చిన్నప్పుడు, చందమామ కథల్లోనో, తెలుగు పాఠాల్లోనో ఏనుగు ప్రస్తావన వచ్చినప్పుడు, “ఏనుగు బతికినా వేయి వరహాలే, చచ్చినా వేయి వరహాలే” అనే నానుడి చదివి తెగ బాధపడేదాన్ని. ఇంకా చెప్పాలంటే కుళ్ళుకునేదాన్ని. అమ్మమ్మ, అమ్మ కూడా తరచుగా ఈ మాట అనేవారు. మనిషి చస్తే ఏమీ ఉపయోగం లేదు అంటూ. ఎంతో నిరుత్సాహంగా అనిపించేది. మనం చస్తే మన వల్ల ఏమీ ఉపయోగం లేదా అనుకుంటూ.
కానీ గత కొద్ది నెలలుగా నాకు అలాంటి బాధ లేదు. నేత్రదానం గురించి తెలిసినా అది నాకు అంత ఉత్తేజాన్నివ్వలేదు. అవయవదానం గురించి తెలిసిన దగ్గర నుంచి మనసు సమాధానపడిపోయింది. ఏదో తెలియని తృప్తి. సాంత్వన. మనుషులు చచ్చినా కూడా ఉపయోగమే.
చాలా సున్నితమైన అంశం. చనిపోయాక కళ్ళు ఇచ్చేస్తే వచ్చే జన్మలో మనకు కళ్ళు ఎలా అనిపించేది, ఆ ఆలోచనే ఎంత అసంబధ్ధంగా తోచినా సరే. కానీ బాబా (షిర్డీ బాబా) చెప్తే చేయడానికేమిలే అని అనుకునేదాన్ని. కానీ అడగకుండానే నా కళ్ళను దానం చేసేందుకు LV Prasad Eye Institute లో డోనార్ గా రిజిష్టరు చేయించుకున్నాను.
చావు గురించి నాకు ఎన్నో ఆలోచనలున్నాయి. (మరొక పోస్టు రాయదగినంత.) వాటిని అలా ఉంచితే MOHAN Foundation రఘురామన్ గారి ఉపన్యాసం CSIM వారు ఏర్పాటు చేసిన సభలో వినడం జరిగింది. ఆ రోజు వరకు నా శవాన్ని ఏదైనా ఒక మెడికల్ కాలేజీకి పరిశోధనల నిమిత్తం ఇవ్వాలి అనుకునేదాన్ని. కానీ ఆ సెషన్ అయ్యాక మాత్రం నాకు నూకలు చెల్లినప్పుడు మామూలు మరణాన్ని కాక బ్రెయిన్ డెత్ ని ప్రసాదించమని బాబాని కోరుకున్నా. అది ఏమి ఆనందమో తెలియదు కానీ ఇప్పుడు నేను కూడా ఏనుగుతో సమానం అనే భావన. చిన్నప్పటి నుంచి ఏనుగుతో సాటి రాలేనని కుంచించుకుపోయిన మనసుకు విచ్చుకున్న భావన.
ఒక కవిత ఉంటుంది ఆయన ఉపన్యాసంలో. నాకు ఆ కవిత ఎంత నచ్చిందో చెప్పలేను. ఇలా సాగుతుంది.
నా కళ్ళు చూపు లేని వారికి దృష్టిని ప్రసాదించేటాత్లైతే, సంతోషంగా ఇస్తాను.
నా చెవులు ఓ చెవిటి వ్యక్తికి కిటికీ నుంచి బయట పడే వర్షపు చినుకుల శబ్దాన్ని వినిపిస్తే ఆనందంగా ఇచ్చేస్తాను.
నా శరీరంలోని ప్రతి అణువు మరో వ్యక్తి జీవితంలో కొత్త వెలుగులు నింపగలిగితే, నేను సంసిద్ధంగా ఉంటాను. ఇతరులకు ఉపయోగపడే దేన్నీ నా శరీరంలో మిగల్చవద్దు.
ఎంత అద్భుతమైన కవిత!! ఎంత చక్కని భావాలు!!
జైన మతంలో శవాలను కాల్చకుండా, పూడ్చకుండా రాబందులకు వేస్తారు, అలా చేయడాన్ని అత్యంత పవిత్రంగా వారు భావిస్తారు అని విని ఏమిటో ఈ నమ్మకాలు అనుకునేదాన్ని. అలాగే కాల్చడం, పూడ్చడాన్ని గురించి కూడా. అన్ని ఆలోచనలకు ఆస్కారం లేకుండా శవాన్ని మెడికల్ కాలేజీకిచ్చేస్తే!!
కానీ చిక్కంతా ఎక్కడొస్తుందంటే మనం ఇవతలి వైపు ఉంటేనే. వ్యక్తిగతంగా నేను బ్రెయిన్ డెడ్ అవ్వాలని, నా శవాన్ని మెడికల్ కాలేజీకివ్వాలని అనుకుంటున్నా, కానీ నాకు ప్రియమైన వారి గురించి నేను అలా ఆలోచించగలనా! ఆ ఊహే భయంకరంగా తోస్తుంది. భగవంతుడా నీవే చల్లగా కాపాడు అని మూగ ప్రార్థన తడబడే గుందె చప్పుడే దరువుగా సాగుతుంది.
ఇంతటి సున్నితమైన విషయంలో పాటుపడే MOHAN Foundation వారు అభినందనీయులు కదా!
: నందు ఉంచబడ్డది; Inspiration
కొన్నాళ్ళ క్రితం వరకు నేను అలాగే అనుకునేదానిని.కానీ మొన్నా మధ్య గూగుల్ లో శవాన్ని కొయ్యడం చూసాకా ప్రస్తుతానికి ఆ ఆలోచన పక్కన పెట్టాను.నేను మళ్ళా దాని గురించి ఆలోచించాలంటే నాకు ఆ భయం పోవాలి.అప్పటికి ఎంత కాలం పడుతుందో.చూడాలి.
http://video.google.com/videoplay?docid=152760580391486112