సేవ – సగటు మనిషి

 ఈ వ్యాసం నవంబరు 2007 భూమిక సంచికలో ప్రచురింపబడింది. భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారికి కృతజ్ణ్జతలతో.
భూమికలోని నా వ్యాసానికి లంకె.
 ========

అనామకం

నా అస్థిత్వాన్ని నేనెందుకు వ్యక్తపరచనో తెలుసా?

నాలోని భావనా వీచికలు, ఆలోచనా ప్రవాహాలు
నా ఈ కవితలు
అవి ఇంతవరకు అక్షర రూపమే దాల్చాయి
ఇంకా ఆచరణ మార్గం పట్టలేదు
ఆశయదీపం వెలిగించలేదు
అలా జరిగిన రోజున,
సగర్వంగా ప్రకటిస్తాను
నేనే ఈ కవితలు వ్రాసానని
మహదానందంగా మనవి చేస్తాను
నేనే ఈ ఆలోచనలు చేసానని
ప్రస్థానం

ఒకప్పుడు
ఆవేశం అక్షరాలు ఒలికించేది
ఆవేదన కాగితంతో గోడు వెళ్ళబోసుకునేది

ఇప్పుడు
ఆవేశం, ఆవేదన …. ఆలోచనగా మారాక
ఆచరణ మార్గం పట్టాక
రాయడానికి ఊసులు లేవు
చేయడానికి పనులు తప్ప

————

ఎందరో మహానుభావులు. వయసులోనూ, జ్ణ్జానంలోను, అనుభవంలోను ఏ మాత్రం సరిపోలని నేను నా భావాలు పంచుకోవడం ఓ దుస్సాహసమే. కాకపోతే బలహీనత కూడా ఓ పాఠమే. నేను ఓ సగటు మనిషికి ప్రతినిధిని కాబట్టి, సదరు సగటు మనిషికి ఉండే అన్ని అవలక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి, నేను తెలుసుకున్న విషయాలు సగటు మనుషులను స్పందింపచేస్తాయి అనే.

ఎంత స్వార్ధ పరుడైనా సంఘంలో జరిగే వాటికి అతీతంగా మనలేడు. సామాన్యులకి సంఘంలో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి….. పత్రికల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా. ఈ రోజుల్లో మనం నిత్యం చదివేవి ఏంటి? హత్యలు, మానభంగాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం మొదలైనవి. ఎవరు మంచో, ఎవరు చెడో కూడా అర్థం కాని వైనం. మన నీడను చూసి మనమే ఉలికిపడే కాలం. పుస్తకాల్లో చదువుకున్న వాటికి, ప్రత్యక్షంగా జరిగే వాటికి ఎక్కడా పొంతన ఉండదు. ఆవేశం కలుగుతుంది. ఏదో చేయాలనిపిస్తుంది. ఏమి చేయాలో అర్థం కాదు. ఎంత ఆలోచించినా పరిష్కారాలు తోచవు. అప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయత ఆవేదనని కలిగిస్తుంది.  కానీ ఆవేశం లేదా ఆవేదన ద్వారా కలిగే ఉద్వేగం చల్లారాలి కదా… ఎలా…… అలా మొదలయ్యేవే కవితలనబడే తవికలు. ఏవో పిచ్చి రాతలు.

రాసాక ఇక ఊరికే ఉండం కదా. అందరికీ కాకపోయినా అభిరుచులు కలిసిన వాళ్ళకు చెప్తాము. అరే పత్రికలకు పంపించచ్చు కదా అని తోటి వాళ్ళ సలహాలు. చెట్టు లేని చోట ఆముదపు చెట్టు అనే సామెత ఏమిటో బాగా అనుభవంలోకి వస్తుంది. ఏమీ చేయలేకపోతున్నామే అనే నిస్సహాయతలోంచి జనించిన వాక్యాలు ప్రచారం కోసం కాదు కదా. ఆచరణ లేని ఆలోచన కానీ, ఆవేశం కానీ ప్రయోజనమేమిటి? అందులోనూ వీలైనంతవరకు తమలో తామే ముడుచుకుపోయే స్వభావం కలవారికి పిరికితనమే కానీ, ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది? కేవలం పదాడంబరమే అయితే రాజకీయనాయకులు బాగా ప్రగల్భాలు పలకగలరు కదా.

సరే మరి పిరికివారు దేనికీ పనికిరారా? వారి దేశభక్తి ఎందుకూ కొరగానిదేనా? సమాజానికేమీ ఉపయోగపడలేరా? ధర్నాలు, పోరాటాలు చేయలేని వారు, ఇది అన్యాయం అని ఎలుగెత్తి అరిచే చేవలేని వాళ్ళు, చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు అనే గాంధీ గారి మర్కట సిధ్ధాంతాన్ని అనుకూలంగా వాడుకునేవారు…… మరి ఏమి చేయాలి? వేరే మార్గమే లేదా? ఎంతో అంతర్మథనం. పోనీ హింసా మార్గం సరైన మార్గమేనా? బస్సుల్ని తగులబెట్టి, రైళ్ళను, టెలిఫోను బూతుల్ని పేల్చేసి, అడపా దడపా బాధ్యులైన వారిని చంపేస్తే ప్రయోజనం సిద్ధించిందా…లేదే? మరి ఏది సరైన మార్గం. సగటు బతుకు వెళ్ళదీస్తూనే సమాజానికి ఉపయోగపడలేమా? ఓ మంచి మార్పుని ఆశించలేమా? కనీసం కొన్ని తరాల తర్వాతైనా తరింపచేసుకోలేమా?

మథన పడగా, పడగా….ఎప్పుడో చదివిన ఓ చిన్ని కథ గుర్తుకొచ్చింది. చీకటి లో చిరుదివ్వెలా వివేకపు వెలుగు విరజిమ్మింది. చిన్న గీత. పెద్ద గీత. పెద్ద గీతను చెరపకుండ దాన్ని చిన్నది చేయాలంటే ఏమి చేయాలి? దాని పక్కన మరో పెద్ద గీతను గీయాలి. అంటే. చెడు ప్రస్తుతం పెద్ద గీత. కానీ దాన్ని పట్టించుకోలేనంత చిన్నది చేయాలంటే మంచిని అంతగా పెంచాలి. ఎలా సాధ్యం. ఏ ఒక్కరితోను సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ ‘నేను సైతం’ అని తమ వంతు పాత్ర నిర్వహించేలా ఉత్తేజం కలిగించాలి. పక్కవాడి సంగతి దేవుడెరుగు తమ గురించి కూడా తాము పట్టించుకోలేనంత ‘బిజీ’ జీవితాల్లో మునిగిన వారితో ఎలా సాధ్యం!!

సాధ్యమే. ముందు వారికి సమాజ సేవ అంటే ఉన్న అపోహలను తొలగించాలి. సహజంగా ప్రతి ఒక్కరికీ, ఎంత దుర్మార్గులైనా సరే తోటి వారికి (ఆ తోటి వారు దుర్మార్గులే కావచ్చు) సహాయం చేయాలనే ఉంటుంది. ప్రతి మనిషిలోను పరోపకార చింతన ఉంటుంది. విడ్డూరంగా అనిపించినా సరే. అందుకే గదా పగ వారికి కూడా ఈ బాధ వద్దు అనే పద ప్రయోగం ప్రతి ఒక్కరిలోను నానుతోంది.

తమ దగ్గర సమయం లేదని, స్థిరత్వం లేదని, కొంత ఆస్థి వెనకేసాక, బాధ్యతలను తీర్చుకున్నాక అప్పుడు తీరికగా పక్కవాళ్ళ గురించి ఆలోచిస్తామని అనుకుంటూ ఉంటాము. సేవ అన్నా, మార్పు అన్నా ఓ సమస్యను మొత్తం కూకటివేళ్ళతో సహా పెకిలించగలిగితేనే ప్రయోజనం అనుకుంటాము. ఆ పని ఎలాగూ చేయలేము కాబట్టి ఇక ఆలోచించడమే అనవసరం అన్న ధోరణిలో ఉంటాము.

అయితే కొంచెం సమయం కేటాయించగలిగితే, ఎంతమందితో చేతులు కలిపితే అంతటి మార్పుని తేగలమని అనుకోము. ఏదీ సాధ్యం కాదు అన్న భావనని నరనరాన జీర్ణించుకుని ఉంటాము. నిరాశా, నిస్పృహలో ఉన్నవారికి ఓ ఓదార్పు, ఓ పలకరింపు, ఓ చిరునవ్వు కూడా ఎంతో సాంత్వన నిస్తాయని అర్థం చేసుకోలేము. కొద్దో, గొప్పో తపన ఉన్నా, మనమొక్కరమే ఏమి చేస్తాములే అనే నీరసం పని మొదలెట్టకముందే ఆవహించేస్తుంది. ఓ సినిమాకి రమ్మని బలవంతం చేసినంతగా ఓ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో, ఓ చర్చావేదికకో, ఓ సమావేశానికో పిలవడానికి ధైర్యం చేయం. ఏదో సంకోచం. ఎక్కడలేని సందేహం.

ఈ బాలారిష్టాలన్నీ దాటి మన మనసుకి నచ్చినదేదో చేస్తామా, భేతాళ ప్రశ్నలు, భూతద్దపు పరిశీలనలు, ఉచిత సలహాలు, అనుచిత వ్యాఖ్యానాలు. ఈ పనే ఎందుకు చేసావు? ఆ పనెందుకు చేయలేదు? ఫలాన అంశం అయితే ఇంకా ప్రయోజనం ఉంటుంది. వ్యక్తులకు ఉపయోగపడే పనులు కాదు, సమూహాలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఇది ఇలా చేసి ఉండచ్చు కదా. అలా చేసి ఉండచ్చు కదా.. సమస్యకు స్పందించని వారు సహాయానికి మాత్రం విపరీతంగా ప్రతిస్పందిస్తారు.  నాకెందుకొచ్చిన గొడవరా భగవంతుడా అని సహాయం చేసేవారికి అనిపించేంతగా. 

అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అలా చెప్పేవారెవ్వరూ ఉబుసుపోక చెప్పరు. రకరకాల కారణాలు ఉంటాయి. వారి వారి భావజాలాన్ని మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే వారు చెయ్యాలనుకునేవి వివిధ కారణాల వల్ల చేయలేక చేసే వారి ద్వారా చేయించాలని చూస్తారు. ప్రతి ఒక్కరికీ తాము వెళ్ళేదే సరైన మార్గమని, ఇతరులు సమయాన్ని వృధా పరుస్తున్నారని అనిపిస్తుంది. కాబట్టి సహజంగానే మనకు ‘ సరైన ‘ దిశా నిర్దేశం చేయాలనుకుంటారు.

వినేవారికి, చెప్పేవారికి కూడా ఓ సలహా. చెప్పేవారు ఎలా ఉండాలంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి వదిలేయాలి. అంతే కానీ ఫలానాది తప్పు, ఫలానాది ఒప్పు, ఇదే చెయ్యాలి, అదే చెయ్యాలి అని చెప్పకూడదు. ఏమవుతుంది? అసలేమీ చేయకపోవడం కన్నా, ఏదో ఒకటి చేయడం మంచిదే కదా. హృదయపూర్వకమైన, నిబద్ధత కలిగిన ఏ ప్రయత్నం వృధా పోదు, ఫలితమెలా ఉన్నా సరే. ఏదో ఒక జీవిత సత్యం తెలుస్తుంది. అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠం కలకాలం గుర్తుంటుంది.

ఇలా చేస్తే అలా జరుగుతుంది అనే అంచనా నిజమే కావచ్చు. కానీ స్పందన మాత్రం ఎప్పుడూ ఒకేలాగ ఉండదు. ఉదాహరణకు ప్రార్థనాస్థలాల్లో పేలుళ్ళ విషయమే తీసుకుందాము. అది ఏ మతం కి సంబంధించినదైనా బాంబులు పేలుతాయి. నష్టం జరుగుతుంది. కానీ ఫలితం? ఆ దుశ్చర్యలకు పాల్పడ్డవాళ్ళు కోరుకున్నట్టుగా మత ఘర్షణలైతే చెలరేగవు కదా. ఒకరిని ఒకసారి మభ్యపెట్టవచ్చు, ఇద్దరిని రెండు సార్లు, ముగ్గురిని మూడు సార్లు. అంతే కానీ అందరినీ ఎల్లవేళలా మభ్యపరచడం, మత్తులో జోగేలా చేయడం ఎవరూ చేయలేరు. పని, ఫలితం ఒకటే అయినా పర్యవసానాలు, ప్రతిస్పందనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.

అలాగే వినేవారు కూడా ‘ వినదగు నెవ్వరు చెప్పిన ‘ అన్నట్టుగా ఎవరేమి చెప్పినా విని, అలా ఎందుకు చెప్తున్నారా అని ఆలోచించాలి. నిర్ణయం మాత్రం తామే తీసుకోవాలి. మన లక్ష్యాలు, చేసే పనుల పట్ల మనకు స్పష్టమైన అవగాహన ఉంటే చాలు. ఆధ్యాత్మిక వాదమైనా, భౌతిక వాదమైనా, హేతువాదమైనా ఏదైనా ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అనే గా చెప్తుంది. మనమేమిటో మనకు తెలిసినంత కాలం నిరుత్సాహ పడవలసిన అవసరం లేదు.

ఓ చిత్రకారుడు బొమ్మ వేస్తుండగా చూసి అరే పిచ్చి గీతలు గీస్తున్నావు అంటే, అతను కూడా అవునా అనుకుని సందేహంలో పడితే తాను కోరుకున్న రూపాన్ని సృష్టించలేడు. అలా కాకుండా ప్రశాంతంగా తన పని తాను చేసుకు పోతే తన స్వప్నాన్ని నిజం చేసుకోగలుగుతాడు, తనలోని తృష్ణని తీర్చుకోగలుగుతాడు. ఎవరైనా చేయవలసింది అదే. ఒక పని తక్కువ, మరో పని ఎక్కువ కాదు. చేయి, చేయి కలిపితే ఏదీ అసాధ్యము కాదు. ఓ మంచి పని చేయబూనితే మొదటి అడుగు మాత్రమే మనం వేయాల్సింది. మిగతా అడుగులు వాటంతట అవే పడతాయి. మొదటి అడుగు మాత్రమే ఒంటరిదవుతుంది. రెండో అడుగునుంచి మరి కొన్ని పాదాలు జత కలుపుతాయి. అయితే ఏ క్షణమైనా మన అడుగు మాత్రమే మిగిలే ఆస్కారం ఉంది. అప్పుడు కూడా నిశ్చలంగా అడుగులు వేస్తూనే ఉండాలి. అప్పుడే ఆ ప్రస్థానానికో అర్థం చేకూరుతుంది. ఇదంతా పుస్తక పరిజ్ణ్జానం కాదు. ఆచరణ మార్గం నేర్పిన అనుభవ పాఠమే.  

Your Comments and Suggestions Enhance Our Work. Do Share Your Opinion.