నేను – బ్లాగు

నేను బ్లాగు వ్రాయాలి అని కొంచెం సీరియస్ గానే పూనుకోవడానికి కారణమైన వివరం.

వ్రాయడం మానేసి రెండు సంవత్సరాలవుతోంది. అంటే వ్రాసే ప్రయత్నం కూడా పెద్దగా చేయలేదు. సమయం లేక. సరిగా ప్లాన్ చేసుకుంటే మనం ఏమి చేయలనుకున్నా చేయచ్చు. కానీ ఒక రకమైన Writers Block లాంటిది కలిగింది.

పొద్దు వెబ్ మాగజైను కు వ్యాసం వ్రాయమని ముందుగా కశ్యప్ అడిగారు. గ్రూపుకి సంబంధించిన అభిప్రాయభేదాల్లో అతని మీద కోపంగా కూడా ఉన్నానేమో….. మీరే వ్రాయండి… అని సమాధానమిచ్చి ఊరుకున్నాను. ఆ తరువాత రెండు, మూడు రోజులకు త్రివిక్రం గారు కూడా అడిగారు. అప్పుడు కొంచెం సీరియస్ గా తీసుకున్నా. సరేనండి తప్పకుండా వ్రాస్తాను అని అన్నాను. అప్పుడు ఆఫీసులో పని అంతగా లేనందువల్ల వ్రాయగలనులే అనుకున్నా. అదే సమయంలో వెబ్ సైటు అప్ డేట్ చేసే ప్రక్రియలో ఉన్నా.

కానీ అసలు పదాలు దొరికితే కదా. ఒకప్పుడు ఆగకుండా వ్రాసేసేదాన్ని. అబ్బ ఇంత పెద్దదైపోయిందే అనిపించేది. అంతకు కొద్దిరోజుల ముందర రాధిక గారి ద్వారా భూమిక సత్యవతిగారు పరిచయం అవడం, ఆవిడ నాకు భూమిక మాగజైనులు కొన్ని పంపడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని వ్యాసాలు చదివి ఏమేమో వ్రాయాలనుకున్నా. మనసులో ఏ మూలో పట్టించుకోకుండా పడి ఉండే భావాలన్నిటినీ కదిపినట్లైంది. కానీ వ్రాయలేకపోయా. ఎంత బాధ కలిగిందో చెప్పలేను. ఏమైపోయాను నేను అనుకుంటూ….

త్రివిక్రం గారికి మాట ఇచ్చాను కాబట్టి ఎలాగైనా వ్రాయాలి అని మొదలు పెట్టి అతి కష్టం మీద రోజుకి రెండు పేరాగ్రాఫులు రాసి పంపేదాన్ని. వ్రాయడమైతే ఏదో వ్రాసానే కానీ నాకు ఏ మాత్రం నచ్చలేదు. తీరా పోస్టు చేసే రోజు వచ్చినప్పుడు నేను, త్రివిక్రం గారు ఆన్ లైనులో మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను పూర్వాశ్రమంలో తెలుగుపీపుల్ వెబ్ సైటులో ఎడిటర్ గా పని చేసిన దాన్ని కావడం వల్ల నా వ్యాసాన్ని నన్నే ఎడిత్ చేయమన్నారాయన.

అలా ఎడిట్ చేస్తున్నప్పుడు ఇక దానికి ఒక రూపంలోకి తేగలిగాను. అటు వాక్యాలు ఇటు, ఇటు వాక్యాలు అటు చొప్పున cut, copy, paste చేసి ఎలాగైతేనేమి నేను అనుకున్న రూపాన్ని ఇచ్చాను. త్రివిక్రం గారు ఎంతో ఓర్పుగా నేను పూర్తిచేసేంతవరకు మేలుకునే ఉన్నారు. ఆ రోజు ఆయన ఆ సపోర్టు ఇవ్వకుండా ఉంటే, నాకు తగినంత సమయాన్ని ఇవ్వకపోయి ఉంటే, ఆ వ్యాసం అంత చక్కగా వచ్చి ఉండేదే కాదు.

పూర్తిగా చదువుకున్నాక నాకు కలిగిన ఆనందం వర్ణించలేనిది. హమ్మయ్య మళ్ళీ వ్రాయగలిగాను అని.  అప్పుడు అనుకున్నాను. వ్రాస్తూ ఉండాలి. లేకపోతే అలవాటు తప్పిపోతుందని.

వాయిదా వేస్తూ వచ్చి చివరికి ఎలాగైతేనేమి ఓ శనివారం కొన్ని పోస్టులు వ్రాసాను.

ప్రత్యుత్తరమిమ్ము