విఫల యత్నం – 1

పిల్లి మెడలో గంట కట్టే సమయం ఎప్పుడు? నేను రక్తదానం చేయాలి అనుకున్న దగ్గర నుంచి ఏ రోజు ఆ విషయాన్ని విస్మరించలేదు. అయినా ఏమి లాభం!! ఎవరికైనా అత్యవసరం అంటే ఇద్దాములే అనుకున్నా. అలాంటి రోజు రానే వచ్చింది.

ఓ రోజు రాత్రి రతన్ గారు ఫోన్ చేసి, పక్క రోజు కేర్ ఆసుపత్రిలో ఎవరికో ఆపరేషను జరుగుతుంది. రక్తం అవసరం అవచ్చు. అతనిది A +ve, నువ్వు ఇస్తావా అని అడిగారు. ఉమారతన్ గారు డాక్టరు కదా ఆవిడ నా బరువు 47 kgs సరిపోతుంది అని చెప్పారు. రతన్ గారు చెప్పారు, ఇక ఎవరూ దొరక్కపోతే మాత్రమే నిన్ను పిలుస్తాను అని.

ఇక అప్పటి నుంచి చూడాలి నా సంగతి. ఫేక్ ఇట్ టు మేక్ ఇట్ అన్నట్టుగా … నేను కడుపు నిండా తిన్నాను, ఆటో ఎక్కాను,  ఆసుపత్రికి వెళ్ళాను, రతన్ గారు, ఉమ గారు పలకరించారు, బ్లడ్ లాబ్ దగ్గరకు తీసుకువెళ్ళారు, నన్ను ఓ టేబిల్ పై పడుకోబెట్టారు… ఇంత వరకు బాగానే ఉంది. అప్పుడే నర్సు సెలైన్ సూది తీసింది. అమ్మో….. కళ్ళు తెరిచేసి పరుగో పరుగు అంతే. ఇలా ఎన్ని సార్లు ఊహించుకున్నానో ఆ రాత్రి లెక్కే లేదు. చాలా సేపు నిద్రపట్టలేదు. ఎప్పుడో నిద్రపోయా.

నాకు సైనికులంటే మహా గౌరవము. వాళ్ళు ఎండకు ఎండి, వానకు తడుస్తుంటారు కాబట్టి వాళ్ళకి సంఘీభావంగా నేను మిట్టమధ్యాహ్నం ఎండలో చెప్పులు లేకుండా నున్నటి నేల మీద నడుస్తూ ఉండేదాన్ని. అదో వెర్రి. అందుకే ఎండలో నడిచే విషయంలో సగటు మనిషికన్నా నా సహనశక్తి కొంచెం ఎక్కువే. ఈ సాధన మూలంగానేమో.

పోనీ అలా ఆలొచిద్దామని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని….నేను రక్తం ఇవ్వలేనా……షేం షేం… ప్రశాంతి…. గుర్తు తెచ్చుకో….. నీ సైనికులు సరిహద్దుల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారు. వారికంటే ఈ చిన్న సూది నీకు నొప్పి చేస్తుందా!! గుండె నిండా గాలి పీల్చుకో….నీ దేశ జెండాని ఊహించుకో.. ఇలా అన్నమాట… సెల్ఫ్ ఎంకరేజ్ మెంట్. ఊహూ లాభం లేకపోయింది.

ఆ తరువాత ఇంకొకలాగా ఆలోచించా. నీ జీవితంలో అత్యంత దు@ఖభరితం అని ఏది అనుకుంటావో అంతకన్నా పెద్ద బాధ కాదు కదా ఇది. ఊహించుకో…. గుర్తు తెచ్చుకో….నీవు బాధపడినప్పుడు కలిగిన భావాలు…ఆ బాధలో ఈ నొప్పి స్పృహలోకి రాదు అనుకున్నా….. ఇదీ ఫలించలేదు…. :(

ఇప్పటికీ టి.వీ.లో ఎవరికైనా సూది పొడుస్తున్నట్టు చూపిస్తే నేను కళ్ళు మూసుకుంటా. ప్రస్తుతానికి ఇంజెక్షను మాత్రమే అలవాటు అయింది.

ప్రత్యుత్తరమిమ్ము