జైరాం

ఈ అబ్బాయిని మురళి పరిచయం చేసాడు. అతని కొలీగ్ . 2005 చివర్లోనో, 2006 మొదట్లోనో ఒక మంత్లీ మీటింగ్ కి తీసుకొచ్చారు. అప్పట్లో ఎక్కువ మంది ఉండేవారు కాదు. నేను, సౌమ్య, మురళి, చంద్ర గారు. ఎక్కువగా మేము నలుగురమే ఉండేవాళ్ళము. ఏదో మాట్లాడుకునేవాళ్ళము. మాట్లాడేదాన్ని అంటే ఇంకా సబబుగా ఉంటుందేమో. మిగతా ముగ్గురు మాట్లాడేది తక్కువే కాబట్టి.

ఈ అబ్బాయి కూడా పెద్దగా మాట్లాడలేదు. రాజు కేసు అప్పుడు అనుకుంటా. మీటింగ్ అయిపోయింది. మళ్ళీ వచ్చే నెల మీటింగ్ లో కలుస్తారా, లేదా అని సరదాగా అడిగా. సోషల్ వర్క్ అంటే ఇష్టమేనా అని అడిగా. నేను తప్పకుండా వస్తాను. పార్టిసిపేట్ చేస్తాను అని అన్నాడు. మురళి కూడా అన్నారు. ఇంకా ఇద్దరు, ముగ్గురు ఆసక్తి ఉన్నవారే. కొత్తగా వచ్చిన ఈ బాచ్ కొంచెం ఇలాంటి పనులు చేయాలనే ఆలోచనలున్నవారే అని. అప్పుడు నాకంత నమ్మకం కలగలేదు. ఏమిటో నెమ్మదిగా ఉన్నాడు అనుకున్నా.

చెప్పినట్టుగానే వీలైనంత వరకు ప్రతి మీటింగ్ కి వచ్చేవాడు. ఒకటి, రెండు మీటింగుల తరువాత శ్రీనివాస్ ని కూడా తీసుకొచ్చాడు. అప్పుడు శిరీష కేసు నడుస్తోంది. అదే రోజు సుందర్ కూడా మీటింగ్ కి మొదటిసారి వచ్చారు.

విద్య తనకు ఇష్టమైన ఏరియా ఆఫ్ వర్క్ అని చెప్పేవాడు. అనికేపల్లి స్కూలుకి చాలా సార్లు వెళ్ళాడు. శివశంకర్ ని కూడా ఒకసారి తీసుకువెళ్ళాడు. ఈ అబ్బాయిలో నాకు నచ్చే గుణం ఏమిటంటే అప్ డేట్ ఇస్తాడు.

పరిచయం పెరిగింది. సరదాగా మాట్లాడుకోవడం, జోకులేసుకోవడం మాములయ్యింది. గ్రూపు సభ్యులందరినీ తలస్సీమియా పరీక్షకి తీసుకెళుతుంటే తిను రానన్నాడు. ఇక ఎంత ఏడిపించామో లెక్కలేదు. ఎవరినైనా ప్రేమించావా, తలస్సీమియా మైనరు అయితే ఎలా అని భయపడుతున్నావా అంటూ….పాపం :) కిందకి దిగాక కూడా ‘జయరాం, జయరాం’ అంటూ ఒకటే గొడవ. వస్తాను అన్నదాక :)

అయితే ఓ మామూలు అబ్బాయిలాగే అనుకునేదాన్ని. అంటే ఇప్పటి యువకుల్లాగే. ఏదో మంచి పనులు చేయాలని ఉంది. సమయాన్ని వేస్టు చేసే బదులు ఏదో ఇలా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడు అనుకునేదాన్ని.
కానీ లక్ష్మీ నరసమ్మ కేసు విషయంలో మాత్రం ఈ అబ్బాయి ఎంత సున్నితమైనవాడో తెలిసింది. ఎంతగా ఆలోచిస్తాడో అర్థమైంది. ఇతనికుండే నిబధ్ధత తెలిసింది. అంతవరకు అభిమానమే ఉండేది, కానీ  అర్థమైన క్షణం నుంచి తిను అంటే గౌరవం కూడా కలిగింది. 

లక్ష్మీ నరసమ్మ కేసు అప్పుడు అందరమూ తెగ బిజీగా ఉన్నాము. అయితేనేమి వాణి, చైతన్య, జైరాం లు ముందు ఈ పని చూసి ఆ తరువాత ఆఫీసులో పని చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల రాత్రి దాకా పని చేయాల్సి రావడమే కాకుండా, వీకెండ్ కూడా ఆఫీసుకు వెళ్ళాల్సొచ్చింది వాళ్ళకి. 

తిను పిల్లలని, కృష్ణాకొణకంచి గారి సహాయంతో సుందర్ ఆసుపత్రిలో వదిలిపెట్టి ఆఫీసుకి వెళ్ళాడు. పదకొండు ప్రాంతంలో నాకు ఫోన్ చేసాడు. మీరు పిల్లలని కలిసారా అంది. నేను కలుస్తాను అని మాట ఇచ్చాను. కానీ ఆఫీసులోనే ఇంత టైము అయింది. వాళ్ళు ఏమైనా తిన్నారా, నా గురించి అడిగారా అని అడిగాడు. అసలు ఆ క్షణం నాకు ఎంత ఆనందం కలిగిందో ఈ అబ్బాయి నిబద్ధత చూసి. ఇంత సున్నితంగా ఆలోచిస్తాడా… తను వస్తానని మాటా ఇచ్చి వెళ్ళలేకపోయినందుకు ఎంత బాధపడుతున్నాడు అనుకున్నా. అలాగే పిల్లలు అన్నం తిన్నారా అని అడగడంలో అతని బాధ్యతాయుత ధోరణి నచ్చింది.

ఇంకా ఇలా చెప్పాడు. ఆసుపత్రులు ఎలా ఉంటాయో కదండీ, మనం ఏమీ చేయలేమా, నేను వీళ్ళ గురించే ఆలోచిస్తున్నాను. ఆమెకు ఏమైనా అయితే వీళ్ళ పరిస్థితి ఏమిటి అని. ఇక్కడికి వచ్చాను, పని  చేస్తున్నానే కానీ ఈ ఆలోచనలు వదలడం లేదు అంటూ.

అప్పటికప్పుడే నేను గ్రూపుకి ఒక మెయిల్ కొట్టా ఈ అబ్బాయి భావాలతో…….చర్చిద్దాము అని.

అంతే. ఇక అప్పటి నుంచి తిను అంటే ఆత్మీయతా భావము. తనకి కూడ నేనంటే గౌరవము. మురళి గురించి, శ్రీనివాస్ గురించి మాట్లాడుకుని వీళ్ళని ఎలా ఏడిపిద్దాము అనుకుంటూ ఉంటాము. అప్ డేట్స్ ఏంటి, సీక్రెట్స్ ఏంటి అని మాట్లాడుకుంటాము… వాళ్ళని అల్లరి పెట్టడానికి :)  

ప్రత్యుత్తరమిమ్ము