జీవితంలో ఎప్పుడూ ఈ పదాన్ని గురించి ఆలోచిస్తానని నేను అనుకోలేదు. అవినీతి అన్నది వేళ్ళూనుకున్న వ్యవస్థ దీనిని మనమేమీ చేయలేము అనే అభిప్రాయమే నాది.
చాన్నాళ్ళ క్రితం నా రెండో నెట్ స్నేహితుడు, కుమార్ రెడ్డి గారు, http://indiaeyewitness.com/ అనే వెబ్ సైటు ప్రారంభించారు. నన్ను ముఖ్య భూమిక పోషించమని అడిగారు. వ్యాసాలు వ్రాయమని కోరారు. నేను చేయలేదు. ఒకానొక దశలో ఆయనకు కోపం కూడా వచ్చింది, ఓ స్నేహితురాలిగా నేను ఏమీ సాయం చేయడం లేదని.
కానీ నేనేమి చేయను? అది నా నిస్సహాయత. చేతకానితనం. పిరికితనం. పోరాడకపోతే పోయే కానీసం ఆ దిశగా ఆలోచించాలి అని కూడా అనిపించని విరక్తి.
ఇవే కాదు. ఇంకా చాలా విషయాల్లో ఏమీ చేయలేకపోతున్నాననే నిస్పృహలోంచి పుట్టిందే కదా ఓ ఆలోచన. చిన్న గీత, పెద్ద గీత సామ్యం వెనుక స్వాంతన పొందిన అలజడి.
చెడు సమాజంలో పెద్ద గీత లాగా, మంచి చిన్న గీత లాగా ఉన్నప్పుడు, చెడుని ఎదిరించే సత్తా, దమ్ము లేనప్పుడు ఏమి చేయాలి? మంచి గీతను పెద్దదిగా చేయాలి. ఎంత పెద్దదిగా చేయాలి, చిన్న గీత కనపడనంతగా. పట్టించుకోనక్కరలేనంతదిగా.
నాలో ఆవేశం లేకపోలేదు. కానీ దాన్ని తీర్చుకోవడానికి, నా మనస్తత్వానికి, ఆలోచనా ధోరణికి సరిపడే మార్గాన్ని నేను తెలుసుకోగలిగాను.
అదే ప్రతి వ్యక్తీ దేశం కోసం ఆలోచించేటట్లు చేయడం, విధిగా సమాజం కోసం తన వంతు తను శ్రమించేలా చేయడం. ఆ ఆశయంలోంచి పుట్టుకొచ్చిందే Likeminded Groups వేదికను ఏర్పాటు చేయాలనే ఊహ.
: నందు ఉంచబడ్డది; About Me