ఆదర్శం

శ్రీ రామకృష్ణ పరమహంస ఓ సారి నదిలో స్నానం చేస్తుండగా ఓ తేలు నీళ్ళలో మునిగిపోవడం చూశారట.

అయ్యో పాపం కదా అని దానిని రక్షించడానికి చేతిలోకి తీసుకున్నారుట. గట్టు మీద పెట్టే లోపల అది ఆయనను కుట్టి మళ్ళీ నీళ్ళలోకే పడిపోయిందట. ఇలా జరుగుతూండగా ఒకతను చుసి, ‘అదేమిటండీ ఆ తేలు మిమ్మల్ని అంతలా కుడుతున్నా మీరు దాన్ని రక్షించాలని చూస్తున్నారు ! ‘ అని అడిగాడట.

శ్రీ పరమహంస ఇలా చెప్పారుట – కుట్టడం తేలు స్వభావం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా అది తన నైజాన్ని మార్చుకోలేదు. అలాంటప్పుడు దానికి మంచి చేయకపోతే నేను మనిషినెలా అవుతాను! మన నైజాన్ని వదులుకోకూడదని ఈ తేలు నాకు నేర్పింది. అందుకే ఇది కుట్టినా నేను దీనికి సహాయమే చేస్తాను ‘.

పేద వారికి, నిస్సహాయులకి సాయం చేయాలనే ప్రయత్నంలో కొంతమంది మనలను ఉపయోగించుకోవాలి, లేదా డబ్బులు పొందాలి అనే ఆలోచించచ్చు. అంత మాత్రం చేత, మనం సాయం మానుకోకూడదు. వీలైనంత జాగ్రత్త వహిస్తూ, వారు మనల్ని మోసగించే అవకాశం కల్పించకుండా సహాయం చేయాలి. అంతే కానీ మొదలంటూ మానకూడదు. ఈ విషయంలో మన భారత న్యాయ వ్యవస్థ స్ఫూర్తి కావాలి. వంద మంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు. కానీ ఓ నిర్దోషికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడకూడదు.

అలాగే సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. వారి వారి అనుభవాల దృష్ట్యా ఒకలాగా ప్రవర్తించవచ్చు. అది మనకు ఇబ్బంది కూడా కలిగించవచ్చు. అంత మాత్రం చేత సాయం చేయడం మానకూడదు. మన ఉద్దేశ్యాలను వ్యక్తపరుస్తూ, ఇబ్బంది కలిగించే అవకాశాన్ని కల్పించకుండా సాయం చేయాలి.

ఏ కారణం కూడా మనల్ని మన లక్ష్యం నుంచి దృష్టిని మరల్చనీయకూడదు. సేవామార్గం నుంచి తప్పుకునేటట్లు ప్రేరేపించకూడదు.

3 స్పందనలు

  1. బాగుంది. కానీ, మన న్యాయ వ్యవస్థ, పది మంది దోషులకు శిక్ష వేసే బదులు ఒక్కరికే శిక్ష వేస్తోంది. ఒక నిర్దోషికి శిక్ష ఎలా పడకూడదో, అలాగే, ప్రతీ దోషికి శిక్ష పడి తీరాలి. అది మన భారత దేశంలో జరగట్లేదు.

  2. చక్కగా చెప్పారు, ఏవో కారణాలు చూపి తనలోని నెగటివ్ నైజాన్ని సమర్ధించుకోకుండా!

    @రాజారావు గారు: ప్రతీ నిర్దోషికీ కోర్టు చుట్టూ తిరగడమనే శిక్ష తప్పదు కదా! ప్చ్..

  3. బాగా చెప్పారు. మంచి పాఠం. మనసుకి పట్టించుకోవలసిన పాఠం.

ప్రత్యుత్తరమిమ్ము