకటిలో పడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంతకీ బత్తీ బంద్ అంటే చెప్పనే లేదు కదూ. 

మనమందరం ఒకే సమయంలో ఓ గంట పాటు స్వచ్ఛందంగా కరెంటు ఆపి వేయడం. హైదరాబాదుకి సంబంధించి ఏప్రెల్ 18 వ తారీఖున సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు చేయాలని నిర్ణయించారు.
మరి మీరందరూ సహకరిస్తారు కదూ.  మరిన్ని వివరాలు మరొక టపాలో వ్రాస్తాను. ఇవాల్టికి ఇది.