రక్తదానం

నేను జీవితంలో ఏ సహాయమైనా చేస్తాను కానీ రక్తదానం మాత్రం చేయను అనుకునేదాన్ని. అదేదో నీరసం వస్తుందనో, లేకపోతే ఇతరత్రా వ్యాధులు సంక్రమిస్తాయనో కాదు…. కేవలం సూది/ఇంజెక్షను అంటే ఉన్న భయం వల్ల. డాక్టర్లన్నా కూడా నాకు చాలా భయం ఎందుకంటే ఇంజెక్షను వేస్తారని. ఇప్పటికి జీవితం మొత్తమ్మీద ఇన్నేళ్ళలో ఓ పది, పన్నెండు సార్లు ఇంజెక్షను చేయించుకుని ఉంటానేమో అంతే. డాక్టరు దగ్గరకు తీసుకెళతాను అంటే జ్వరం లేకపోతే వస్తుంది, ఉంటే పోతుంది. అంత భయం అన్నమాట.

ఓ రోజు జ్వరంగా ఉంది. మా నాన్న క్యాంపు నుంచి వచ్చి మా అమ్మని, నన్ను అరిచారు, డాక్టరు దగ్గరకు వెళ్ళలేదని. పొద్దునే తీసుకెళ్తాను అన్నారు. ఇక రాత్రి నాకు నిద్రపడితేనా! ‘బాబా, బాబా, నాకు డాక్టరు వద్దు. జ్వరం తగ్గించెయ్యి. మా నాన్న నన్ను డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళద్దూ. ఆయన చరిత్రలో ఓ భక్తుడు భజన చేసుకుంటూ ఆయనను స్మరించి నిద్రలేకుండా చేస్తే, నేనేమో ఈ రకమైన స్మరణ :)

ఎప్పుడు పేపరులో ఫలానా బ్లడ్ గ్రూపు కావాలి అని చదివినా నాదేమిటో, నేను సాయం చేయలేకపోతున్నానే అనిపించినా కొంచెం పట్టించుకునేదాన్ని కాదు. ఇంకేదైనా చేయచ్చు కానీ ఇది కాదు అనుకున్నావు కదా మరి ఊరుకో అని నాకు నేనే సర్దిచెప్పుకునేదాన్ని.

నెల్లూరులో శ్రీ తిక్కవరపు సుకుమార్ రెడ్డి గారు ఉన్నారు. స్వచ్ఛంద రక్తదాతల సంఘాన్ని స్థాపించి ఎంతోమంది చేత నేత్రదానం చేయించిన వ్యక్తి. రక్తదానం చాలా సార్లు చేసారు. ఈయన చేత హైదరాబాదులో సభ పెట్టించిన రోజే సౌమ్యని కూడా మొదటిసారి కలవడం. ఆయన నా చేత ఎక్కడ రక్తదానం చేయించేస్తాడా అని భలే భయంగా ఉండేది నాకు. ఎందుకంటే నాకు భయం అని నేను చెప్తే ‘అబ్బే నొప్పేమీ ఉండదు. ఈ సారి నేను చేయిస్తాలే నీ చేత, నెల్లూరు వచ్చినప్పుడు నన్ను కలువు ‘ అన్నారు. వారి శ్రీమతి గారు కూడా ఎన్నో సార్లు రక్తదానం చేసారు.

నా బ్లడ్ గ్రూపు కూడా నాకు తెలీదు. ఉద్యోగం లో చేరేటప్పుడు అడిగితే రిసెప్షనిష్టుని నీకు తోచిన బ్లడ్ గ్రూపు వ్రాసెయ్యి అని చెప్పా. తను O +ve  కామన్ కదా అని అదే వ్రాసింది. అలాంటి రకాన్ని నేను. కానీ ఎప్పుడైనా ఈమెయిల్ ఫార్వార్డుల్లో గ్రూపుని బట్టి వ్యక్తుల మనస్తత్వాలు అని చూసినప్పుడు ఏ గ్రూపుతో నా లక్షణాలు సరిపోతాయా అనుకునేదాన్ని.

అలాంటి నాలో మార్పు ఎలా వచ్చింది. Inspiration విభాగంలో మరో టపా వ్రాస్తాను.

4 స్పందనలు

  1. ఎవరబ్బా ఆ ఇన్స్పిరేషన్?

  2. యేహ్… ఆ సుకుమార్ రెడ్డి గారి స్పీచ్ నాలో అప్పుడు చాలా స్పూర్తి కలిగించింది…. బహుశా నేను ఎక్కడిక్కడ ఆగిపోయినా మళ్ళీ లేచి ఏదన్నా చేయడానికి ప్రయత్నిస్తున్నాను అంటే దానికి అప్పటి ఆ స్పీచ్, ఆ తరువాత TMAD తో ఉన్న ఒకప్పటి పరిచయం ముఖ్య కారణాలేమో…

  3. మనిషి మరో మనిషిని సృష్టించలేడు. ఈ విధంగా తప్ప. చాలా మంచిపని రక్తదానం.

ప్రత్యుత్తరమిమ్ము