బ్లాగు సాక్షిగా – నేను, ముద్రారాక్షసాలు

 నాకు అస్సలు నచ్చవు. కానీ ఈ బ్లాగు విధానం నాకు కొంచెం తలకాయనొప్పి గానే ఉంది. బహుశా Interface కారణం కావచ్చు. తెలుగుపీపుల్ లో వ్రాయడం అలవాటైపోయి నాకు ఇంక ఏదీ అంతగా నచ్చడం లేదు. ఎడిట్ చేసుకోవడం పెద్ద సమస్య. అసలే సమయం చిక్కడం లేదు.

నిన్న ఎలాగోలాగ ఒక పోస్టు వ్రాసా. నిజానికి నేను కనీసం మా సభ్యుల అందరి గురించి వ్రాసే వరకు ఈ బ్లాగు అప్ డేట్ చేస్తున్న విషయం ఎవరికీ చెప్పకూడదు అనుకున్నా. కానీ ఇవాళ రాత్రి నిన్నటి నా పోస్టుకి మూడు వ్యాఖ్యానాలు చూసి వీళ్ళకి ఎలా తెలిసిందబ్బా అనుకున్నా. తరువాత మొదటి పేజిలో నా వ్యాసం తాలుకు లంకె కనపడింది. ఓహో కొత్త పోస్టుల గురించి లిస్ట్ చేస్తారేమో అలా నా పోస్టు వీరికి కనిపించి ఉంటుంది అనుకున్నా. నాగరాజా గారు తరచుగా వ్రాస్తూ ఉండండి అని వ్రాసారు. మరింకేం ఇవాళ ఏమీ వ్రాయద్దు అనుకుని కూడా వ్రాయడం మొదలుపెట్టా.

పూర్తిగా చదివి, తప్పులు చూసుకుని ఎడిట్ చేసుకునేంత తీరిక లేదు. ఎప్పుడో ఒకరోజు అలా చేయచ్చులే, ఈ లోపు అసలంటూ వ్రాయదలుచుకుంది వ్రాస్తూపోదాము అనుకున్నాను. ముద్రారాక్షసాలకు క్షంతవ్యురాలిని. నాకు తెలుగు రాదు అనుకోకండి. కొద్దో, గొప్పో బాగానే వచ్చు.

నిజానికి నేను No Comments ఆప్షన్ ఏదైనా ఉంటే నా బ్లాగులన్నిటికీ అలా సెట్ చేసుకుందామనుకున్నాను. సౌమ్య ని అడిగితే తెలియదు అని చెప్పింది. నాకు దాని గురించి వెతికేంత సమయం లేదు. అలా వదిలేసాను. కారణం ఏమిటంటే వ్యాఖ్యానాలకి రిప్లై ఇచ్చే సమయం కూడా ప్రస్తుతం నాకు లేదు. అలాగని సమాధానం చెప్పకుండా ఉండలేను.

ఒక వేళ నా నుంచి సమాధానం ఆలస్యమైతే మరోలా అనుకోకండి. నా పోస్టులు ఓపికగా చదవడమే కాకుండా, వ్యాఖ్యానాలు చేసే అందరికీ హృదయపూర్వక కృతజ్ణ్జతలు.

11 స్పందనలు

  1. మీ బ్లాగును జల్లెడకు కలపడం మరో కారణం అయి ఉండొచ్చు.

    http://www.jalleda.com

  2. మీరు ఏదైనా బ్లాగు ఎడిటర్ వాడితే మంచిది. ఈ బాధలు ఏమీ వుండవు. జ్యోతి గారు ఇప్పటికి వెయ్య టపాలు రాసి పడేసారు అంటే అర్ధం చేసుకోవచ్చు, ఇది ఎంత సులభమో :-)

  3. ముద్రారాక్షసం అంటే అక్షరదోషం కాదండీ! అది రాక్షసుడు అనే మంత్రి యొక్క ముద్ర.(సీల్) ఒక వేళ మీకు ఇదీ తెలిసీ జోక్ గా వాడితే, నా వ్యాఖ్య పట్టించుకోకండి.

  4. నా అభ్యర్ధనను మన్నించినందుకు కృతజ్ఞతలు. దయచేసి నో-కామెంట్స్ గురించి ఆలోచించవద్దు! :) ఇకపోతే, మీరు రాసిన టపాల వల్ల బుర్రలో చురుకుదనం కలిగి కొన్ని ఆలోచనలు వచ్చాయి… త్వరలో ఒకట్రెండు టపాలు రాస్తాను. ఇక ముద్ర-రాక్షసాల గురించి: -తప్పులెన్నువారు తండోప తండంబు, ఉర్వి జనులకెల్ల… హహ్హహ్హా…

  5. అయ్యో నాగరాజా గారు, నేనేదో పెద్ద పండితుడినని ఎదుటివాళ్ళని ఎత్తి చూపటానికి ఆ టపా రాయలేదండీ. ఆ పదం పొరపాటున వాడారేమో అని అడుగుతూనే చెప్పానుకదండీ. నా బ్లాగుల్లోనూ సవాలక్ష తప్పులు ఉండొచ్చు. ఒకరి తప్పులు మరొకరు తెలుసుకొని సరిదిద్దుకోవటం మంచిదేకదా? ఏది ఏమైనా, ప్రశాంతి గారు, మీరేమైనా బాధపడితే క్షమించండి. మీకూ ఇది కష్టం అనిపిస్తే.

  6. వికటకవి గారు,

    మీకు కృతజ్ణ్జతలు. నేను ముద్రారాక్షసాలు అంటే అక్షరదోషాలు అని అనుకున్నాను.

    సుధాకర్ గారు,

    బ్లాగు ఎడిటరు కూడా చూస్కోవాలా!! నా వల్ల కాదేమోనండి. ఏదో వ్యాఖ్యలు చూసే కొద్దీ, వ్రాసే వాడికి చదివేవాడు లోకువ అన్న చందంలో, చదువేవాళ్ళు ఉన్నారుగా, వ్రాయాలనే ఉత్సాహం. అంతే.

    నాగరాజా గారు,

    సమాధానాలు వ్రాయలేనని ‘నో కామెంటూ అనుకున్నానండి.

  7. ప్రశాంతి,
    మీ బ్లాగు అందరికీ చూపించడానికి ఇంకా సిద్దం కాలేదు అనుకుంటే “Publish” బదులు “Save” నొక్కండి. కుడి వైపు వున్న పట్టికలో Post Statusను విడమర్చి అది Draftను సూచించేట్లు నిర్దారించుకోండి.

    ఇక ప్రత్యేకంగా (ఇది మాకు అభిలషణీయం కాదు) ఏదైనా బ్లాగుకు వాఖ్యలు (comments) వద్దనుకుంటే అదే కుడి వైపు Discussion ను విడమర్చి Allow Commentsను ఎన్నుకోకండి.

    బ్లాగులో రాయడాన్ని ఆస్వాదించండి.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  8. నాకు ఉన్న కొద్ది జ్ఞానం తో చెప్పేదేమిటంటే “ముద్రారాక్షసం” అనేది విశాఖదత్తుడు వ్రాసిన కావ్యం పేరు. ఇది చాణక్యుడు, రాక్షసామాత్యుల మద్య జరిగే సన్నివేశాలని అద్బుతంగా చెప్తుంది. “తప్పులెన్ను వారు తండోపతండంబులు…” అనిపిస్తే క్షంతవ్యుడిని.

  9. @వికటకవీశ్వరా,

    మిమ్మల్ని ఉద్దేశించి వ్రాసిన వ్యాఖ్య కాదు అది, మీరు రాసిన దాంట్లో నాకు తప్పేమీ కనిపించలేదు. నేను “ముద్ర-రాక్షసాలను”: ముద్ర => అచ్చు/ప్రింట్; రాక్షసాలు => రాక్షస-తప్పులు/బిగ్ మిస్టేక్స్/బ్లండర్స్‌గా స్వేచ్ఛానువాదం చేసుకొని ప్రశాంతి గారికి సమాధానం రాసాను. ఇక్కడ నేను నిజంగా ఎవరి తప్పులను ఎన్నలేదని గమనించ ప్రార్థన :)

  10. ఏదో బెంగాలీ నవలని తెలుగు సినిమా తీసినట్టుంది ఈ టపామీద వ్యాఖ్యల ప్రహసనం. ఇంకాసేపుంటే “వికటకవి బ్రదరూ, నిన్నపార్థం చేసుకున్నాను” అంటే “నాగరాజ సోదరా, నా తప్పుకి నిష్కృతి లేదు” అనేట్టుగా ఉన్నారు! :-) అహో బ్లాగ్వీరులారా, శాంతించండి. వికటకవీశ్వరా (ఈ బిరుదు నాకు నచ్చింది), ముద్రారాక్షసం పదబంధాన్ని వాడుక తెలుగులో ఎప్పణ్ణించో “అచ్చు తప్పు”లకి సమానార్ధంగా వాడుతున్నట్టు మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వాడుక ఎవరు మొదలు పెట్టారో నాకిప్పుడూ గుర్తులేదు – ఎవరో పత్రికా చమత్కారులు మొదలు పెట్టారు. దాని వాడుక ఎంత బలమైనదంటే, చాళా మంది తెలుగు వాళ్ళకి ప్రశాంతిగారికి మల్లేనే, ముద్రారాక్షసమంటే అచ్చు తప్పులే గుర్తొస్తాయి, సంస్కృత నాటకం గుర్తుకి రాదు. (అవును, అది కావ్యం కాదు, నాటకమే). దీన్నే ముళ్ళాపూడి వెంకట్రవణ తనదైన శైలిలో “అప్పుతచ్చులు” అని పిల్చాడు ముద్దుగా.
    ఇంతకీ ప్రశాంతి గారూ, మీరు వాడిన వాడుక సరైనదే.

  11. ముద్రారాక్షసాలని సింపుల్ గా అక్షరదోషాలు అనచ్చు.(ఇక్కడ ముద్రించడం అనే ప్రక్రియ లేదు కాబట్టి) :) ఇక ఈ బ్లాగు నాకు ఇప్పుడే సెర్చిలో దొరికింది. సెర్చి టెర్మ్ ఏమిటంటారా ఇంకేమిటీ?. “ప్రశాంతి”

ప్రత్యుత్తరమిమ్ము