లోక్ సత్తా - పార్టీ

జయప్రకాష్ నారాయణ్ గారి గురించి స్కూల్లో ఉన్నప్పుడే పత్రికల్లో చదివాము. ఎంతో గౌరవం కలిగింది. లోక్ సత్తా సంస్థకి నెల్లూరులో కూడా శాఖ ఉన్నా నేనెప్పుడూ వెళ్ళలేదు. మన సంకోచాలు మామూలే కదా. ఏదో ఫలాన గొప్ప సంస్థలో సభ్యురాలిని అని చెప్పుకుంటే ఏముంది. మనలో చేవ ఉండద్దు? అనేది నా అభిప్రాయం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం ఇలాంటివి మన వల్ల ఏమవుతుంది, తగ్గమ్మా, తగ్గు అనుకునేదాన్ని.

తర్వాత లోక్ సత్తా అని ఏమి వ్రాసినా కుతూహలంగా చదివేదాన్ని. లోక్ సత్తా రాజకీయ పార్టీగా అవతరించింది అని విన్నాక నాకేమీ వ్యతిరేకత కలగలేదు. మంచిదే కదా అనే అనిపించింది.

మనం విద్య, వైద్యం ఇలా ఏవో సాయం చేస్తున్నాము. ఇలా ఎందుకు చేస్తున్నాము. ఒక వేళ ప్రభుత్వాలు సక్రమంగా పని చేస్తే ఆ అవసరం ఉండేదా! నాయకులు, మంత్రులు నిజాయితీపరులైతే, దార్శనికులు అయితే దేశం ఇలానే ఉండేదా!!

ఒక వైపు రాజకీయాలు బురద అంటున్నాము. బురద, బురద అంటే ప్రయోజనం ఏమైనా ఉందా? పోనీ ఎవరినీ ఎన్నుకోము అంటాము. పాలన ఎలా జరగాలి? వోటు వేయము అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే కొనసాగుతుంది. పోనీ ఎన్నికలే జరపకుండా ప్రస్తుతం ఉన్న పార్టీల సమూహాన్ని ఏలమంటే.. చక్కగా స్వాహా చేస్తారు. కలగూర గంప అవుతుంది. ఈ పధ్ధతులు వేటిలోనూ ప్రజల ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు.

అలాంటి పరిస్థితుల్లో జయప్రకాష్ నారాయణ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం స్వాగతించాల్సిన పరిణామమే కదా. ఆయన ఎంత ఆలోచించకపోతే, ఎంతగా అంతర్మథనం చేయకపోతే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఎంతో గౌరవప్రదంగా ఉండాల్సిన రాజకీయాలను ప్రస్తుత పార్టీలు భ్రష్టు పట్టించాయి. అంత మాత్రం చేత రాజకీయం రొచ్చు అయిపోదు కదా.

ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు అన్నది ఒక వాదన. మరి అలా అనుకుంటే ఆయనకే మెజారిటీ దక్కేటట్టు ఆయన నిలబెట్టిన అభ్యర్థులని గెలిపించవచ్చు కదా. మంచి వారికి ఓటు ఎందుకు వేయకూడదు?

ఇప్పటి వరకు మూడు సభలకు నేను హాజరయ్యాను. ఆరిగా సమావేశ మందిరంలో జరిగినప్పుడు నేను చాలా ఆలస్యంగా వెళ్ళాను. పెద్దగా అర్థం అయినది ఏమీ లేదు అప్పటికే ప్రశ్నొత్తరాలు మొదలైనాయి. తర్వాత ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో జరిగిన సభ కి వెళ్ళాను. ఇక్కడ మాత్రం మొదటి నుంచి వినడం వల్ల చాలా నచ్చింది.

ముఖ్యంగా కొన్ని ప్రశ్నలకి ఆయన జవాబులు చాలా బాగా నచ్చాయి.

తెలంగాణా అంశము:

ప్రపంచంలో మన రాష్ట్రాల కన్నా చాలా చిన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ప్రజల కోరిక అయిన పక్షంలో దానికంటూ కొన్ని విధి విధానాలు ఉంటాయి. వాటి ప్రకారం ముందుకు సాగి, ప్రజాభిప్రాయం అదే అయితే రాజ్యాంగ నిబంధనలకు లోబడి అమలు జరపవచ్చు. కానీ దాన్ని ఓ రాజకీయ అస్త్రంగా చేసుకుని అవసరానికన్నా ప్రాధాన్యం ఇవ్వడం అనవసరం. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నవే అన్ని పార్టీలూను.

ఈ సమాధానం బట్టి నాకేమి అనిపించిందంటే… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా నష్టం లేదు. కాకపోతే ఎన్నికల అంశం చేయాల్సిన అవసరం లేదు. ఒక వేళ లోక్ సత్తా కూడా మాట్లాడవలసి వస్తే దానికి ఎన్నికల అంశం స్థాయి కల్పించినట్టే అవుతుంది కదా. కానీ ఈ పత్రికల వాళ్ళు పని గట్టుకుని మరీ పదే, పదే ఈ ప్రశ్న అడగడం చేస్తుంటాయి. ఏదో ఒక సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి. ఇస్తే దాన్ని కూడా రాజకీయ అస్త్రం గా మలుచుకుంటారు. ఇవ్వకపోతే నాంచుతున్నారు అంటారు. వీళ్ళకి పని లేదు. మరొకరిని పని చేసుకోనివ్వరు.

రిజర్వేషన్లు:

రిజర్వేషన్లు ప్రస్తుత పధ్ధతిలో దొరికేది ఎవరికి? కలెక్టర్ల కూతుర్లకి, మినిష్టర్ల కొడుకులకి. అంతే కానీ నిజమైన పేద వారికి ఎంత మందికి దక్కుతున్నాయి? అందరిలాగా అవకాశాలు లేని వారికి తప్పకుండా రిజర్వేషన్లు ఉండాలి కానీ వాటికీ కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. పై చదువులు చదివే అవకాశం కల్పించాలి. మన దేశంలో కుల వ్యవస్థ కాదనలేని సత్యం. అలాంటప్పుడు పుట్టుక భవిష్యత్తుని, జీవన విధానాన్ని గిరిగీసి నిర్దేశిస్తుంటే తప్పక అలాంటి వారికి సహాయం అందాలి. ఆర్థికంగా స్థోమత లేకపోవడం అన్నది ముఖ్య ప్రాతిపదిక కావాలి.

చిరంజీవి:

కాంగ్రెస్ , తెలుగుదేశం , టి ఆర్ ఎశ్ లను ఎలాగ ఎదుర్కొంటారో అలాగే ఈ పార్టీ కూడా. ఎవరితో పొత్తు అయినా సైద్ధాంతికంగా జరగాలి. లోక్ సత్తా పార్టీ విధి విధానాలు, విలువలు ఏమిటన్నది అందరికీ విశదమే. అలాంటప్పుడు అవి నచ్చి చిరంజీవి చేతులు కలపడానికి ముందుకు వస్తే వద్దనేది లేదు. అలా కాక అధికారమే ప్రాతిపదిక ఐతే చేయగలిగింది లేదు.  లోక్ సత్తా పార్టీకి విలువలతో మాత్రమే సంబంధం, అధికారం కేవలం ఆ విలువలని రాజకీయాల్లో చొప్పించేందుకు, ప్రజల్లో రగిలించేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. చేతులు కలపడమా లేదా అన్నది చిరంజీవి చేతుల్లోనే ఉంటుంది.

ఓటరు మనోగతం:

ఒకానొక సందర్భంలో మా మేనేజరు ఒకాయనతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నికల అంశం ప్రస్తావనకి వచ్చింది. మీరు ఎవరికి ఓటు వేస్తారు అని అడిగితే ఒక పార్టీ పేరు చెప్పారు. లోక్ సత్తా పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుంది కదా. మరి దానికెందుకు వేయరు అని అడిగాను. నాకు ఆయనంటే చాలా గౌరవం, నమ్మకం కూడాను. వెళ్ళి కలవాలని కూడా అనుకున్నాను. కుదరలేదు. కానీ ఆయన గెలవడం చాలా కష్టం. ఫలానా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోను ఈ సారి గెలవకూడదు కాబట్టి దానికి బలమైన ప్రత్యర్థికి నేను ఓటు వేస్తాను అన్నారు.

మరి అందరూ మీ లాగే అనుకుని లోక్ సత్తా కి ఓటు వేయాలి అని కూడా వేయకపోతే ఏమవుతుంది? ఓ మంచి వ్యక్తి, రాజకీయాలను ప్రక్షాళన చేయాలని ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఓడిపోతే ఎలా అని అడిగాను. నిజమే కావచ్చు అన్నారాయన. ఈ అంశం నేను లోక్ సత్తా పార్టీ దృష్టికి తీస్కువెళ్ళాలి అనుకున్నాను. ఈ మెజారిటీ ఆలోచనా ధోరణి, మూస ఓటింగ్ సరళిని అడ్రస్ చేయంది అని చెప్దాము అనిపించింది. నా వరకైతే నేను నాకు నచ్చిన వారికి ఓటు వేస్తాను. గెలుస్తారా, లేదా అన్నది తర్వాత విషయం. నా నమ్మకం ప్రకారం నేను ఓటు వేసానా లేదా అన్నదే నాకు ముఖ్యం.

జయప్రకాష్ నారాయణ్ గారు సరిగా ఈ అంశాన్నే ప్రస్తావించారు. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము అని ఒక వ్యక్తి అడిగితే….. ముందు ఓటు వేయండి అది చాలు అన్నారు.

దోచుకుతినే పార్టిలకి ఇచ్చే అవకాశం, దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడ్డ వ్యక్తికి ఇస్తే ఏమైంది? ఆయన అనుకున్నది చేస్తారా లేదా అన్నది తర్వాతి ప్రశ్న. అసలంటూ అవకాశం ఇస్తున్నామా, లేదా? ఇవ్వాలా, వద్దా?

ఆయనే అన్నారు….. మీరు అందరిలానే మారతారు అన్నవారిని ఒప్పించడానికి కొంత సమయం పడుతుంది అని నాకు తెలుసు. ఇప్పుడు మేము నిరూపించుకున్నాము. అంబుడ్స్మన్ చేత ఆడిట్ చేయిస్తున్నాము. ప్రతి విరాళానికి నూరు శాతం పన్ను రాయితీ ఇస్తున్నాము. వెబ్ సైటులో కూడా వచ్చిన విరాళాలు, వాటిని ఎలా వినియోగిస్తున్నామన్న వివరాలు పొందుపరిచాము. రహస్య బ్యాలెట్ ద్వారా అభ్యర్థులను నిర్ణయిస్తున్నాము. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నాము అని.

5 Responses to “లోక్ సత్తా - పార్టీ”

  1. బాగా చెప్పారు. దాదాపు ఒక ఏడాది క్రితం నేను కూడా ఇదే అంశం మీద ఒక లేఖ ని నా బ్లాగ్ “తెలుగులేఖ” లో వ్రాశాను. నా ఉద్దేశం ప్రకారం అప్పటికీ, ఇప్పటికీ జనాల ఆలోచనలో ఏమాత్రం మార్పులేదు. అయితే తెలుగు దేశం లేకపోతే కాంగ్రేస్. ఇద్దరూ మార్చి మార్చి రాష్టాన్ని దోచుకు తింటున్నారు. జనాలు, లోక్ స త్తా లాంటి పార్టీలవైపు ఎందుకు చూడరో? క్రితం ఏడాది నేను మొదటి సారి బ్లాగ్ రాసినప్పుడు, మరో రెండేళ్ళలో చాలామంది కి దగ్గరవుతుందని అనుకున్నాము. కానీ ఇప్పుడు చిరంజీవి పార్టీ పెడితే? నిన్నటి దాకా జై లోక్ సత్తా అన్నవాళ్ళంతా ఏంమంటారో?

  2. ప్రశాంతి గారు,
    లోక్ సత్తా సభలకు మీరు వచ్చినందుకు అభినందనలు. నేను కూడా మీ లాగే, ఆగస్ట్ 9,2006 రోజు పార్టీని ప్రకటించగానే, ఫోన్ చేసి అభినందించాను. ఫలానా రోజున పంజగుట్టలోని పార్టీ(పాతది. ఇప్పుడు ఆదర్శ్ నగర్ స్లం ఏరియాలో ఉంది) ఆఫీస్ లో మహిళల సభ ఉందని ఆహ్వానించారు. జె.పి వస్తారని చెపితే బోలెడన్ని ప్రశ్నలు వేయాలని వెళ్ళాను. కానీ ఆయన రాలేదు. వర్మ గారు, మనోరమ గారు వచ్చారు. మనోరమ గారు బాగా మాట్లాడతారు. నేను కూడా కాసేపు మాట్లాడాను. వచ్చిన అందర్నీ పార్టీలో చేరమని ఆహ్వానించారు. నాకు ఖాళీ సమయం ఉంది కదాని సరే అన్నాను.

    లోక్ సత్తా నిజంగా మిగతా పార్టీలకు భిన్నంగా పని చేస్తుందనే నేనూ అనుకునాను. సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం, నా టైం చాలా వెచ్చించాను. అందుకు విచారించటం లేదు, కాని తరువాత జరిగింది చూడండి. పార్టీ కోసం పని చేస్తున్న కొంతమందికి జె.పి గారి చేతనే సభ్యత్వం ఇప్పించారు కూడా!

    తర్వాత, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరిగినపుడు, పదేసి రూపాయలు కట్టి సభ్యు లుగా (కేవలం జె.పి గారి పేరు మహిమతో) చేరిన వేలాది మందికి కొంచెం కూడా సమాచారం ఇవ్వలేదు.

    రాను రాను నాకు, నాతో పాటు ‘నిజంగా’ పని చేయడానికి వచ్చిన మరికొంతమందికి అర్థం ఆయిందేమిటంటే…లోక్ సత్తా పార్టీ అనేది ‘వన్ మాన్ ఆర్మీ’అని.

    జె.పి గారి ప్రసంగం వింటుంటే రక్తం ఉరకలెత్తడం ఖాయం! కానీ, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళడం విషయంలో జె.పి తో సహా సీనియర్లు అందరూ విఫలమయ్యారని చెప్పడానికి సాహసిస్తున్నాను. ఒక పాలసీ లేదు. దాని మీద ఏకాభిప్రాయం అంతకంటే లేదు.

    ముఖ్యంగా, జనంలో ఉన్న అభిప్రాయం ఏమిటంటే’ లోక్ సత్తా ఒక స్వచ్చంద సంస్థ గా ఉంటేనే బాగుండేది అని.ఎందుకంటే, స్వచ్చంద సంస్థగా ఉన్నప్పుడు ఎన్నికల విషయంలో, వోట్ల విషయంలో జనాన్ని ఎంతో జాగ్రుతం చేసిన లోక్ సత్తా, పార్టీ గా అవతరించాక ఏమి చేసిందో, సాధించగలిగిందో వారినే అడగండి!

    పార్టీలో ఉత్సాహంగా చేరిన చాలా మంది ఉద్యోగులు, విద్యార్థులు. ప్రతి సమావేశానికి వారు రాలేరు.(సగం మందికి ఇంటిమేషనే ఉండదు)

    ఇక అన్నిటినీ మించి, చిరంజీవి, తెలంగాణా అంశాలు అంతంత మాత్రంగా ఉన్న పార్టీ చరిష్మా ని తప్పక దెబ్బ తీస్తాయి.

    ముందు పార్టీని జనంలోకి తీసుకెళ్ళే బలమైన వ్యూహం లోక్ సత్తాకి కావాలి. కేవలం జె.పి ని చూసి ఓట్లెయ్యమంటే, పల్లెల్లో ఎలా పడతాయి? గ్రమాల్లో జె.పి అంటే ఎవరో, ఏమిటో అందరికీ తెలియాలంటే వీళ్ళూ చాలా చెయ్యలి. రెండేళ్ళుగా ఏమీ చేయకుండా..ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాక ఏమి చెయ్యగలరు?

  3. సుజాత గారు,

    మీరు అనుభవం మీద చెప్పారు. పైగా అభిమానం వల్ల కలిగిన ఆవేదనతో చెప్పారు. కానీ ఒకటండి. బాలారిష్టాలు అన్నిటిలోను ఉంటాయి. అంత మాత్రం చేత మనం దూరమైపోతే ఎలా? మీరు జె.పి. గారికి ఉత్తరం వ్రాయాల్సింది. లేదా మీరు పరిశీలించినవన్నీ ఆయన ముందు నిర్మొహమాటంగా చెప్పవలసింది. పార్టీ కార్యకర్తలకి ఆయన తప్పక సమయం వెచ్చించాలి కదా.

    నేను లోక్ సత్తాలో చేరను. ఏ పార్టీలోనూ చేరను. కాకపోతే బయట నుంచి మద్దతు ఇస్తాను :) చిరంజీవి, తెలంగాణా అంశాలు ప్రభావితం చేస్తే చేయనివ్వండి. అసలు వాళ్ళు వ్యూహాత్మకంగా ఆలోచించి లోక్ సత్తాతో పొత్తు కుదుర్చుకున్నా బానే ఉంటుంది. క్లీన్ స్వీప్ చేయచ్చు.

    మీరు లోక్ సత్తా అభిమానిగా, ఒకప్పటి కార్యకర్తగా చేయవలసిన మొట్టమొదటి పని జె.పి. గారిని వ్యక్తిగతంగా కలవడం.

    చక్స్ గారు, చిరంజీవిని చూసి లోక్ సత్తా కి ఓట్లు వేయాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మారతారంటే నేను నమ్మలేను.

  4. ప్రశాంతి గారు,

    జవాబు మీ టపాలోనే ఉంది. జె.పి. కార్యకర్తల కోసం తగినంత సమయం వెచ్చించలేరు. వాస్తవిక ద్రుష్టితో ఆలోచించడానికి అలవాటు పడిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి( ఒకర్ డాక్టర్, మరొకర్ బిజినెస్ ఉమన్ )జె.పి గారి అపాయింట్మెంట్ సంపాదించాము లెండి. ఆ రోజు ఆయన తనకు బదులు పార్టీ లోని సీనియర్ ఒకావిడ తో మాట్లాడమని చెప్పి (సడన్ గా) ఎక్కడికో వెళ్ళారు.

    ఇన్ని మాటలెందుకు లెండి, మేము ఘోరంగా నిరాశ చెందాము. జె.పి గారు మాట్లాడినపుడు ‘అవును, ఇది నిజంగా జరిగి తీరుతుందీ అని అనిపిస్తుంది. కానీ, పార్టీలోనే ఆ పరిస్తితి లేదు. ‘మాది కూకట్ పల్లి గ్రూపు, మాది ఎల్బీ నగర్ గ్రూపు అంటారు తప్ప, అందరూ కలిసి పని చేయాలని అనుకోరు. బయటి నుంచి చూస్తే, జె.పి గారి ఉత్తేజ పూరిత ప్రసంగాలు తప్ప ఇంకేవీ కనపడవు. మొదటి రోజు 150 మంది స్త్రీలు (ఉన్నత విద్యావంతులైన వాళ్ళు కూడా) జె.పి గారి ప్రసంగాలు విని వచ్చారు. ఇవాళ చాలా కొద్ది మంది (డబ్బు బాగా ఉండి, ఇంతి దగ్గర పనేమీ లేని వాళ్ళు) ఉన్నారని మాత్రం తెలుసు.

    పైగా, సంగతి తేల్చుకుందామను కున్నా, మేము బెంగళూరు వచ్చెయ్యడం వల్ల వీలు కాలేదు.

  5. sujatha garu, meeru cheppina chaala vishayalato nenu yekeebhavistunnaanu. kevalam jp gari uttejapoorita upanyasaalaku choosi janam votlu vestaaranukovatam yenta bhramo lok satta lo pani chestunnavaariki ippudippude anubhavam loki vastondi. denikaina konta time padutundi. idi correct time anukuntunnaanu. maarpu anedi anivaaryam. yevaraina paristhitulaku anugunamgaa maari teeralsinde. daaniki lok satta, janam dooram kaadu.

Leave a Reply